బీజేపీకి బి‘హారర్‌’..?

ABN , First Publish Date - 2022-08-09T06:31:31+05:30 IST

బీజేపీకి బిహార్‌లో షాక్‌ తగలనుందా? ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేసి.. విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో సర్కారు ఏర్పాటుకు జేడీయూ చీఫ్‌, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ రంగం సిద్ధం చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే..

బీజేపీకి బి‘హారర్‌’..?

తెగదెంపులకు జేడీయూ సై!!

11లోపు సర్కారు పతనం?

ఆర్జేడీ, వామపక్షాలతో నితీశ్‌ సర్కారు?

నెల రోజులుగా బీజేపీకి నితిశ్‌ దూరం 

నాలుగు కీలక సమావేశాలకు డుమ్మా

నేడు జేడీయూ ఎంపీ, ఎమ్మెల్యేల భేటీ

బీజేపీని పడగొడితే.. అండగా ఉంటాం

ప్రకటించిన ఆర్జేడీ, వామపక్షాలు

సోనియాతో టచ్‌లో నితీశ్‌ కుమార్‌!


న్యూఢిల్లీ/పట్నా/కోల్‌కతా, ఆగస్టు 8: బీజేపీకి బిహార్‌లో షాక్‌ తగలనుందా? ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేసి.. విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో సర్కారు ఏర్పాటుకు జేడీయూ చీఫ్‌, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ రంగం సిద్ధం చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. నెల క్రితం బిహార్‌ సంకీర్ణ ప్రభుత్వంలో మొదలైన ముసలం.. ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. మంగళవారం జేడీయూ నిర్వహించనున్న కీలక సమావేశం ప్రస్తుత పరిస్థితులపై ఓ స్పష్టతనిస్తూ.. నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ లెక్కన.. ఈ నెల 11వ తేదీలోపే కొత్త సర్కారు ఏర్పాటుకానున్నట్లు స్పష్టమవుతోంది.


ప్రస్తుత పరిణామాలకు బీజేపీ స్వయంకృతాపరాధమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. జనతాదళ్‌(యునైటెడ్‌) జాతీయ మాజీ అధ్యక్షుడు, కేంద్ర తాజా మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్‌ శనివారం పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ-జేడీయూ బంధంలో బీటలు మరింత తేలతెల్లమయ్యాయి. నిజానికి ఆయనను కేంద్ర మంత్రిగా బీజేపీ ఏకపక్షంగా ఎంపిక చేసింది. ఆయన అమిత్‌షాకు దగ్గరవుతున్నట్లు గుర్తించిన నితీశ్‌.. ఈసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. ముందు నుంచీ.. కేంద్ర సర్కారులో రెండు బెర్తులు కావాలని నితీశ్‌ కోరినా.. బీజేపీ పట్టించుకోవడం లేదు. దాంతో.. లోక్‌ జనశక్తి మాదిరిగా.. ఆర్సీపీ సింగ్‌ ద్వారా జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని నితీశ్‌ భావించారు. ఆర్సీపీ సింగ్‌ కూతురి అవినీతిపై నిలదీశారు. దీంతో.. ఆర్సీపీ సింగ్‌ రాజీనామా చేశారు. ఇక 2017లో లాలూ అవినీతిని ఎత్తిచూపుతూ.. సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగి, బీజేపీతో జతకట్టిన జేడీయూ.. 2020లో ఎన్డీయే తరఫున బరిలో దిగి.. భారీగా సిటింగ్‌ స్థానాలను కోల్పోయి, 43 సీట్లకు పరిమితమైంది. అదే సమయంలో 74 స్థానాలు సాధించిన బీజేపీ, నితీశ్‌కే అధికారాన్ని కట్టబెట్టింది. అయితే.. బిహార్‌పై పట్టుకు షా ప్రయత్నిస్తుండడంతో.. ఆర్సీపీ సింగ్‌ మరో ఏక్‌నాథ్‌ షిండేలా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని జేడీయూ చీఫ్‌ భావించారు. మరోవైపు.. మిత్రపక్షమే అయినా, రాష్ట్ర బీజేపీ నేతలు అడపాదడపా తనను టార్గెట్‌ చేయడం, ఇరకాటంలో పడేస్తుండడం నితీశ్‌కు కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో.. తెగదెంపులకు సిద్ధమయ్యారు.


నెల రోజులుగా దూరందూరం

నితీశ్‌ సుమారు నెల రోజులుగా బీజేపీతో దూరంగా ఉంటున్నారు. ఆదివారం ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ సమావేశానికి, గత నెల 17న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్‌షా నిర్వహించిన సమావేశానికి. రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోతున్న సందర్భంగా రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి, గత నెల 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి నితీశ్‌ హాజరవ్వలేదు. మంగళవారం నితీశ్‌ తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. తదనంతరం భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.




ఎన్నికలకు విముఖత

నితీశ్‌ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నా, జేడీయూ ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో పాత మిత్రులు ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో పొత్తు పెట్టుకొని అధికారాన్ని కాపాడుకుంటారనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చేలా విపక్ష పార్టీల ప్రకటనలున్నాయి. 75 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఆర్జేడీ మద్దతు నితీశ్‌కు ఉంటుందని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రకటించారు. బీజేపీని కాదనుకుంటే.. మద్దతివ్వడానికి తాము సిద్ధమని వామపక్ష పార్టీలు ప్రకటించాయి. సీపీఐ(ఎంఎల్‌)-లెనిని్‌స్టకు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో రెండేసి సీట్లున్నాయి. నితీశ్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నేతలు ప్రకటించారు. మరోవైపు నితీశ్‌తో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ.. ఫోన్‌లో మాట్లాడారనే ప్రచారం జోరందుకుంది. 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో అధికారానికి 122 మంది సభ్యుల బలం అవసరం.


మరో ఉద్ధవ్‌ అవుతారా?

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నితీశ్‌ మరో ఉద్ధవ్‌ అవుతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ బీజేపీని కాదని.. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏక్‌నాథ్‌ షిండే రూపంలో బీజేపీ ఆ సర్కారును కూల్చింది. ఇప్పుడు నితీశ్‌ కూడా కాంగ్రెస్‌, ఆర్జేడీ, వామపక్షాలతో కలిసి సర్కారు ఏర్పాటుకు సిద్ధమైతే.. 74 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ.. జేడీయూను చీల్చి, అధికారాన్ని చేపట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Updated Date - 2022-08-09T06:31:31+05:30 IST