జీవన్మరణ పోరులో శివసేన

ABN , First Publish Date - 2022-06-29T06:07:47+05:30 IST

ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు విహార యాత్రలకై తీసుకెళ్లి తిరుగుబాటు చేయించడం భారత రాజకీయాలకు కొత్త కాదు. రెండు దశాబ్దాల క్రితం నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కావడానికి...

జీవన్మరణ పోరులో శివసేన

ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు విహార యాత్రలకై తీసుకెళ్లి తిరుగుబాటు చేయించడం భారత రాజకీయాలకు కొత్త కాదు. రెండు దశాబ్దాల క్రితం నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కావడానికి ఈ రిసార్ట్ రాజకీయాలే ప్రేరణ కలిగించాయి. మోదీ కృషి మూలంగానే 1995 మార్చిలో గుజరాత్ అసెంబ్లీలోని 182 స్థానాల్లో 121 స్థానాలను బిజెపి గెలుచుకున్నది. ముఖ్యమంత్రి పదవికై కేశుభాయిపటేల్, శంకర్‌సింగ్ వాఘేలాల మధ్య పోటీ ఏర్పడగా సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని కురువృద్ధుడైన కేశుభాయి పటేల్‌కు బిజెపి జాతీయ నాయకత్వం అవకాశం ఇచ్చింది. అప్పటివరకూ శంకర్‌ సింగ్ వాఘేలా మోటార్ సైకిల్ వెనుక కూర్చుని రాష్ట్రమంతటా తిరిగిన మోదీ ఆ తర్వాత తానే రాష్ట్రంలో ఒక కీలక శక్తిగా మారారు. 1995 ఆగస్టులో జరిగిన స్థానిక ఎన్నికల్లో 19 జిల్లా పరిషత్‌లలో 18 పరిషత్‌లను బిజెపి గెలిచిన తర్వాత మోదీకి గుజరాత్ రాజకీయాల్లో తిరుగులేకుండా పోయింది. 1995 సెప్టెంబర్‌లో కేశుభాయి పటేల్ విదేశీ యాత్రకు వెళ్లినప్పుడు శంకర్‌సింగ్ వాఘేలా తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకుని ఖజురాహోకు వెళ్లారు. ప్రభుత్వ పాలనలోను, పార్టీ రాజకీయాల్లోనూ మోదీ జోక్యాన్ని వాఘేలా నిరసించారు. తన ప్రాధాన్యత ఏముందన్నది ఆయన ప్రశ్నించారు. దీనితో బిజెపి అధిష్టానం మోదీని గుజరాత్ పార్టీలో సంస్థాగత వ్యవహారాలనుంచి తప్పించి ఢిల్లీకి పిలిపించింది. మధ్యే మార్గంగా సురేశ్ మెహతాను నియమించింది. అయితే రాజకీయ సంక్షోభాన్ని ఆపలేకపోయింది. కొద్ది కాలం రాష్ట్రపతి పాలన తర్వాత వాఘేలా ఏడాది పాటు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాతి ఎన్నికల్లో బిజెపి గెలిచి కేశుభాయి పటేల్ ముఖ్యమంత్రి అయినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేయాల్సివచ్చింది. ఈ మధ్య కాలంలో మోదీ ఢిల్లీ నుంచి చక్రం తిప్పి 2001లో తనను గుజరాత్ ముఖ్యమంత్రిగా తప్పనిసరిగా పంపాల్సిన పరిస్థితి కల్పించారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. ఆయనకు ఒక నియోజకవర్గం కూడా లేదు. ప్రధానమంత్రి పీవీ నరసింహారావే 1995లో గుజరాత్ రాజకీయ సంక్షోభానికి కారణమని అడ్వాణీ ఆరోపించారు. వాఘేలా, ఆయన బృందానికి ఖజురాహోలో బస ఏర్పాటు చేసేందుకు నాటి కేంద్ర మంత్రి విసి శుక్లా ఢిల్లీ నుంచి అక్కడి కలెక్టర్‌కు ఫోన్ చేశారన్నది ఆ ఆరోపణలో భాగం. ఇదే నిజమైతే రిసార్ట్ రాజకీయాల ఫలితంగా తాను నాయకుడుగా అవతరించే అవకాశం కల్పించినందుకు నరేంద్రమోదీ నాటి ప్రధాని పివికి కృతజ్ఞుడై ఉండాలి. పీవీ రాజనీతి మూలంగా బిజెపి నుంచి విడివడిన శంకర్‌సింగ్ వాఘేలాను తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సోనియా ప్రకటించి ఉంటే గుజరాత్ రాజకీయాలు ఎలా ఉండేవో, దేశ రాజకీయాలు ఎలా మారేవో అన్న చర్చ ఇప్పుడు అప్రస్తుతం.


సరిగ్గా 27 సంవత్సరాల తర్వాత మహారాష్ట్రలో గుజరాత్ తరహా పరిణామాలు కనపడుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ ఢిల్లీలో సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థి గురించి తర్జనభర్జన పడుతున్న సమయంలో జూన్ 21న అనూహ్యంగా మహారాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో దాదాపు 40మంది శివసేన ఎమ్మెల్యేలు సూరత్‌లోని లీ మెరిడియన్ హోటల్‌లో ప్రత్యక్షమయ్యారు. గుజరాత్ పోలీసులు వారికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించారు. హోటల్, ఆ చుట్టుప్రక్కల పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ మరునాడు వారిని గుజరాత్ పోలీసుల పర్యవేక్షణలో విమానాశ్రయానికి తీసుకువెళ్లి మరో బిజెపి పాలిత రాష్ట్రమైన అస్సాం రాజధాని గౌహతికి తరలించారు. అక్కడ హోటల్ రాడిసన్ బ్లూలో వారికి విలాసవంతమైన సౌకర్యాలు కల్పించారు. ఎమ్మెల్యేల తరలింపునకు ఏడు ఛార్టర్డ్ విమానాలను అద్దెకు తీసుకున్నారు. వారిలో కొందరికి కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కూడా కల్పించింది. మహారాష్ట్రలో ఎన్‌సిపి–కాంగ్రెస్‌లతో కలిసి శివసేన ఏర్పర్చుకున్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి తప్పుకోవాలన్నదే ఏక్‌నాథ్ షిండే డిమాండ్.


ఏక్‌నాథ్ షిండే శివసేనను చీల్చి తన వర్గాన్ని బిజెపిలో చేరుస్తారా, లేదా బిజెపికి మద్దతునిస్తారా? తన వర్గంతో ఒకసారి ముంబైకి చేరుకుని అసెంబ్లీలో ప్రవేశించిన తర్వాత ఏమి జరుగుతుంది అన్న ఆసక్తిని ప్రక్కన పెడితే, రెండోసారి ఉద్దవ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి ఈసారి పకడ్బందీగా ప్రణాళికలు వేస్తోందని అర్థమవుతోంది. వాణిజ్య రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్రను బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. 2019 నవంబర్‌లో బిజెపి ఇదే విధంగా ఎన్‌సిపిని చీల్చేందుకు ప్రయత్నం చేసింది. గవర్నర్ కోషియారి అర్ధరాత్రే రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖను పంపారు. కేంద్ర కేబినెట్ సమావేశం కాకుండానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అర్ధరాత్రి వేళ తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకుని భారత ప్రభుత్వ నిబంధనల్లో రూల్ నంబర్ 12 ప్రకారం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు సిఫారసు చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ సిఫారసును అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అర్ధరాత్రి ఏమిటి నాకీ పని అని ఆయన కనీసం ప్రశ్నించను కూడా ప్రశ్నించలేదు. హోం సెక్రటరీ తెల్లవారు జామున డిజిటల్ సంతకం చేయడంతో గెజిట్‌లో కూడా రాష్ట్రపతి ఉత్తర్వులు ముద్రితమయ్యాయి. అప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సిపి చీలిక వర్గం నేత అజిత్ పవార్ రాజభవన్‌కు చేరుకున్నారు. ఉదయం 7.30 ప్రాంతంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శరద్ పవార్ ఎన్‌సిపి చీలిపోకుండా అడ్డుకోవడంతో బిజెపి తంత్రం బెడిసి కొట్టింది. ఈ ప్రయత్నాల తర్వాతే శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిజానికి మహారాష్ట్ర రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికై సంఘర్షిస్తున్న శివసేనను బలహీనపరిచేందుకు బిజెపి ప్రయత్నించకుండా ఉంటే, శివసేన ఓటు బ్యాంకులో చొచ్చుకుపోవాలని అనుకోకుండా ఉంటే, వాజపేయి–అడ్వాణీ హయాంలో ఇచ్చిన గౌరవాన్ని కొనసాగిస్తూ, శివసేనను తన సహజ భాగస్వామిగా భావించి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇచ్చి ఉంటే ఆ పార్టీ బిజెపికి గుడ్‌బై చెప్పేది కాదు. మోదీ ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉండేది కాదు. ఎన్‌సిపిని చీల్చి అర్ధరాత్రి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది కాదు. మళ్లీ మూడేళ్ల తర్వాత పట్టువదలని విక్రమార్కుడి లాగా శివసేనను చీల్చేందుకు ఇప్పుడు తెరవెనుక తంత్రాన్ని నడపాల్సి వచ్చేది కాదు. 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత రాజకీయాల్లో ప్రబల శక్తిగా అవతరించిన తర్వాత బిజెపి విజృంభణలో భాగంగా జరుగుతున్న పరిణామాలివి. ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి బిజెపి అఖండ విజయం సాధించిన తర్వాత చాలా మంది మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఇక ఎంతకాలం కొనసాగబోదని ఊహించారు. ఇప్పుడు అదే విధంగా మోదీ పావులు కదుపుతున్నారు. ఈ ఎత్తుగడలు విజయవంతం అయితే శివసేన పూర్తిగా బలహీనమవుతుంది. మహారాష్ట్రలో బిజెపిని ఎదిరించే శక్తులు కూడా బలహీనమవుతాయని ఆయన అంచనా కావచ్చు. ఒక మహారాష్ట్ర స్వాభిమానానికి ప్రతీకగా కొన్ని దశాబ్దాలుగా వెలుగొందుతోన్న ఒక ప్రాంతీయ పార్టీ అస్తిత్వానికి పరీక్ష.


విచిత్రమేమంటే 2019లో దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు ఉత్సుకత ప్రదర్శించిన గవర్నర్ కోషియారీ గత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్నారు. అధికార పార్టీ శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లినప్పటికీ, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ గవర్నర్ చూసీ చూడనట్లున్నారు. ఈ వర్గం తమ నేతగా ఏక్‌నాథ్ షిండేను ప్రకటించింది. మరో వైపు 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన డిప్యూటీ స్పీకర్‌ను కోరింది. దేశంలోని ఒక అతిపెద్ద రాష్ట్రంలో సుదీర్ఘకాలం రాజకీయ సంక్షోభం కొనసాగుతుంటే, పరిపాలన అస్తవ్యస్తంగా మారితే గవర్నర్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఇలాంటి సమయంలో తన స్వంత విచక్షణ ఉపయోగించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునే అధికారాలు ఆయనకు ఉన్నాయి. సాధారణంగా గవర్నర్ మంత్రిమండలి సలహా ప్రకారం వ్యవహరించాలి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి అస్థిరంగా మారుతుందని అనిపించినప్పుడు గవర్నర్‌కు రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారాలను ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. శాసనసభను ఆయన తనంతట తాను సమావేశపరచాల్సిందిగా కోరవచ్చు. గతంలో యూపీ, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో గవర్నర్ ఇలాంటి అధికారాలు ఉపయోగించుకున్న సందర్భాలున్నాయి. బలాబలాలు శాసనసభలో తేలాలన్నది న్యాయవ్యవస్థ అనేక సందర్భాల్లో ప్రకటించింది. ఎందుకనో ఈసారి మహారాష్ట్ర గవర్నర్ కేంద్ర ఆదేశాలకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు తొమ్మిది రోజులుగా రిసార్ట్ రాజకీయాలు నడుస్తున్నా ఆయన ఎలాంటి స్వతంత్ర నిర్ణయం తీసుకోలేదు. మన దేశంలో రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థలు బిజెపి హయాంలో కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రపతి, గవర్నర్ వ్యవహరించిన తీరు స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే 15వ రాష్ట్రపతి ఏ విధంగా వ్యవహరిస్తారో ఊహించవచ్చు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-06-29T06:07:47+05:30 IST