చమురు దిగుమతులపై జైశంకర్ మాటలకు శివసేన ఫిదా

ABN , First Publish Date - 2022-04-12T18:06:48+05:30 IST

చమురు దిగుమతులపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం

చమురు దిగుమతులపై జైశంకర్ మాటలకు శివసేన ఫిదా

న్యూఢిల్లీ : చమురు దిగుమతులపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై శివసేన నేత ప్రియాంక చతుర్వేది హర్షం వ్యక్తం చేశారు. 2 ప్లస్ 2 మినిస్టీరియల్ చర్చల అనంతరం జైశంకర్ మాట్లాడుతూ, ప్రతి దేశం ఇంధన భద్రతను సాధించుకోవడం అవసరమని నొక్కి వక్కాణించినందుకు ప్రియాంక  ప్రశంసించారు. 


ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారత దేశం కొంత చమురును కొంటుండటం అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు ఇష్టపడటం లేదు. భారత్-అమెరికా 2 ప్లస్ 2 మినిస్టీరియల్ డయలాగ్ సోమవారం జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లాయిడ్ ఆస్టిన్  ఈ చర్చల్లో పాల్గొన్నారు. 


జైశంకర్ మాట్లాడుతూ, రష్యా నుంచి భారత దేశం ఇంధనాన్ని కొనడంపై మీరు దృష్టి పెడితే, అంతకన్నా ముందు మీరు యూరోపు దేశాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. భారత దేశ ఇంధన భద్రత కోసం తాము కొంత ఇంధనాన్ని కొంటున్నామన్నారు. కానీ భారత దేశం ఒక నెల కోసం కొంటున్న ఇంధనం యూరోపు ఒక మధ్యాహ్నం పూట కొంటున్నదాని కన్నా తక్కువ అని తెలిపారు. తాము ఘర్షణకు వ్యతిరేకమని, చర్చలు, దౌత్యానికి మద్దతిస్తామని చెప్పారు. హింస అత్యవసరంగా ఆగిపోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. తాము ఏ రూపంలో కృషి చేయగలిగితే ఆ రూపంలో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 


శివ సేన నేత  ప్రియాంక చతుర్వేది మంగళవారం ఈ వీడియోను ట్వీట్ చేసి, జైశంకర్‌ను అభినందించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ అద్భుతంగా మాట్లాడారని చెప్పారు. కరతాళ ధ్వనులు చేస్తున్నట్లు ఇమోజీని పెట్టారు. 




Updated Date - 2022-04-12T18:06:48+05:30 IST