‘షాక్‌’

ABN , First Publish Date - 2022-09-14T06:18:21+05:30 IST

కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. పంచాయతీ ఖాతాలను ఖాళీ చేసేసింది. అభివృద్ధి పనులకు నిధుల్లేక సతమతమవుతున్న గ్రామ పంచాయతీలకు.. డిస్కం అధికారులు ‘షాక్‌’ ఇచ్చారు. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) విధానంలో విద్యుత్తు ఛార్జీల బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించారు.

‘షాక్‌’

విద్యుత్తు బకాయిలపై నోటీసులు


ఇప్పటికే ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుతో ఖాతాలు ఖాళీ 


దిక్కుతోచని స్థితిలో సర్పంచులు


ఉమ్మడి జిల్లాలో బకాయిలు రూ.210 కోట్లు


చిత్తూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. పంచాయతీ ఖాతాలను ఖాళీ చేసేసింది. అభివృద్ధి పనులకు నిధుల్లేక సతమతమవుతున్న గ్రామ పంచాయతీలకు.. డిస్కం అధికారులు ‘షాక్‌’ ఇచ్చారు. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) విధానంలో విద్యుత్తు ఛార్జీల బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో రూ.210.75 కోట్ల బకాయిలు ఉన్నాయని.. వాటి వసూళ్లకు నోటీసుల్ని పంపించినట్లు విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. 


గతేడాది చివర్లో జిల్లా ఉమ్మడిగా ఉన్నప్పుడు పంచాయతీ ఖాతాల నుంచి సుమారు రూ.120 కోట్ల ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31న కూడా ఖాతాల్లోని మరో రూ.60 కోట్లను మళ్లించినా.. సర్పంచులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. దీంతో పది రోజుల్లో తిరిగి ఆయా ఖాతాల్లో వేసేసింది. ప్రస్తుతం ఆయా పంచాయతీల్లో పన్నుల ద్వారా వచ్చిన నిధులు కొంత మొత్తంలో మాత్రమే ఉన్నాయి. తాజాగా విద్యుత్తు బకాయిలు చెల్లించాలని నోటీసులు రావడంతో అధికార పార్టీ సర్పంచులు సైతం ప్రభుత్వ చర్యలపై పెదవి విరుస్తున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాల నుంచి నిధుల్ని మళ్లిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా కల్పించుకుని కేంద్ర పోర్టల్‌ పరిధిలో ఉండేలా ప్రత్యేక ఖాతాల్ని తెరిపించింది. ఇక నుంచి ఆర్థిక సంఘం నిధుల్ని ఆయా ఖాతాల్లో జమ చేసేలా ప్రణాళికలు రచించింది. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో ఇటీవల ఓ విడతగా రాష్ట్రంలోని పంచాయతీలకు రూ.379 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాలకు సర్దుబాటు చేసింది. అలా ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ ఖాతాలకు సుమారు రూ.30 కోట్లు వచ్చాయి. ఆ నిధులను కూడా విద్యుత్తు బకాయిలకు మళ్లించే దిశగా ప్రభుత్వం ఉంది. తాజాగా రాష్ట్రంలోని పంచాయతీలకు రూ.569 కోట్లు అందగా, జిల్లాలోని పంచాయతీలకు రూ.45 కోట్ల వరకు నిధులు అందాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం ఆ నిధుల్ని ఇంకా ఆయా పంచాయతీల ఖాతాలకు సర్దుబాటు చేయలేదు. గతంలోని 14, 15 ఆర్థిక సంఘం నిధుల్ని ప్రభుత్వం మళ్లించేసి, కేంద్ర ఇచ్చిన తాజా నిధుల్నీ ఖాతాల్లోకి జమ చేయకుండా, విద్యుత్తు శాఖ ద్వారా ప్రభుత్వం నోటీసులు జారీ చేయించడం సర్పంచులకు మింగుడు పడడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు మళ్లింపు విషయంగా ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.


నిధులు కనిపిస్తున్నా.. 


గతంలో కేంద్రం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాలకు జమ అయ్యేవి. పాలకవర్గం తీర్మానం మేరకు నిధులను స్వతంత్రంగా ఖర్చు చేసేవారు. కొంతకాలం నుంచి ఆర్థిక సంఘం, ఉపాధిహామీ పథకం ద్వారా వచ్చే నిధుల్ని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని పీడీ ఖాతాల్లో వేస్తున్నారు. ఈ ఖాతాల్లో సొమ్ము కనిపిస్తున్నా.. డ్రా చేసుకునే సౌకర్యం లేదు. చేసిన పనులకు బిల్లుల్ని సీఎ్‌ఫఎంఎస్‌ పోర్టల్‌ అప్‌లోడ్‌ చేయాలి. అక్కడ పరిశీలించాక బిల్లుల్ని చెల్లిస్తారు. ఎప్పుడు చెల్లిస్తారనేది ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. అలా ఉమ్మడి జిల్లాలో ప్రతి పంచాయతీలో సర్పంచులు బిల్లులు పెట్టి ఏడాది కాలంగా వేచి చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పంచాయతీలకుగానూ సుమారు రూ.19 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీ పీడీ ఖాతాలో సొమ్ములున్నా.. నేరుగా వాడుకోలేని దుస్థితి నెలకొని ఉంది.


‘ప్రజలు మమ్మల్ని గెలిపించుకున్నందుకు గ్రామాల్లో చిన్నపని కూడా చేయలేకపోతున్నాం. ప్రజల్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాం. చేసిన పనులకు బిల్లులు కూడా రాలేదు. గత ఏడాది చివర్లో ప్రభుత్వం పంచాయతీ ఖాతాల్లోని నిధుల్ని ఖాళీ చేసింది. దీంతో పల్లె ఖాతాలన్నీ ఖాళీగా ఉన్నాయి. మళ్లీ కరెంటు పెండింగు బిల్లులు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అధికార పార్టీ సర్పంచులుగా బహిరంగంగా మా సమస్యను చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది.’

- వెదురుకుప్పం మండలానికి చెందిన అధికారపార్టీకి చెందిన ఓ సర్పంచి ఆవేదన ఇది. 


Updated Date - 2022-09-14T06:18:21+05:30 IST