షిండే చేతికి శివసేన?

ABN , First Publish Date - 2022-06-29T08:29:42+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడుతోంది. వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేల నేత

షిండే చేతికి శివసేన?

  • రెబెల్స్‌ గూటికి వెళ్లేందుకు సిద్ధంగా 14 మంది ఎంపీలు?
  • అదే జరిగితే.. పార్టీని క్లెయిమ్‌ చేసుకునే చాన్స్‌
  • మహారాష్ట్రలో వేగంగా మారుతున్న పరిణామాలు
  • రెబెల్స్‌తో కలిసి సర్కారు ఏర్పాటుకు బీజేపీ సిద్ధం!
  • హుటాహుటిన ఢిల్లీకి ఫడణవీస్‌.. షా, నడ్డాలతో కీలక భేటీ
  • ఉద్ధవ్‌ను బల నిరూపణ కోరాలని గవర్నర్‌కు బీజేపీ లేఖ
  • రెబెల్స్‌కు ఉద్ధవ్‌ విజ్ఞప్తులు.. ముంబై రావాలని విన్నపాలు


ముంబై/న్యూఢిల్లీ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడుతోంది. వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేల నేత, తాజా మాజీ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే గ్రాఫ్‌ పెరుగుతుండగా.. ఉద్ధవ్‌ ఠాక్రేకు అసలుకే మోసం వచ్చేలా శివసేన పార్టీ చేయిజారి పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు శివసేన రెబెల్స్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55 స్థానాలు ఉండగా.. మహా వికాస్‌ ఆఘాడీ(ఎంవీఏ) కూటమిలో భాగంగా.. కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో 39 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు మరో 10 మంది గువాహటి శిబిరంలోకి వెళ్లారు. దీంతో.. ఉద్ధవ్‌ సర్కారు ఏ క్షణంలోనైనా పతనం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. తాజాగా మంగళవారం ఉద్ధవ్‌ వర్గంపై మరో పిడుగు పడ్డంత వార్త జాతీయ మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారింది. శివసేనకు 19 మంది ఎంపీలు ఉండగా.. వారిలో 14 మంది రెబెల్స్‌ పంచన చేరేందుకు సిద్ధమయ్యారనేది ఆ కథనాల సారాంశం. ఇదే జరిగితే.. ఉద్ధవ్‌కు పెద్ద దెబ్బే..! ఆ పార్టీ లోక్‌సభాపక్షం తరఫున తమదే అసలైన శివసేన అంటూ.. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ అందించే అవకాశాలున్నాయి. అంటే.. ఇటు శాసనసభలోనూ.. అటు లోక్‌సభలోనూ షిండే వర్గమే బలంగా ఉంటుంది. త్వరలో మహారాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీని కలుస్తానంటూ షిండే ప్రకటన చేశారు. 


బీజేపీలో హడావుడి!

‘మహా’ పరిణామం విషయంలో బీజేపీ వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు బయటకు చెబుతున్నా.. లోలోపల హడావుడి చర్చలు, భేటీలు జరుగుతున్నాయి. ఎంవీఏ సర్కారుకు ఇప్పుడు సంఖ్యా బలం లేనందున పక్కకు తప్పుకోవాలని బీజేపీ సీనియర్‌ నేత సుధీర్‌ ముంగటివార్‌ అన్నారు. అటు.. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ మంగళవారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న పరిణామాలను గురించి వివరించారు. ఆ వెంటనే.. అంటే.. రాత్రి 10 గంటల సమయంలో ముంబైకి చేరుకున్నారు.  రాజ్‌భవన్‌కు వెళికల గవర్నర్‌ కోశ్యారీతో భేటీ అయ్యారు.  ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను బలపరీక్షకు ఆహ్వానించాలని కోరారు. మరోవైపు ఈ పరిణామాలను ముందే పసిగట్టిన ఉద్ధవ్‌ ఠాక్రే.. బుధవారం కేబినెట్‌ భేటీని ఏర్పాటు చేసి.. ప్రభుత్వ రద్దుకు గవర్నర్‌కు సిఫారసులు చేయవచ్చని పరిశీలకులు అంటున్నారు.


ముంబైకి రండి.. రెబెల్స్‌కు ఉద్ధవ్‌ విజ్ఞప్తి

తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఒకమెట్టు దిగి వచ్చి, రెబెల్‌ ఎమ్మెల్యేలు ముంబై రావాలని ఆహ్వానించారు. ‘‘ముంబైకి రండి. కలిసి, కూర్చుని మాట్లాడుకుందాం. అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీలో చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు. మీరంతా శివసేన గుండెల్లో ఉన్నారు. సమయం ఇంకా మించిపోలేదు.  ఎవరి మాటలకూ లొంగిపోకూడదు. శివసేన మీకు ఇచ్చినంత గౌరవం ఇంకెక్కడా దొరకదు. ఒక పార్టీ అధ్యక్షుడిగా.. కుటుంబ పెద్దగా మీ అందరిపట్ల నేను ఆందోళనతో ఉన్నా’’ అంటూ ఉద్ధవ్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మంత్రివర్గ భేటీని ఏర్పాటు చేశారు. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కూడా తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో కొందరు తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. అలీబాగ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రెబెల్స్‌లో 22 మంది ఎన్‌సీపీ నుంచి శివసేనకు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా, తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌ వర్గంతో టచ్‌లో ఉన్నారనే విషయాన్ని ఏక్‌నాథ్‌ షిండే ఖండించారు. ఒకవేళ అదే నిజమైతే.. వారి పేర్లను బహిర్గతం చేయాలని ఉద్ధవ్‌ను డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-06-29T08:29:42+05:30 IST