పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌!

ABN , First Publish Date - 2022-04-11T08:56:22+05:30 IST

పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ -నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ (70) పేరును..

పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌!

నేడే ఎన్నిక.. ఉమ్మడి అభ్యర్థిగా నామినేట్‌ చేసిన ప్రతిపక్షాలు


పీటీఐ తరఫున ఖురేషీ నామినేషన్‌

ఇస్లామాబాద్‌, ఏప్రిల్‌ 10: పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ -నవాజ్‌  (పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ (70) పేరును.. ప్రతిపక్షాలు ఉమ్మడిగా పాక్‌ ప్రధాని పదవికి నామినేట్‌ చేశాయి. రాజకీయ క్రీడలో చివరి బంతి వరకూ గెలుపు కోసం ఆడిన ఇమ్రాన్‌ఖాన్‌.. చివరికి విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో క్లీన్‌బౌల్డ్‌ కావడంతో పదవీచ్యుతుడైన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ప్రధానిని ఎన్నుకునే కార్యక్రమం మొదలైంది. పాక్‌ మాజీ అధ్యక్షుడు, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) సహాధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ.. షెహబాజ్‌ షరీఫ్‌ పేరును నామినేట్‌ చేయగా, ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఈ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ తన అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ పేరును ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పాక్‌ జాతీయ అసెంబ్లీలో కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు.

342 మంది సభ్యులున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో 172 మంది సభ్యుల మద్దతున్నవారు ప్రధానిగా ఎన్నికవుతారు. ప్రస్తుత బలాబలాల ప్రకారం షెహబాజ్‌ షరీఫ్‌ పాక్‌ నూతన ప్రధానిగా ఎన్నిక కావడం తథ్యంగా కనిపిస్తోంది. కాగా.. రాజ్యాంగం కోసం నిలబడినవారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు నామినేషన్‌ దాఖలుకు ముందు షెహబాజ్‌ ప్రకటించారు. ‘‘కోట్లాది మంది పాకిస్థాన్‌ ప్రజల ప్రార్థనలను ఆ భగవంతుడు ఆలకించాడు. మేం అన్నీ మరిచి ముందుకు సాగాలనుకుంటున్నాం. ఎవరిపైనా పగ తీర్చుకోం. లేకుండా ఎవరినీ జైలుకు పంపబోం.

చట్టం,  న్యాయం తమ పని తాము చేసుకుపోతాయి’’ అని ఆదివారం పాక్‌ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. ఇక.. 1400 కోట్ల రూపాయల విలువైన మనీలాండరింగ్‌ కేసులో షెహబాజ్‌ షరీఫ్‌, ఆయన కుమారుడు హంజాపై సోమవారం అభియోగాలు మోపనున్నట్టు పాకిస్థాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీకి సంబంధించిన ప్రత్యేక కోర్టు ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. షరీ్‌ఫగనక ప్రధాని పదవికి పోటీలో ఉంటే తమ పార్టీలోని ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేస్తారని పీటీఐ ప్రకటించింది.


బజ్వాను తొలగించే యోచన?

అవిశ్వాస తీర్మానానికి ముందు.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వాను తొలగించి, ఆయన స్థానంలో తనకు అనుకూలుడైన వ్యక్తిని ఆ పదవిలో నియమించేందుకు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రయత్నించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. శనివారం రాత్రి ఇద్దరు ‘ఆహ్వానం లేని అతిథులు’ హెలికాప్టర్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ఇంటికి చేరుకుని ఆయనతో 45 నిముషాలు ఒంటరిగా భేటీ అయినట్లు బీబీసీ ఉర్దూ ఒక కథనంలో పేర్కొంది. ఈ భేటీకి గంట ముందే.. ఆ ఇద్దరిలో ఒకరిని పదవి నుంచి తొలగించడానికి ఇమ్రాన్‌ ఆదేశాలు జారీ చేసినట్టు అందులో వెల్లడించింది. అయితే.. ఆయన ఊహించినట్టుగా అందులో కొత్తగా నియమితుడైన అధికారి రావడానికి బదులు, ఇద్దరు అనూహ్య వ్యక్తులు వచ్చారని పేర్కొంది. ఇమ్రాన్‌ ఆదేశాల మేరకు రక్షణ శాఖ ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయకపోవడంతో ఆయన ప్రయత్నం విఫలమైందని తెలిపింది. వారిద్దరూ కచ్చితంగా జనరల్‌ బజ్వా, పాక్‌ గూఢచార సంస్థ ఐఎ్‌సఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నదీమ్‌ అహ్మద్‌ అంజుమ్‌ అయి ఉంటారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, పాక్‌ ఆర్మీ మడియా విభాగం బీబీసీ ఉర్దూ కథనాన్ని ఖండించింది. దాన్ని ఆధారాలు లేని, అసత్యాలతో కూడిన కథనంగా అభివర్ణించింది. ఇమ్రాన్‌ఖాన్‌ కూడా.. తనకు అలాంటి ఆలోచన ఏదీ లేదని తనకు సన్నిహితులైన కొందరు పాత్రికేయులతో చెప్పినట్టు సమాచారం. మరోవైపు.. తాజా పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన క్యాబినెట్‌లోని మంత్రులు దేశం వీడి వెళ్లకుండా నిరోధించాలని కోరుతూ ఇస్లామాబాద్‌ హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. ఆ పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ జరపనుంది. కాగా.. పాక్‌లో అధికార మార్పిడి జరిగితే, ఇన్నాళ్లుగా దెబ్బతిన్న భారత్‌-పాక్‌ సంబంధాలు మెరుగవడానికి కొత్త దారులు తెరుచుకునే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మరో స్వాతంత్య్ర పోరాటం!

పాకిస్థాన్‌ 1947లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. కానీ.. దేశంలో పాలన మార్పునకు జరుగుతున్న విదేశీ కుట్రకు వ్యతిరేకంగా నేడు మరో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమైంది. ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుతోంది ప్రజలే.

- పదవీచ్యుతుడైన అనంతరం 

ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన తొలి ట్వీట్‌

Updated Date - 2022-04-11T08:56:22+05:30 IST