బీజేపీకి ప్రధాని పదవి వదిలిపెట్టింది మేమే: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2022-01-24T17:47:34+05:30 IST

ప్రధాని పదవిని చేపట్టే అవకాశం తమకు వచ్చినా ఆ పదవిని బీజేపీకి వదిలిపెట్టామని..

బీజేపీకి ప్రధాని పదవి వదిలిపెట్టింది మేమే: సంజయ్ రౌత్

ముంబై: ప్రధాని పదవిని చేపట్టే అవకాశం తమకు వచ్చినా ఆ పదవిని బీజేపీకి వదిలిపెట్టామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. హిందుత్వ సిద్ధాంతాన్ని శివసేన ఎప్పుడూ అధికారం కోసం వాడలేదంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా సమర్ధించారు. మహారాష్ట్రలో ఎక్కడో అడుగున ఉన్న బీజేపీని ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ఘనత శివసేనదేనని సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ సంజయ్ రౌత్ చెప్పారు.


''బాబ్రీ ఉదంతం తర్వాత ఉత్తర భారతదేశంలో శివసేన పవనాలు బలంగా వీచాయి. అలాంటి దశలోనే మేము ఎన్నికలకు వెళ్లి ఉంటే మా (శివసేన) ప్రధానే దేశాన్ని ఏలి ఉండేవారు. అయితే, ఆ అవకాశాన్ని మేము బీజేపికి ఇచ్చాం'' అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అధికారం కోసమే హిందుత్వను బీజేపీ వాడుకుంటోందని విమర్శించారు.


దీనికి ముందు, శివసేన సుప్రీం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, బీజేపీపీ కూటమిలో శివసేన 25 ఏళ్ల కాలాన్ని వృథా చేసిందన్నారు. శివసేన హిందుత్వానికి అధికారం అందించేందుకు బీజేపీతో జతకట్టిందని, కానీ అధికారం కోసం హిందుత్వాన్ని ఎన్నడూ వాడుకోలేదని అన్నారు. బీజేపీది అధికారం కోసం మిత్రులను వాడుకుని వదలేసే అవకాశవాదమని ఘాటుగా విమర్శించారు. జాతీయ స్థాయిలో ఉండాలనుకున్న బీజేపీ లక్ష్యానికి తాము సహకరిస్తే, ఆ పార్టీ మాత్రం తమను వెన్నుపోటు పొడిచిందని అన్నారు. బీజేపీని వీడినప్పటికీ, హిందుత్వాన్ని తమ పార్టీ వదులుకోలేదని, మునుముందు జాతీయ స్థాయిలో శివసేన కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

Updated Date - 2022-01-24T17:47:34+05:30 IST