సినిమా రివ్యూ : శేఖర్ (Shekar Review)

Published: Fri, 20 May 2022 16:09:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ : శేఖర్  (Shekar Review)

చిత్రం : శేఖర్ (Shekar)

విడుదల తేదీ : మే 20, 2022

నటీనటులు : రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్, ప్రకాశ్ రాజ్, పోసాని, సమీర్, భరణీశంకర్, రాజేంద్ర, కిశోర్, అభినవ్ గోమఠం, అప్పాజీ అంబరీష్, కవిత, ప్రసన్నకుమార్ తదితరులు.

సంగీతం : అనూప్ రూబెన్స్

మాటలు : లక్ష్మీ భూపాల

నిర్మాతలు : బీరం సుధాకరరెడ్డి, శివానీ, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గారం 

దర్శకత్వం : జీవితా రాజశేఖర్

యాంగ్రీ‌స్టార్ రాజశేఖర్ (Raja shekar) నటించిన పలు చిత్రాలు ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాయి.  ఆ తర్వాత ఆయన చిత్రాలు సరైన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. అయితే ఐదేళ్ళ క్రితం వచ్చిన‘గరుడవేగ’ చిత్రంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’ చిత్రం పర్వాలేదనిపించుకుంది. ఆపై కొంత గ్యాప్‌తో ఆయన నటించిన చిత్రం ‘శేఖర్’.జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే (మే 20) థియేటర్స్‌లో విడుదలైంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఆసక్తికరమైన కథాకథానాలతో రూపొందిన ఈ సినిమా.. ప్రేక్షకుల్ని ఏ రేంజ్‌లో థ్రిల్ చేస్తుంది? రాజశేఖర్ ఈ సినిమాతో ఏ మేరకు మెప్పించారు అనే విషయాలు రివ్యూలో చూద్దాం.(Shekar Review)

కథ

శేఖర్ (రాజశేఖర్) వాలెంటరీ రిటైర్ మెంట్ తీసుకున్న ఫోలీసాఫీర్. అయినప్పటికీ అతడి బ్రిలియన్సీని పోలీసులు ఉపయోగించుకుంటారు. ఎలాంటి మర్డర్ కేసునైనా తన తెలివితేటలతో సాల్వ్ చేసే ఆయన తన భార్య (ఆత్మీయ రాజన్)తో విడిపోయి.. కూతురు (శివానీ రాజశేఖర్)తో విడిగా ఉంటూంటాడు. ఒక యాక్సిడెంట్‌లో కూతురుని పోగొట్టుకుంటాడు. కొద్ది రోజులకు ఆయన భార్యకూడా ఒక యాక్సిడెంట్‌లో మరణిస్తుంది. అయితే తన ఇన్వెస్టిగేషన్ లో.. తన భార్య యాక్పిడెంట్ లో చనిపోలేదని, ఎవరో హత్యచేశారని తెలుస్తుంది. అసలు తన భార్యను హత్యచేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఆయనకి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. తన కూతురు, భార్య కూడా యాక్సిడెంట్స్‌తోనే హత్యచేయబడ్డారని తెలుసుకుంటాడు. అలాగే నగరంలో ఇలాంటి యాక్సిడెంట్స్ చాలా జరిగాయని తెలుస్తుంది. చివరికి అసలు నేరస్తుల్ని చట్టానికి పట్టించడానికి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆ యాక్సిడెంట్స్ వెనుక ఉన్న స్కామ్ ఏమిటన్నది మిగతా కథ.  (Shekar Review)

విశ్లేషణ 

మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ చిత్రానికి ‘శేఖర్’ అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగు నేటివిటీ తీసుకు రావడం కోసం ‘శేఖర్’ చిత్రానికి ఎలాంటి మార్పులు చేయకుండా.. యాజిటీజ్‌గా తెరకెక్కించడం గమనార్హం. అలాగే.. రాజశేఖర్ హీరోగా నటించారని ఆయన పాత్రకి ఓవర్ బిల్డప్పులు, మాస్ ఎలివేషన్స్ ఏమీ ఇవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మాతృకను తెలుగులో మక్కీకి మక్కీకి దింపారు. కాకపోతే మలయాళ వెర్షన్ లోని కొన్ని ల్యాగుల్ని తెలుగులో సవరించారు. స్లో నెరేషన్‌ను తెలుగు వెర్షన్ కోసం కొంత బెటర్‌గా తీర్చిదిద్దారు. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ సీన్‌తో సినిమాను ఓపెన్ చేసి.. ఆసక్తిగా కూర్చోబెట్టడంలో దర్శకురాలు జీవిత సక్సెస్ అయింది. శేఖర్ పాత్ర బ్రిలియన్సీ ఏమిటన్నది ఈ సీన్ ద్వారా ప్రేక్షకులకు తెలిపే ప్రయత్నం చేశారు. సాధారణంగా మర్డర్ ఇన్వెస్టిగేషన్ చిత్రాలు అనేసరికి ప్రేక్షకుల్లో మంచి ఉత్కంఠ బిల్డప్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే ఆత్రుత కలుగుతుంది. అయితే ఈ సినిమా ఇంట్రవెల్ బ్యాంగ్ వరకూ అసలు పాయింట్ రివీల్ అవదు. రాజశేఖర్ భార్యా, పిల్లల చుట్టూనే కథ తిరుగుతుంది. శేఖర్ పాత్ర భార్య , కూతుళ్ళ జ్ఞాపకాలతో, వాళ్ళ ఆలోచనలతోనే ఉంటాడు. రాజశేఖర్‌ను గతంలో ఇలాంటి పాత్రలో ప్రేక్షకులు చూడలేదు కాబట్టి.. కొంత బోరింగ్ గా అనిపిస్తుంది. అయితే ఇంట్రవల్ బ్యాంగ్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. సెకండాఫ్ పై మంచి ఆసక్తి క్రియేట్ అవుతుంది. (Shekar Review)


సినిమా సెకండాఫ్ నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. అసలు తన భార్య యాక్సిడెంట్ ఎలా జరిగింది? అనే కోణంలో హీరో ఇన్వెస్టిగేషన్ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. అప్పుడు వచ్చే ఒకో సన్నివేశం ప్రేక్షకుల్ని ఆసక్తిగా కూర్చోబెడుతుంది. అయితే మధ్య మధ్యలో వచ్చే మాంటేజ్ సాంగ్స్ కథనానికి అడ్డు పడుతుంటాయి. ఇక రాజశేఖర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆసక్తిగా సాగుతుంది. తను ప్రేమించిన అమ్మాయితో కాకుండా వేరే అమ్మాయిని పెళ్ళిచేసుకోవడం.. ఒక బిడ్డ పుట్టాకా తన ప్రియురాలు మర్డర్ కావడం.. దాంతో అతడు అవే ఆలోచనలతో భార్యని నిర్లక్ష్యం చేయడం.. ఆమెతో విడిపోవడం.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా కదిలిస్తాయి. ఇక సినిమాకి క్లైమాక్స్ ఆయువుపట్టులా నిలిచిపోతుంది. యాక్సిడెంట్స్‌ వెనుక కారణాలు, ఆ నేపథ్యంలో వచ్చే కోర్ట్ సన్నివేశాలు.. ఈ కేసు కోసం రాజశేఖర్ తీసుకున్న కఠినమైన నిర్ణయం ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అలాగే.. ఆర్గాన్ డొనేషన్స్‌కు సంబంధించిన కొన్ని విస్తుబోయే నిజాలు తెలుస్తాయి. మొత్తం మీద శేఖర్ చిత్రం గ్రిప్పింగ్ గా సాగే థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి. (Shekar Review)


‘శేఖర్‌’ గా రాజశేఖర్ బాగానే నటించినప్పటికీ.. ఇంకాస్త యాక్టివ్ గా చేస్తే బాగుండు అనిపిస్తుంది. మొత్తానికి  రాజశేఖర్ తన కెరీర్ లోనే విభిన్నమైన పాత్రను చేశారు. భార్యా, కూతుళ్ళతో ఆయన చక్కటి ఎమోషన్స్ పలికించారు. భార్యగా మలయాళ బ్యూటీ ఆత్మీయ రాజన్ స్ర్కీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. అలాగే..ఆయన ప్రియురాలిగా ముస్కాన్ బాగా చేసింది. కూతురుగా శివానీ ఆకట్టుకుంటుంది. ఇంకా రాజశేఖర్ స్నేహితులుగా సమీర్, భరణీ శంకర్, రాజేంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు. సైబర్ సెల్ టెక్నీషియన్ గా అభినవ్ గోమఠం పాత్ర ఆకట్టుకుంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి శేఖర్ చిత్రం బెటర్ ఆప్షన్.(Shekar Review)

ట్యాగ్‌లైన్ : వెరైటీ థ్రిల్లర్ 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International