YSRCP ఎమ్మెల్యే శ్రీదేవికి ఊహించని షాక్..!

ABN , First Publish Date - 2022-01-06T05:46:23+05:30 IST

YSRCP ఎమ్మెల్యే శ్రీదేవికి ఊహించని షాక్..!

YSRCP ఎమ్మెల్యే శ్రీదేవికి ఊహించని షాక్..!

  • వ్యతిరేక వర్గంగా ఎనిమిదిమంది ఎంపీటీసీలు
  • వైస్‌ ఎంపీపీగా తమ అభ్యర్థినే ఎన్నిక..
  • వారికి సహకరించిన టీడీపీ, జనసేన ఎంపీటీసీలు
  • ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన రెబల్స్‌


ఫిరంగిపురం, జనవరి 5: మండల రెండవ వైస్‌ ఎంపీపీగా వైసీపీ రెబల్‌ అభ్యర్థి గుమ్మడి చంద్రం ఏకగ్రీవంగా గెలుపొందారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని రెబల్‌ అభ్యర్థిని ఎన్నుకోవడం చర్చనీయాంశమైంది. మండలంలో మొత్తం 18 మంది ఎంపీటీసీలు ఉండగా వీరిలో 15 మంది వైసీపీ, టీడీపీకి ఇద్దరు, జనసేనకు చెందినవారు ఒకరు ఉన్నారు. ఎంపీటీసీ అమర్లపూడి అనురాధకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ద్వారా బీ ఫారం ఇచ్చారు. కానీ ఆమె నామినేషన్‌ వేయలేదు. అయితే అమీనాబాద్‌ ఎంపీటీసీకి కో-ఆప్షన్‌ ఇచ్చి మళ్ళీ అదే స్థానం నుంచి రెండవ వైస్‌ ఎంపీపీ ఇవ్వటం ఏంటని మండలంలో మెజార్టీ వైసీపీ ఎంపీటీసీలు రెబల్‌ వర్గంగా మారారు. ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గం ఎనిమిది మంది, అనుకూల వర్గంగా ఆరుగురు విడిపోయారు. కాగా బుధవారం ఉదయం 11గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఎనిమిదిమంది రెబల్‌ ఎంపీటీసీలకు తోడు ఇద్దరు టీడీపీ, ఒక జనసేన ఎంపీటీసీలు కలిపి మొత్తం 11 మంది గుమ్మడి చంద్రానికి మద్దతు ఇచ్చారు. అనురాధను బలపర్చాల్సిన ఎంపీటీసీలు కూడా సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైందని ప్రత్యేక అధికారి బి.పద్మావతి ప్రకటించారు. ఎన్నిక తర్వాత కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే శ్రీదేవి అనుకూల, వ్యతిరేక వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. వాదనలు ముదిరి కొట్లాటకు దిగే సరికి అక్కడే ఉన్న ఎస్‌ఐలు వి.అజయ్‌బాబు, సురేష్‌, శ్రీహరిలు తమ సిబ్బందితో ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. దీంతో రెబల్‌ వర్గం సభ్యులు ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.


టీడీపీ కార్యాలయానికి వచ్చి కృతజ్ఞత తెలిపిన వైసీపీ ఉప ఎంపీపీ

అనంతరం గుమ్మడి చంద్రం టీడీపీ కార్యాలయానికి వచ్చిన తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా  తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కోటేశ్వరరావు ఉండవల్లి శ్రీదేవి అధికార దాహాన్ని భరించలేక ఆ పార్టీ ఎంపీటీసీలు కొందరు వ్యతిరేకించి టీడీపీ సహకారం కోరినందునే చంద్రాన్ని గెలిపించామన్నారు. ఇకనైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మేలు కలుగుతుందో తెలుసుకొని సీఎంగా చంద్రబాబును, ఎమ్మెల్యేగా తెనాలి శ్రావణ్‌ కుమార్‌ను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండవ నరసింహారావు, ఆళ్ళ కృష్ణమూర్తి, కె.యోహాన్‌, పి.లూర్ధయ్య, టీడీపీ ఎంపీటీసీలు కట్టా ప్రసాదు, డి.పరిశుద్ధం, చెక్కా హనుమంతరావు, ఆరే పున్నారెడ్డి, కొత్త రామిరెడ్డి, వేల్పుల అంకారావు, పచ్చల రత్నరాజు, కొలగాని కొండలు, సయ్యద్‌ రబ్బానీ, కొసన నాగరాజు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-06T05:46:23+05:30 IST