Advertisement

సర్వం ఆయనకు అర్పిద్దాం!

Mar 5 2021 @ 00:30AM

భౌతికమైన కొలతలకు అందని దివ్యమైన ప్రశాంతతను చేకూర్చేదే శివతత్త్వం. దానిలో విశ్రమించడమే శివరాత్రి. ప్రతి సంవత్సరంలోనూ మనిషి బుద్ధిని, ఆధ్యాత్మికతను పెంపొందించే కొన్ని ప్రత్యేకమైన రోజులు, సమయాలు ఉంటాయి. అటువంటి సమయాలలో మనం ఏం కోరుకున్నా అవన్నీ ఫలిస్తాయి. అటువంటి పవిత్ర దినాలలో శివరాత్రి ఒకటి. 


‘శివరాత్రి’ అంటే శివునిలో ఆశ్రయం పొందడం. శివుడంటే శాంతి, అనంతత్వం, సౌందర్యం, అద్వైతం. సమస్త విశ్వంలో నిండిఉన్న ‘ధ్యానం’ అనే స్థితే శివుడు. మానవ సహజ స్వభావం కూడా శివతత్త్వమే. కాబట్టే మనం శివునిలో ఆశ్రయం పొందుతాం. ‘శక్తి’ అనేది జనించేదే తప్ప, నశించేది కాదని సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ నిరూపించారు. శక్తిని కేవలం ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చవచ్చు. అలా మారే శక్తికే ‘శివ’ అని పేరు. సమస్త విశ్వంలోని ప్రతీ అణువులో, మనలో సైతం నిండి ఉన్న, పరమానందభరితమైన, అమాయకమైన చైతన్యమే శివతత్త్వం. మనలోని శివ తత్త్వాన్ని గుర్తించి ఉత్సవం జరుపుకోవడమే శివరాత్రి. రాత్రి అంటే విశ్రాంతి తీసుకొనే సమయం. ఆ సమయంలో చర్యలన్నీ ఆగిపోతాయి. అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది, శరీరం నిద్రలోకి వెళుతుంది. శివరాత్రి కేవలం శరీరానికి మాత్రమే కాక మనసు, బుద్ధి, అహంకారాలకు సైతం విశ్రాంతిని ఇస్తుంది. ‘శివతత్త్వం’ అంటే ‘మెలకువగా ఉండడం’ అనే అర్థం కూడా ఉంది. ఆ విధంగా చూస్తే, మనలో ఉన్న అన్ని రకాల జడత్వాల నుంచీ మనల్ని మనం మేలుకొలిపే సందర్భం శివరాత్రి. ఇది నిద్రపోయే రాత్రి కాదు, మెలకువగా ఉండే రాత్రి. జీవితంలో మనకు లభించిన వాటిని గుర్తించి, లభించినందుకు కృతజ్ఞతతో ఉండడాన్ని ఇది సూచిస్తుంది. ‘నీకు లభించిన సంతోషాలు నీ అభివృద్ధికి ఉపకరించాయి, వాటికి కృతజ్ఞుడవై ఉండు. నీకు లభించిన కష్టాలు నీ జీవితానికి ఒక గాఢతను, లోతును సమకూర్చాయి. కాబట్టి వాటికీ కృతజ్ఞుడవై ఉండు.’ ఇదీ శివరాత్రిని ఆచరించే సరైన విధానం.


శివుడు నివసించే ప్రదేశం కైలాసం.‘ కైలాసం’ అనే మాటకు ‘ఉత్సవం’ అని అర్థం. సన్యాసయినా, సంసారయినా శివుడి నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే, ఎక్కడ ఉత్సవం ఉందో అక్కడ శివుడు ఉంటాడు. అతడి అస్థిత్వాన్ని ప్రతిక్షణం గుర్తుంచుకోవడమే శివరాత్రి సారాంశం. అదే నిజమైన సన్న్యాసం. దేవునికి ఏదో ఒకటి సమర్పిస్తే కానీ పూజ సంపూర్ణం కాదు. శివుడు చాలా సామాన్యమైన దేవుడు. అతడు అమాయకుడు - భోళానాథ్‌. ఆయనకు కేవలం బిల్వ పత్రాలు సమర్పిస్తే చాలు. ఇంత సామాన్యంగా ఉండడంలో సైతం లోతైన అర్థం ఉంది. బిల్వ పత్రానికి మూడు ఆకులు ఉంటాయి (త్రిదళం). మనం భగవంతునికి సమర్పించాల్సిన మూడు గుణాలను - సత్వ, రజో, తమో గుణాలను - ఇవి సూచిస్తాయి. మీ జీవితంలోని మంచి గుణాలను, చెడు గుణాలను కూడా... అంటే సర్వస్వాన్నీ శివుడికి సమర్పించి స్వేచ్ఛ పొందండి. 


విచారం ఎందుకు వస్తుంది? స్థూలంగా చెప్పాలంటే, జీవితంలో ఏదో సాధించలేకపోయినప్పుడు! అప్పుడేం చేయాలి? అన్నీ తెలిసిన భగవంతుడికి, మనలో ఉన్న మనవి అనుకొనే అన్నిటినీ సమర్పించాలి. దేవుని శరణాగతి పొందడంలో అద్భుతమైన శక్తి ఉంది. 


‘శివరాత్రి’ అంటే ప్రగాఢమైన విశ్రాంతి. ఇది మనసు దైవంలో ప్రగాఢమైన విశ్రాంతిని పొందే సమయం. శివరాత్రి రోజున మనం చేసే ధ్యానం అనేక రెట్లు ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే, ఈ రోజు ఆత్మ భూమిని స్పృశిస్తూ ఉంటుంది. శివరాత్రి నాడు ధ్యానం చేస్తే దాని శక్తి వందరెట్లు అధికంగా ఉంటుంది. ఏదైతే నిత్యమై, శాశ్వతంగా  ఉంటుందో అదే శివతత్త్వం. ‘నమామీశ మీశాన్‌ నిర్వాణ రూపమ్‌, విభుం వ్యాపకం బ్రహ్మ వేదస్వరూపమ్‌’ అనే శ్లోకంలో దీన్ని అంతో అందంగా వివరిస్తోంది.

శ్రీ శ్రీ రవి శంకర్‌(ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు)

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.