ధరాఘాతం!

ABN , First Publish Date - 2022-05-23T06:21:09+05:30 IST

ప్రజల ఆదాయం పెరగకున్నా ఇంటి ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్య తరగతి జనం విలవిలలాడుతున్నారు.

ధరాఘాతం!

భగ్గుమంటున్న నిత్యావసర ధరలు

సామాన్యునికి అందనంటున్న కూరగాయలు

రూ.వందకు చేరువలో టమాట

మంట లేకుండానే మండుతున్న నూనెలు

రూ.300లు దాటిన కిలో చికెన్‌


ఆదిలాబాద్‌టౌన్‌, మే22 : ప్రజల ఆదాయం పెరగకున్నా ఇంటి ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్య తరగతి జనం విలవిలలాడుతున్నారు. పొద్దున లేవగానే తాగే పాల దగ్గరి నుంచి వంట నూనెలు, కూరగాయలు, వీటికి తోడు మటన్‌, చికెన్‌ ధరల వరకు అన్ని వస్తువులు మండిపోతున్నాయి. జిల్లాలో ప్రజలు నిత్యం కొనుగోలు చేసే నిత్యావసరాల ధరలు కొనకుండానే భగ్గుమంటున్నాయి. ఏడాది కిందటితో పోలిస్తే పల్లెల నుంచి పట్టణాల వరకు ఇంటి ఖర్చులు భారీగా పెరిగాయి. గతంలో కిరాణా సరుకులు, పాలు, కరెంట్‌ బిల్లులు కలిపి నలుగురు సభ్యులున్న కుటుంబానికి రూ.6వేలు అయ్యే ఖర్చు ప్రస్తుతం రూ.10వేలు దాటి పోతోంది. దీనికి తోడు అద్దె ఇళ్లలో ఉండే ప్రజలకు గత నెల వరకు రూ.4 నుంచి రూ.5వేలు, రూ.5వేల నుంచి రూ.6వేల వరకు ఉన్న అద్దె రూ.6వేల నుంచి రూ.7వేల వరకు పెరిగి పోవడంతో కుటుంబానికి నెల ఖర్చులు మొత్తం కలిపి రూ.20వేలు చేరిపోతుంది. దీంతో సామాన్యుని ఇంటి బడ్జెట్‌ తలకిందులు కావడంతో ఏది కొనాలో... ఏది తినాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు ఏది కొనాలన్న, ఏది తినాలన్న ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. కిలో కొనే దగ్గర అరకిలో సరిపెట్టుకుంటున్నారు. చికెన్‌ వండుకుందామంటే సామాన్యుడు భయపడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రికార్డు స్థాయిలో రూ.300లు పలుకుతుండగా స్కిన్‌ చికెన్‌ రూ.240 నుంచి రూ.280 వరకు చెల్లించాల్సి వస్తుంది. నెల రోజుల కింద రూ.200లు ఉన్న చికెన్‌ ధర ఇప్పుడు ఏకంగా వంద రూపాయలు పెరగడంతో సామాన్యజనం ముక్క తినాలన్న వెనుకడుగువేయాల్సి వస్తుంది. 

రూ.వందకు చేరువలో టమాట..

అసలే మండుటెండలు కావడంతో టమాట దిగుబడి తగ్గి పోవడంతో ఒక పక్క రైతులు ఆందోళన చెందుతుండగా మార్కెట్‌లో టమాట ధర వందకు చేరువలో పలుకుతోంది. కూరగాయల మార్కెట్‌లో ఏది కొనాలన్నా కిలో రూ.70కి తక్కువ లేదు. ఎండలు పెరుగడంతో దిగుబడి తగ్గి రవాణా చార్జీల ఫలితంగా 10 రోజుల్లోనే కూరగాయల రేట్లు ఒకటికి రెండింతలయ్యాయి. టమాట ధర గత నెలలో రూ.20కిలో ఉంటే ఇప్పుడు మార్కెట్‌లో రూ.90కి చేరువైంది. దీనితో పాటు ఇతర కూరగాయాలైన మిర్చి, వంకాయ, గోబి, బీన్స్‌, బీరకాయ, మునకాయవంటివి రూ.50 నుంచి రూ.80 కేజీ వరకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈ ధరలతో సామాన్యుడు మొన్నటి వరకు మాంసపు ధరల పెరుగుదలతో కూరగాయలను కొనుగోలు చేసిన నేడు ఆ పరిస్థితి పూర్తిగా కనిపించకుండా పోయింది. 

మండుతున్న నూనెలు..

జిల్లాలో వంట నూనెల ధరలు తగ్గడం లేదు. ఆయిల్‌ రేట్లపై రష్యా ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముందు హోల్‌సెల్‌ షాపుల్లో బ్రాండెడ్‌ పల్లి నూనె లీటర్‌కు రూ.135 నుంచి రూ.150 పలుకగా ప్రస్తుతం రూ.200లకు చేరింది. రిటైల్‌ షాపుల్లో అయితే రూ.210 వరకు అమ్ముతున్నారు. గతంలో ఒక ఇంట్లో ఆరు ఏడు ప్యాకెట్లు అవసరమైన నూనె వాడేవాళ్లు. ఇప్పుడు 4 లేదా 3 ప్యాకెట్లతో సరిపెట్టుకుంటున్నారు. మరో వైపు పామాయిల్‌ ధర లీటర్‌ గతంలో రూ.135 ఉండగా ప్రస్తుతం రూ.145కు అమ్ముతున్నారు. ఇలా నూనె రేట్లు విఫరీతంగా పెరగడంతో సామాన్యజనం మంటపెట్టకుండానే వంటింటి నూనెలు మండుతున్నాయి. దీంతో ఉదయం అల్పాహారంగా పూరీలు, వడలు లాంటివి చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఇక హోటళ్లలో మొన్నటి వరకు ప్లేటు రూ.25 నుంచి రూ.30 ఉండగా యజమానులు మరో రూ.5 పెంచారు. 

Updated Date - 2022-05-23T06:21:09+05:30 IST