ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఊహించని షాక్!?
తన సొంత నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు పరాభవం తప్పలేదా? తనకు పట్టువున్న మేజర్ పంచాయతీల్లో ఆయన హవా పనిచేయలేదా? తన ఇలాకాలో తెలుగుతమ్ముళ్లు సత్తా చాటడాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోతున్నారా? మరోవైపు రెబల్ అభ్యర్దులు సైతం మినిస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చారా..? ఇంతకీ పంచాయతీ ఎన్నికల్లో మంత్రి జయరాం వైఫల్యాలకు కారణాలేంటీ..? రెండేళ్ల కాల వ్యవధిలోనే మంత్రిపై ఇంతటి వ్యతిరేఖత ఎందుకొచ్చింది..? అనే ఆసక్తికర విషయాలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో విశ్లేషణాత్మకంగా చూద్దాం.
ఊహించని షాక్..
ఏపీ కార్మికశాఖ మంత్రి జయరాంకు తన సొంత నియోజకవర్గ పల్లెపోరులో ఊహించని షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురు గాలివీచింది. అత్యధిక పంచాయతీలు ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న మంత్రి జయరాం వేసిన పాచిక పారలేదట. మంత్రి జయరాం హవా ఉన్న మూడు మేజర్ పంచాయితీలను టీడీపీ దక్కించుకోవడం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మంత్రి జయరాం అనుచరులు చేపట్టిన సర్వేలో వైసీపీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని ముందే తెలుసుకున్నారట. మరోవైపు మంత్రి జయరాం వ్యూహాలకు ధీటుగా తెలుగుతమ్ముళ్లు ప్రతివ్యూహాలు రచించారు. ఈ విషయంలో ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ కోట్ల సుజాతమ్మ పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టుబిగించారు.
ఆమెకు తెలియకుండానే..!
ఇక ఆలూరు నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల బెదిరింపులు, దౌర్జన్యాలు కలకలం సృష్టించాయి. మంత్రి జయరాం అనుచరులు టీడీపీ మద్దతుదారులను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేశారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న అభ్యర్థిపై మార్గమధ్యలో దాడిచేసి గాయపరిచారు. దాంతో వైసీపీ నేతల బెదిరింపులకు భయపడిపోయిన సదరు టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. ఇక దౌల్తాపురంలో టీడీపీ బలపరిచిన మహిళా అభ్యర్థి నామినేషన్‌ను ఆమెకు తెలియకుండానే మంత్రి అనుచరులు సంతకం ఫోర్జరీ చేసి విత్ డ్రా చేసే ప్రయత్నం చేశారట. ఈ క్రమంలో ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ కోట్ల సుజాతమ్మ రంగంలోకి దిగడంతో మంత్రి అనుచరులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల దొంగ ఓట్లు వేయించుకుని వైసీపీ మద్దతుదారులు గెలిచారనే ఆరోపణలున్నాయి.
జయరాంకు ఝలక్
అయితే పంచాయతీ ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గ ప్రజలు మంత్రి జయరాంకు ఝలక్ ఇచ్చారు. ఆయన ప్రత్యేక దృష్టి సారించి గెలిపించాలనుకున్న మేజర్ పంచాయితీలను టిడిపి మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఆలూరు నియోజకవర్గంలో 108 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 11 పంచాయతీలను వైసీపీ వర్గీయులు ఏకగ్రీవం చేసుకున్నారు. ఎన్నికలు జరిగిన 97 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు 67, టీడీపీ మద్దతుదారులు 27, ఇతరులు 3 పంచాయతీల్లో గెలిచారు. వైసీపీ విజయం సాధించిన 67 పంచాయతీల్లో సుమారు 15 వరకు వైసీపీ రెబెల్స్ గెలుపొందారు. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే మంత్రి నియోజకవర్గంలో టీడీపీ వర్గీయలు అత్యధిక పంచాయతీల్లో విజయం సాధించారు.
ఓటమికి కారణమిదేనా..!?
మంత్రి జయరాం సొంతూరు గుమ్మనూరు పంచాయతీని వైసీపీ నేతలు ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ మంత్రి నివాసముండే ఆలూరు మేజర్ పంచాయతీని గెలిపించుకోలేకపోయారు. జిల్లాలో వైసీపీ మద్దతుదారులు ఎక్కువ పంచాయతీలు గెలిచినా.. అత్యధికంగా 27 పంచాయతీలు ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఖాతాలో పడటం చర్చకు దారితీసింది. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో ఓడిపోవడానికి మంత్రిపై ఉన్న వ్యతిరేకతతో పాటు..అనుచరుల తీరు కారణమనే చర్చ జరుగుతోంది. గుమ్మనూరులో పేకాటవ్యవహారం, నియోజకవర్గంలో విచ్చలవిడిగా కర్ణాటక మద్యం వ్యాపారం, ఇసుక అక్రమ రవాణా వంటివి వారి ఓటమికి కారణమట. మొత్తంగా మంత్రి ప్రాతినిధ్యం వహించే ఆలూరు నియోజకవర్గంలోనే మేజారు పంచాయతీలను టీడీపీ దక్కించుకోవడం.. ప్రజల్లో మంత్రిపై ఉన్న వ్యతిరేకత బయటపడిందనే చర్చ సాగుతోంది.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.