ఐఎన్ఎస్ విక్రాంత్ నిధి ఏమైంది? : శివసేన ఎంపీ

ABN , First Publish Date - 2022-04-06T19:32:26+05:30 IST

ఐఎన్ఎస్ విక్రాంత్‌ రక్షణ కోసం మహారాష్ట్ర ప్రజల నుంచి

ఐఎన్ఎస్ విక్రాంత్ నిధి ఏమైంది? : శివసేన ఎంపీ

ముంబై : ఐఎన్ఎస్ విక్రాంత్‌ రక్షణ కోసం మహారాష్ట్ర ప్రజల నుంచి సేకరించిన రూ.50 కోట్లు ఏమయ్యాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీ నేత కిరీట్ సోమయ్యను ప్రశ్నించారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఈ నౌక సహా భారత నావికా దళం ప్రముఖ పాత్ర పోషించింది. ఈ నౌక దెబ్బతినడంతో, దానిని ప్రదర్శనశాలగా మార్చాలని డిమాండ్లు వచ్చాయి. దీని కోసం ప్రజల నుంచి విరాళాలను సేకరించారు. 


సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్, ఆయన సన్నిహితులు ప్రవీణ్ రౌత్, స్వప్న పట్కర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వీరి ఆస్తులను మంగళవారం ఈడీ జప్తు చేసింది. పట్ర చావల్ భూ కుంభకోణం కేసులో వీరంతా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం కిరీట్ సోమయ్య సేకరించిన నిధి గురించి నిలదీశారు. సంజయ్ రౌత్ మంగళవారం మాట్లాడుతూ, తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి తాను అంగీకరించకపోవడంతో తనపై తీవ్ర ఒత్తిడి వస్తోందని రాజ్యసభ చైర్మన్‌కు సమాచారం అందజేశానని చెప్పారు. 


సంజయ్ రౌత్ బుధవారం మాట్లాడుతూ, 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఐఎన్ఎస్ విక్రాంత్ సహా భారత నావికా దళం ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పరిస్థితి దయనీయంగా మారడంతో, దానిని నిర్వహించడం కష్టమైందన్నారు. దీనిని మ్యూజియంగా మార్చాలని, పరిరక్షించాలని దేశవ్యాప్తంగా  డిమాండ్లు వచ్చాయన్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఢిల్లీ వెళ్లి, అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీని, ప్రధాన మంత్రిని కలిసేవారన్నారు. కిరీట్ సోమయ్య కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారని తెలిపారు. ఈ విధంగా సేకరించిన సొమ్మును ఎన్నడూ ఖర్చు చేయలేదని, ఆ సొమ్ము వివరాలు బయటకు తెలియదని ఆరోపించారు. కిరీట్ సోమయ్య కొందరు వాలంటీర్లను ముంబై విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు పంపించి నిధిని సేకరించారని తెలిపారు. ఈ వాలంటీర్లు ‘సేవ్ విక్రాంత్’ అని ముద్రించిన టీ-షర్టులు, జెర్సీలను ధరించి నిధిని సేకరించినట్లు తెలిపారు. అనేక మంది ఇచ్చిన విరాళాలు లక్షలు, కోట్లలో ఉన్నాయన్నారు. మంగళవారం తనకు ముగ్గురు, నలుగురు వ్యక్తులు ఫోన్ చేసి, తాము నేవీ నగర్, చర్చ్ గేట్, చెంబూరులలో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు విరాళంగా ఇచ్చామని చెప్పారని తెలిపారు. 


తనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అధికారికంగా రూ.50 కోట్లు వసూలైందన్నారు. ఈ సొమ్ము పూర్తిగా ఐఎన్ఎస్ విక్రాంత్ పరిరక్షణ కోసం ఖర్చవుతుందని ప్రజలు భావించారన్నారు. ఈ నిధిని ప్రత్యేక స్వతంత్ర ఖాతాను తెరిచి రాజ్ భవన్ ఖాతాకు అందజేస్తామని  సోమయ్య మీడియాతో మాట్లాడుతూ తెలిపారన్నారు. రాజ్ భవన్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అటువంటి ఖాతాను ఎవరూ తెరవలేదని తెలుస్తోందని చెప్పారు. 


తాను విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, అంబానీ, అదానీ వంటివాడిని కాదన్నారు. తనకు తన సొంతూరు అలీబాగ్‌లో ఓ చిన్న ఇల్లు ఉందన్నారు. తాను నివసిస్తున్న ఇల్లు చాలా చిన్నదని చెప్పారు. కనీసం ఒక ఎకరా భూమి అయినా తనకు లేదన్నారు. తనకు ఉన్న ఆస్తి అంతా తన కష్టార్జితమేనని వివరించారు. 


Updated Date - 2022-04-06T19:32:26+05:30 IST