బీజేపీని హెచ్చరించిన శివసేన

ABN , First Publish Date - 2022-04-19T18:48:28+05:30 IST

మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో ఇటీవల రెండు వర్గాల మధ్య ఘర్షణలు

బీజేపీని హెచ్చరించిన శివసేన

ముంబై : మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో ఇటీవల రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో బీజేపీని శివసేన తీవ్రంగా హెచ్చరించింది. మన దేశంలోని పెద్ద నగరాల్లో ఇటువంటి ఘర్షణలు కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని, శ్రీలంక, ఉక్రెయిన్ కన్నా ఎక్కువగా నష్టపోతుందని హెచ్చరించింది. 


శివసేన నేత సంజయ్ రౌత్ మంగళవారం మాట్లాడుతూ, మన దేశంలోని పెద్ద నగరాల్లో ఘర్షణలు కొనసాగితే, శ్రీలంక, ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న సవాళ్ళ కన్నా తీవ్రమైన సవాళ్ళను మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఢిల్లీలో హనుమజ్జయంతి సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలకు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం ఉందన్నారు. 


హనుమజ్జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పురిలో శోభాయాత్రపై కొందరు దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో కొందరు పోలీసులతో సహా భక్తులు కూడా గాయపడ్డారు. ఈ కేసులో దాదాపు 20 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సంఘటనపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా చెప్పారు. నేరస్థుల కుల, మతాలు, జాతి, వంటివాటితో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 


సంజయ్ రౌత్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ, బీజేపీని నేరుగా ప్రస్తావించకుండా, దేశంలోని పెద్ద నగరాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటం, అటువంటి పరిస్థితులను సృష్టించడం చాలా దురదృష్టకరమవుతుందన్నారు. దేశ రాజధాని నగరంలో అల్లర్లు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీని కేంద్రం పరిపాలిస్తోందన్నారు. ఇది కేంద్ర పాలిత ప్రాంతమని చెప్పారు. త్వరలో ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. మొదట, ఈ ఎన్నికలను వాయిదా వేశారని, ఇప్పుడు అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు. ఇదంతా కేవలం ఈ ఎన్నికల్లో గెలవడం కోసమేనని తెలిపారు. వారికి మరొక సమస్య ఏదీ లేదన్నారు. 


ముంబైలో వారికి (బీజేపీకి) అధికారం లేదని, అందుకే లౌడ్‌స్పీకర్ల అంశాన్ని లేవనెత్తారని ఆరోపించారు. అదేవిధంగా ఇతర పెద్ద నగరాలు కూడా ప్రభావితమవుతున్నాయని చెప్పారు. దీనివల్ల పని చేసుకోవడానికి బయటకు వెళ్ళే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఇదే పద్ధతి కొనసాగితే, భారత దేశ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక, ఉక్రెయిన్ కన్నా ఎక్కువగా దెబ్బతింటుందన్నారు. 


ఢిల్లీలోని మూడు మునిసిపాలిటీలను విలీనం చేసి ఒకే నగర పాలక సంస్థను ఏర్పాటు చేస్తామని ఎన్నికల కమిషన్‌కు కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఢిల్లీ నగర పాలక సంస్థ ఏకీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో త్వరలోనే పర్యవేక్షక అధికారిని నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 


Updated Date - 2022-04-19T18:48:28+05:30 IST