మోదీ సాహసోపేత చర్యలు మొదలయ్యాయి : శివసేన నేత సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2021-09-18T20:50:50+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 లోక్‌సభ ఎన్నికల

మోదీ సాహసోపేత చర్యలు మొదలయ్యాయి : శివసేన నేత సంజయ్ రౌత్

ముంబై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 లోక్‌సభ ఎన్నికల దృష్టితో పని మొదలెట్టారని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. ఆ పార్టీ పత్రిక ‘సామ్నా’లో ఆయన రాసిన వ్యాసంలో మోదీపై ప్రశంసలు గుప్పించారు. బీజేపీకి నిజమైన నేత మోదీయేనని, మిగిలినవారంతా ‘చిరిగిన మాస్క్‌’ వంటివారని వ్యాఖ్యానించారు. మోదీ లేకపోతే ప్రస్తుత బీజేపీ మాస్క్‌లు చాలా మంది మునిసిపల్ ఎన్నికల్లో ఓడిపోతారన్నారు. 


మోదీ 2024 లోక్‌సభ ఎన్నికల దృష్టితో సాహసోపేతంగా చర్యలు తీసుకుంటున్నారని, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్‌ను గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమించడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.


‘సామ్నా’కు సంజయ్ రౌత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పత్రికలో ప్రతి వారం ఆయన ఓ వ్యాసం రాస్తూ ఉంటారు. ఈ వారం రాసిన వ్యాసంలో బీజేపీకి నిజమైన నేత మోదీయేనని పేర్కొన్నారు. మిగిలినవారంతా చిరిగిన మాస్క్‌ల వంటివారన్నారు. మోదీ లేకపోతే ప్రస్తుత బీజేపీ మాస్క్‌ల్లో చాలా మంది పురపాలక సంఘం ఎన్నికల్లో ఓటమిపాలవుతారన్నారు. ఈ విషయం మోదీకి తెలుసు కాబట్టే 2024 కోసం సిద్ధమయ్యేందుకు సాహసోపేత చర్యలు తీసుకోవడం ప్రారంభించారని పేర్కొన్నారు. 


జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షడైన తర్వాత నుంచి చాలా మార్పులు జరుగుతున్నాయన్నారు. ఉత్తరాఖండ్, కర్ణాటక ముఖ్యమంత్రులను నడ్డా ద్వారా మార్చారన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిని ఆకస్మికంగా మార్చారన్నారు. నిజానికి మొత్తం కేబినెట్‌ను మార్చారన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేత గుజరాత్ నూతన ముఖ్యమంత్రి అయ్యారన్నారు. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదని మోదీ-నడ్డా నిరూపిస్తున్నారని పేర్కొన్నారు. విజయ్ రూపానీ కేబినెట్ మొత్తం ఇంట్లో కూర్చునేలా చేశారన్నారు. 


అమిత్ షా హయాంలో 25 ఏళ్ళ బీజేపీ-శివసేన కూటమి మహారాష్ట్రలో విచ్ఛిన్నమైందన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో గెలవలేకపోయారన్నారు. మోదీ అందుకే  నడ్డా ద్వారా మరమ్మతు పనులు ప్రారంభించి ఉండవచ్చునని పేర్కొన్నారు. 


Updated Date - 2021-09-18T20:50:50+05:30 IST