‘షాక్‌ ’గట్టిగానే!

ABN , First Publish Date - 2021-12-01T08:37:20+05:30 IST

రాష్ట్ర ప్రజలకు కరెంటు బిల్లుల షాక్‌ గట్టిగానే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. డిస్కమ్‌లు సమర్పించిన ఏఆర్‌ఆర్‌లే ఈ అంశాన్ని సూచిస్తున్నాయి.

‘షాక్‌ ’గట్టిగానే!

  • భారీగా పెరగనున్న కరెంటు చార్జీలు!
  • డిస్కమ్‌ల లోటు పూడ్చాలంటే తప్పని పరిస్థితి
  • 21,550 కోట్ల లోటులో ఉన్న డిస్కమ్‌లు
  • ఏటా ఇచ్చే సబ్సిడీని పెంచని ప్రభుత్వం 
  • వార్షికాదాయ అవసరాల దాఖలులో వెల్లడి
  • 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు
  • ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేసిన విద్యుత్తు సంస్థలు
  • ట్రూ అప్‌ చార్జీలూ రూ.వేల కోట్లలోనే..!
  • టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించని డిస్కమ్‌లు
  • సమర్పించాల్సిందిగా కోరతామన్న ఈఆర్‌సీ

రాష్ట్రంలో కరెంటు చార్జీలు భారీగా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) భారీ లోటుతో కొనసాగుతుండడం, ప్రభుత్వం ఏటా ఇచ్చే సబ్బిడీని పెంచకపోవడంతో.. ఆ భారమంతా వినియోగదారులపైనే పడే అవకాశాలున్నాయి.


హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు కరెంటు బిల్లుల షాక్‌ గట్టిగానే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. డిస్కమ్‌లు సమర్పించిన ఏఆర్‌ఆర్‌లే ఈ అంశాన్ని సూచిస్తున్నాయి. ప్రస్తుత (2021-22), వచ్చే (2022-23) ఆర్థిక సంవత్సరాలకు కలిపి డిస్కమ్‌లు ఏకంగా రూ.21,550 కోట్ల లోటును కలిగి ఉన్నాయి. ఈ రెండేళ్ల కాలానికిగాను మంగళవారం టీఎ్‌సఈఆర్‌సీకి సమర్పించిన వార్షికాదాయ అవసరాల (ఏఆర్‌ఆర్‌ల)లో డిస్కమ్‌లు ఈ విషయాన్ని పేర్కొన్నాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోను కూడా ఇంత భారీ లోటుతో ఉన్నట్లు తెలిపాయి. 2021-22కు సంబంధించి ఏఆర్‌ఆర్‌ రూ.45,618 కోట్లు కాగా, 2022-23కుగాను రూ.53053 కోట్లుగా పేర్కొన్నాయి. డిస్కమ్‌లకు వచ్చే ఆదాయం 2021-22లో రూ.29,343 కోట్లు, 2022-23లో రూ.36,474 కోట్లుగా తెలిపాయి. ఇక ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 2021-22కి రూ.5652 కోట్లు, 2022-23లో రూ.5652 కోట్లు అని వెల్లడించాయి. దీంతో 2021-22లో డిస్కమ్‌ల లోటు రూ.10623 కోట్లు, 2022-23లో రూ.10,927 కోట్లుగా వివరించాయి. దీనికితోడు 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరం కింద వాస్తవిక వ్యయం(ట్రూఅప్‌ ఛార్జీల కింద) కూడా రూ. వేల కోట్లలోనే ఉండనుంది. ఆదాయం వచ్చే వర్గాలపైనే కరెంటు చార్జీల పెంపు భారం ఉంటుందని ఇన్నాళ్లుగా ప్రభుత్వం చెబుతున్నా.. ఏ వర్గాలను టార్గెట్‌గా చేసుకొని డిస్కమ్‌లు ఆదాయాన్ని రాబట్టుకుంటాయన్న ప్రశ్న తలెత్తుతోంది. 


డిస్కమ్‌ల లోటు తీరాలంటే ఆ మేరకు సబ్సిడీ/సహాయాన్నిపెంచాల్సి ఉండగా.. రెండేళ్లలో సబ్సిడీ ఎంత ఇవ్వనున్నదీ ముందే ప్రభుత్వం డిస్కమ్‌లకు ఎందుకు చెప్పిందన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం సబ్సిడీని ముందే ప్రకటించడంతో రెండేళ్ల లోటును రూ.21550 కోట్లుగా డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లలో పేర్కొన్నాయి. 2019-20, 2020-21 ట్రూఅప్‌ చార్జీలు కూడా రూ.వేల కోట్లలో ఉండడంతో ఈ మొత్తం భారాన్ని నేరుగా ప్రజలపైనే వేస్తారా? కొంత మేర ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందా.. అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. అయితే ప్రభుత్వం ఏ మేరకు సహాయం చేసినా.. డిస్కమ్‌లు బతికి బట్టకట్టాలంటే మాత్రం కరెంట్‌ చార్జీల మోత మోగక తప్పని పరిస్థితి నెలకొంది. సాధారణంగా దేశంలో ఏ డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లు సమర్పించినా.. వాటిలో అంతర్భాగంగా టారిఫ్‌ ప్రతిపాదనలు ఉంటాయి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సంప్రదాయం మారింది. ఏఆర్‌ఆర్‌ దాఖలు చేశాక.. బహిరంగ నోటీసు (బహిరంగ విచారణ కోసం) ఇచ్చే క్రమంలో టారిఫ్‌ ప్రతిపాదనలు ఈఆర్‌సీ (విద్యుత్‌ నియంత్రణ మండలి)కి చేరుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. 


గతేడాదీ ఏఆర్‌ఆర్‌ల దాఖలు?

ఇప్పటిదాకా 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకుగాను డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌ దాఖలు చేయలేదని ప్రచారం జరిగింది. కానీ, గతేడాదే ఏఆర్‌ఆర్‌లను డిస్కమ్‌లు దాఖలు చేశాయని తాజాగా తేలింది. అయితే టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో ఆ ఏఆర్‌ఆర్‌లను డిస్కమ్‌లు పక్కన పెట్టేశాయి. ఏఆర్‌ఆర్‌తోపాటే చార్జీలను ఏ మేరకు సవరిస్తామన్న ప్రతిపాదనలు అందించకుండా డిస్కమ్‌లు గుట్టుగా వాటిని పక్కనపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. అయితే కరెంట్‌ చార్జీలు పెంచుతామని రెండేళ్ల కిందటే సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటన చేశారు. ఈ ప్రతిపాదనలు సమర్పించేలోపు కరోనా ముంచుకురావడంతో పక్కన పెట్టేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని సీఎం పునరుద్ఘాటించారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరెంట్‌ చార్జీల పెంపునకు ఆమోదం తెలుపవడంతో ఎట్టకేలకు డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లు సమర్పించాయి. అయితే టారిఫ్‌ ప్రతిపాదనలు కూడా ఫైనల్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరిధాన్యం కొనుగోలుపై రాష్ట్రవ్యాప్తంగా రగడ నెలకొనడంతోనే టారిఫ్‌ ప్రతిపాదనలు డిస్కమ్‌లు ఈఆర్‌సీకి ఏఆర్‌ఆర్‌తోపాటు ఏకకాలంలో అందించలేదని సమాచారం. 


టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించాకే: టీఎ్‌సఈఆర్‌సీ

టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించాకే తాము ముందుకు వెళతామని టీఎ్‌సఈఆర్‌సీ చైర్మన్‌ టి.శ్రీరంగారావు అన్నారు. వాస్తవ స్థితిగతులపై ప్రజాభిప్రాయ సేకరణ, ప్రభావ వర్గాల నుంచి అభ్యంతరాలు సేకరించాకే నిర్ధారిస్తామని స్పష్టం చే శారు. టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించాలని డిస్కమ్‌లను కోరుతూ లేఖ రాస్తామని, నిర్ణీత వ్యవధిలోగా సమర్పిస్తే.. టారిఫ్‌ ఉత్తర్వులను 2022 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటించారు. ఒకవేళ టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించకపోతే ఏం చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ట్రూఅప్‌ (వాస్తవిక వ్యయం)పై పిటిషన్లు దాఖలు చేసుకోవాలని డిస్కమ్‌లను కోరుతున్నామన్నారు. 


గుట్టుగా ఏఆర్‌ఆర్‌ల దాఖలు 

ఏఆర్‌ఆర్‌లను డిస్కమ్‌లు గుట్టుగా దాఖలు చేశాయి. మంగళవారం ఉదయమే ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేస్తారని సమాచారం అందినప్పటికీ సాయంత్రం 4:30 గంటల దాకా విషయం బయటికి రాలేదు. అయితే సాయంత్రం 4:45 గంటల సమయంలోనే ఏఆర్‌ఆర్‌లను టీఎ్‌సఈఆర్‌సీ కార్యాలయంలో దాఖలు చేసి, డిస్కమ్‌ల అధికారులు వెళ్లిపోయారు. ఆ తర్వాత సరిగ్గా సాయంత్రం 5:30 గంటలకు ఏఆర్‌ఆర్‌ దాఖలు చేయనున్నారనే సమాచారం బయటికి వచ్చింది. కానీ, అధికారులు ఈలోగానే దాఖలు చేసి ఈఆర్‌సీ పరిసరాల్లో కూడా లేకుండా వెళ్లిపోయారు. అయితే ఏఆర్‌ఆర్‌తోపాటే టారిఫ్‌ ప్రతిపాదనలు కూడా సమర్పించాల్సి ఉండగా.. డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌ మాత్రమే దాఖలు చేశాయి. 

Updated Date - 2021-12-01T08:37:20+05:30 IST