శృతిగా మారిన ప్రవీణ్.. మిస్ ట్రాన్స్‌జెండర్ గ్లోబల్‌‌ విజేత కథనం

ABN , First Publish Date - 2022-03-17T16:52:27+05:30 IST

‘‘నేను స్కూల్‌కి వెళ్లినప్పుడు అబ్బాయిలు నన్ను..

శృతిగా మారిన ప్రవీణ్.. మిస్ ట్రాన్స్‌జెండర్ గ్లోబల్‌‌ విజేత కథనం

‘‘నేను స్కూల్‌కి వెళ్లినప్పుడు అబ్బాయిలు నన్ను వేధించేవారు. పిల్లలు నా నడకను చూసి నవ్వుకునేవారు. అప్పుడు నేను మిగతా పిల్లల కంటే ఎందుకు భిన్నంగా ఉన్నానో కూడా నాకు తెలియదు. దీనిని నేను అర్థం చేసుకున్నప్పుడు, నా గుర్తింపును మార్చుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను...’’ ఈ మాటలు భారతదేశపు మొట్టమొదటి మిస్ ట్రాన్స్ గ్లోబల్ శ్రుతి సితార నోటి నుంచి వెలువడినవి.  బాల్యంలో తల్లిదండ్రులు ఆమెకు ప్రవీణ్ అని పేరు పెట్టారు. ఆమె చిన్నతనంలో చాలా మంది అబ్బాయిలు తమతో ఆడుకోవాలని అడిగేవారు. కానీ ఆమెకు ఆ ఆటలపై ఆసక్తి లేదని చెప్పేది. ఆ సమయంలో ఆమె అందాల భామ సుస్మితా సేన్‌, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌లను చూసి వారిలా మారాలని కలలు కనేది. కొంత కాలం అలానే సాగింది. కాలేజీ రోజుల్లో ట్రాన్స్‌జెండర్స్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తాను కూడా వాళ్లలో ఒకరినని ఆమెకు అర్థమైంది. తరువాతి  కాలంలో ప్రవీణ్.. శ్రుతి సితారగా అందరి ముందుకు వచ్చింది.


శ్రుతి తన గుర్తింపును అంగీకరించడమే కాకుండా మిస్ ట్రాన్స్ గ్లోబల్- 2021 టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆమె పలు మలయాళ, తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. కొన్ని అంతర్జాతీయ ప్రకటనల్లోనూ నటించింది. త్వరలో ఆమె బాలీవుడ్ సినిమాల్లో కూడా కనిపించనుంది. 29 ఏళ్ల శ్రుతి సితార కేరళలోని వైకోమ్‌కు చెందినది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేను పాఠశాలలో చదివేటప్పుడు అబ్బాయిలతో కాకుండా అమ్మాయిలతో మాడేదానిని. నేను నడిచే విధానం, ప్రవర్తించే విధానం కూడా అబ్బాయిల కంటే భిన్నంగా ఉంది. దీని వల్ల స్కూల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నేను 12వ తరగతికి వెళ్ళినప్పుడు, నేను ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉన్నానని గ్రహించాను. నా పాఠశాల విద్య పూర్తయిన తర్వాత, నన్ను కొట్టాయంలోని మహారాజా కళాశాలలో చేర్చారు, అక్కడ నేను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని కలిశాను. నేను మొదట నా గురించి మా నాన్నకు చెప్పాను. ఈ విషయం అతనికి ముందే తెలుసు కాబట్టి నన్ను సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టడంతో ప్రపంచానికి ఈ సంగతి తెలిసింది. నాకు ఇంకా శస్త్రచికిత్స జరగలేదు. నేను హార్మోన్ చికిత్స దశలో ఉన్నాను. మా అమ్మ ఈ లోకంలో లేదు. మా నాన్న, అన్న, వదిన ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలిచారు. వారి అండతో నేను నా చుట్టూ ఉన్న మనుషులతో పోరాడాల్సిన అవసరం లేదు, చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీకి చెందినవారు ఇంటిలోని వారి కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. 


మన కుటుంబం మనల్ని చక్కడా చూసుకుంటే ఈ ప్రపంచం మనల్ని చక్కగా చూసుకుంటుంది. మిస్ ట్రాన్స్ గ్లోబల్ 2021 విజేత కావడానికి ముందు, శృతి 2017లో ధ్వయా క్వీన్ కిరీటాన్ని కూడా గెలుచుకుంది. మిస్ ట్రాన్స్ గ్లోబల్ విజేతగా నిలిచిన తొలి భారతీయురాలు కూడా ఈమెనే. ఒక సందర్భంలో శృతి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి అందాల పోటీల కార్యక్రమాలను చూడటం అంటే ఇష్టం. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలని అనుకున్నప్పుడు నా స్నేహితులు సపోర్ట్ చేశారు. ఇంతకు ముందు కూడా నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. దీంతో నాకు కాన్ఫిడెన్స్ బాగానే ఉండేది. 2021 మిస్ ట్రాన్స్‌జెండర్ గ్లోబల్‌లో పాల్గొనడానికి నేను చాలా ఉత్సాహం చూపాను. కష్టపడి ఈ విజయం కోసం సిద్ధమయ్యాను. మిస్ ట్రాన్స్ గ్లోబల్ ఇండియా టైటిల్ గెలవడం నాకు మరచిపోలేని అనుభవం. కాగా మిస్ ట్రాన్స్ గ్లోబల్ టైటిల్ గెలుచుకోవడానికి శృతి చాలా కృషి చేయాల్సి వచ్చింది. సుమారు ఆరు నెలల పాటు, ఆమె వివిధ రౌండ్లలో పాల్గొంది. ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, UK, ఇండోనేషియా, జపాన్‌తో సహా 16 దేశాల నుండి వచ్చిన అభ్యర్థులను వెనక్కి నెట్టి శ్రుతి విజేతగా నిలిచింది.



Updated Date - 2022-03-17T16:52:27+05:30 IST