రికార్డు సృష్టించిన షోయబ్ మాలిక్ మేనల్లుడు.. పిన్న వయసులోనే ట్రిపుల్ సెంచరీ

ABN , First Publish Date - 2021-12-21T02:33:43+05:30 IST

పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ మేనల్లుడు ముహమ్మద్ హురైరా సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న..

రికార్డు సృష్టించిన షోయబ్ మాలిక్ మేనల్లుడు.. పిన్న వయసులోనే ట్రిపుల్ సెంచరీ

కరాచీ: పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ మేనల్లుడు ముహమ్మద్ హురైరా సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న క్వైడ్-ఇర్- ఆజం ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ సాధించిన హురైరా.. అత్యంత పిన్న వయసులోనే ఆ ఘనత సాధించిన రెండో పాకిస్థానీగా రికార్డు పుస్తకాల్లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హురైరా ఇన్నింగ్స్ వీడియోను షేర్ చేసింది. 19 ఏళ్లకే ఆ ఘనత సాధించాడని ప్రశంసించింది.

 

1975లో జావెద్ మియాందాద్ 17 ఏళ్ల 310 రోజుల్లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు హురైరా 19 ఏళ్ల 239 రోజుల వయసులో ఆ ఘనత సాధించాడు. అంతేకాదు, హురైరాకు ఇదే తొలి ఫస్ట్ క్లాస్ సీజన్. అరంగేట్రంలోనే అదరగొట్టిన హురైరా.. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 8వ బ్యాట్స్‌మెన్‌. పాకిస్థాన్ గడ్డపై ఇది 23వ ట్రిపుల్ సెంచరీ కాగా, హురైరా 22వ ఆటగాడు. వీటిలో విదేశీ ఆటగాళ్లు చేసిన ట్రిపుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. మైక్ బ్రేర్లీ, మార్క్ టేలర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు పాక్ గడ్డపై ట్రిపుల్ సెంచరీలు బాదారు. టేలర్, సెహ్వాగ్ టెస్టుల్లో ‘ట్రిపుల్’ సాధించారు. 


ఇక, హురైరా ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. 341 బంతులు ఎదుర్కొన్న హురైరా 311 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 40 బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. నార్తరన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హురైరా బలోచిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిశతకం సాధించాడు. కాగా, ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న హురైరా ఇప్పటికే మూడు సెంచరీలు సాధించాడు.  పాకిస్థాన్ అండర్-19 జట్టుకు కూడా హురైరా ప్రాతినిధ్యం వహించాడు. 

Updated Date - 2021-12-21T02:33:43+05:30 IST