చిన్నమ్మపై ప్రశ్నల వర్షం

ABN , First Publish Date - 2022-04-22T13:43:19+05:30 IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన వరుస మరణాలకు సంబంధించిన కేసులో జయలలిత స్నేహితురాలు శశికళను గురువారం ప్రత్యేక బృందం

చిన్నమ్మపై ప్రశ్నల వర్షం

- కొడనాడు వ్యవహారంలో శశికళను విచారించిన దర్యాప్తు బృందం

- ఆమె ఇంట్లోనే ఆరుగంటల సేపు విచారణ


అడయార్‌(చెన్నై): దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన వరుస మరణాలకు సంబంధించిన కేసులో జయలలిత స్నేహితురాలు శశికళను గురువారం ప్రత్యేక బృందం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆమెకు దాదాపు 500 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ముఖ్యంగా, విచారణ బృందం అడిగే ప్రశ్నలకు శశికళ ఇచ్చే సమాధానాలు బట్టి ఈ విచారణ కొనసాగనుంది. జయ 2016 డిసెంబరు 5వ తేదీ అనారోగ్యంతో మృతి చెందగా, ఆ తర్వాత కొడనాడు ఎస్టేట్‌లో వాచ్‌మెన్‌ హత్య, దోపిడీ జరిగాయి. ఆ సమయంలో శశికళ అక్రమాస్తుల కేసుకు సంబంధించి పరప్పన అగ్రహారం జైలులో వున్నారు. వాచ్‌హెన్‌ హత్య తరువాత కొడనాడుకు సంబంధించిన మరో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జయలలిత మాజీ డ్రైవర్‌ కనగరాజ్‌ మాజీ సీఎం పళనిస్వామి సొంత పట్టణమైన ఎడప్పాడి వద్ద అనుమానాస్పద ప్రమాదంలో మృతి చెందగా, అదే రోజు మరో నిందితుడు సయాన్‌ కూడా రోడ్డు ప్రమాదంలో కన్ను మూయడం గమనార్హం. అంతేగాక అతని భార్య, కుమార్తె కూడా ఆ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదాలు జరిగిన కొద్ది రోజులకు కొడనాడు ఎస్టేట్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేసిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వరుస మరణాల పై పలు అనుమానాలు రేగాయి. ఈ హత్యల వెనుక ఏదో కుట్ర వుందని, తాము అధికారంలోకి వస్తే ఈ రహస్యాన్ని ఛేదిస్తామని అప్పట్లో ప్రతిపక్ష నేతగా వున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ఇందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన స్టాలిన్‌.. ఈ కేసులను విచారిస్తున్న నీలగిరి జిల్లా ప్రత్యేక కోర్టు అనుమతి పొంది మరీ దర్యాప్తును పునఃప్రారంభించారు. ఈ కేసు వెస్ట్‌ జోన్‌ ఐజీ సుధాకర్‌ సారథ్యంలో పోలీస్‌ బృందం విచారణ జరుపుతోంది. ఇప్పటిరకు రెండు వేల మందిని విచారించారు. వీరిలో అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే  ఆరుకుట్టి, శశికళ బంధువులు వివేక్‌, కొడనాడు ఎస్టేట్‌ మేనేజర్‌ నటరాజన్‌ తదితరులున్నారు. ఈ నేపథ్యంలో కొడనాడు ఎస్టేట్‌ గురించి పూర్తిగా అవగాహన ఉన్న శశికళ వద్ద విచారణ జరపాలని  బృందం నిర్ణయించింది. ఇందులోభాగంగా, ఐజీ సుధాకర్‌, నీలగిరి ఎస్పీ ఆశీష్‌ రావత్‌లతో కూడిన బృందం చెన్నై చేరుకుంది. ఈ బృందం గురువారం ఉదయం డీజీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఈ కేసు విషయమై చర్చించారు. ఆ తర్వాత టి.నగర్‌లో ఉన్న శశికళ ను విచారించేందుకు వెళ్ళారు. శశికళ ఇంటికి వెళ్ళిన పోలీస్‌ బృందంలో ఐజీ సుధాకర్‌, ఎస్పీ ఆశీష్‌ రావత్‌, ఏడీఎస్పీ కృష్ణమూర్తి (కేసు విచారణాధికారి), మహిళా డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ సహా మొత్తం 8 మంది ఉన్నారు. వీరిలో ఒక రైటర్‌ కూడా ఉన్నారు. ఉదయం 11 గంటల సమయంలో శశికళ ఇంటికి చేరుకున్న ఈ బృందం కొడనాడు ఎస్టేట్‌ గురించి, అందులోని విలువైన వస్తువులు, దాదాపు వంద గదుల్లో ఉన్న సామగ్రి తదితర అంశాలపై ప్రశ్నించింది. ఈ విచారణ వీడియో కూడా తీశారు. అయితే, శశికళ సమాధానాలను బట్టి ఈ విచారణ ఎన్ని రోజులు చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఐజీ సుధాకర్‌ వెల్లడించారు. అలాగే, అన్నాడీఎంకేకు చెందిన కీలక నేతల వద్ద కూడా కొడనాడు ఎస్టేట్‌ దోపిడీ, వాచ్‌మెన్‌ హత్య కేసులో విచారణ జరపాలని కూడా విచారణ బృందం భావిస్తుంది. ఇదిలావుంటే, ఈ విచారణ సందర్భంగా శశికళ ఉంటున్న ఆమె బంధువు కృష్ణవేణి ఇంటి వద్ద గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీ.నగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ భారతీరాజా, పాండిబజార్‌ ఇన్‌స్పెక్టర్‌ ధన సెల్వన్‌ ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగగా, శుక్రవార ఉదయం 10 గంటల నుంచి మళ్లీ శశికళను విచారిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా విచారణ అనంతరం శశికళ మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు బృందం అధికారులు అడిగిన వాటికి తాను సమాధానమిచ్చానని వెల్లడించారు.



Updated Date - 2022-04-22T13:43:19+05:30 IST