సీబీఐ కస్టడీ నుంచి సెంట్రల్‌జైలుకు శివశంకర్‌ రెడ్డి

ABN , First Publish Date - 2021-11-30T02:44:39+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కస్టడీ నాలుగురోజులకే ముగిసింది. సోమవారం మధ్యాహ్నం

సీబీఐ కస్టడీ నుంచి సెంట్రల్‌జైలుకు శివశంకర్‌ రెడ్డి

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కస్టడీ నాలుగురోజులకే ముగిసింది. సోమవారం మధ్యాహ్నం 3:30గంటల ప్రాంతంలో సీబీఐ అధికారులు శివశంకర్‌రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి కోర్టు ఆదేశాలతో సెంట్రల్‌ జైలుకు తరలించారు.  వివేకా హత్య కేసులో ఈయనను ఈనెల 17వ తేదీన హైదరాబాద్‌లో సీబీఐ ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. అక్కడ నుంచి ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా తీసుకొచ్చి 18వ తేదీ పులివెందుల కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను కడప సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. అదేరోజు 8 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పులివెందుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై 23వ తేదీన కోర్టులో వాదనలు విన్న తర్వాత 7 రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ 25వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. 26వ తేదీన ఆయనను సీబీఐ అధికారులు సెంట్రల్‌ జైల్‌ నుంచి కస్టడీకి తీసుకున్నారు. అప్పటి నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు శివశంకర్‌రెడ్డిని కస్టడీలో ఉంచుకొని విచారించారు. 29వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:30గంటల ప్రాంతంలో ఆయనను పులివెందుల కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించాలంటూ కోర్టు ఆదేశించడంతో శివశంకర్‌రెడ్డిని కడప సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. కాగా.. 8 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరిన సీబీఐ నాలుగు రోజులకే తిరిగి ఆయనను కోర్టుకు హాజరుపరచడం చర్చనీయాంశమైంది. 

Updated Date - 2021-11-30T02:44:39+05:30 IST