నల్లాల ఓదెల TRSకు టాటా చెప్పడం వెనుక అసలేం జరిగింది.. చక్రం తిప్పినదెవరు!?

ABN , First Publish Date - 2022-05-20T04:50:09+05:30 IST

నల్లాల ఓదెల TRSకు టాటా చెప్పడం వెనుక అసలేం జరిగింది.. చక్రం తిప్పినదెరు!?

నల్లాల ఓదెల TRSకు టాటా చెప్పడం వెనుక అసలేం జరిగింది.. చక్రం తిప్పినదెవరు!?

  • అధికార టీఆర్‌ఎస్‌కు షాక్‌
  • పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఓదెలు గుడ్‌ బై
  • ఆయన దారిలోనే సతీమణి, జడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి
  • ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
  • ఎన్నికల ముందే జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు


మంచిర్యాల, మే 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. సీనియర్‌ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన సతీమణి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి గురువారం  పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా నేతృత్వంలో ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నల్లాల దంపతులకు ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి, పార్టీ ఎదుగుదలకు కారణమైన ఓదెలు రాజీనామా చేయడంతో ఎన్నికల ముందే జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న ఆయన తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. చెన్నూరు నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న ఓదెలు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా 2010 ఫిబ్రవరి 14న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.


అనంతరం జూలై 30న జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. 2014లో జరిగిన తెలంగాణ తొలి శాసనసభ ఎన్నికల్లో సైతం విజయం సాధించి, ప్రభుత్వ విప్‌ హోదా పొందారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ ఓదెలుకు బదులుగా ప్రస్తుత ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు టికెట్‌ ఇచ్చారు. అధిష్టా నం నిర్ణయంపై నిరాశలో ఉన్న ఆయనకు కేసీఆర్‌ ఆయన సతీమణి నల్లాల భాగ్యలక్ష్మికి జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి అప్పగించారు.  జిల్లాల పునర్విభజన అనంతరం 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటపల్లి నుంచి జడ్పీటీసీగా గెలుపొందిన ఓదెలు సతీమణి భాగ్యలక్ష్మి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.


చక్రం తిప్పిన పీఎస్సార్‌...?

నల్లాల ఓదెలు దంపతులు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం వెనుక మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు కీలక పాత్ర పోషించినట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది నియోజక వర్గాల్లో పీఎస్సార్‌కు గట్టి పట్టు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆసిఫాబాద్‌, చెన్నూరు నియోజకవర్గాల్లో తన అనుచరులైన ఆత్రం సక్కు, బోరిగం వెంకటేశ్‌నేతలను రంగంలోకి దింపారు. ఆ ఎన్నికల్లో ఆత్రం సక్కు గెలుపొందగా, వెంకటేశ్‌నేత ప్రస్తుత ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. డీసీసీ అధ్యక్షురాలిగా పీఎస్సార్‌ సతీమణి సురేఖ వ్యవహరిస్తున్నారు. జిల్లాలో పట్టు బిగించేందుకు పీఎస్సార్‌ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. ఓదెలు కాంగ్రెస్‌లో చేరడానికి కారణమైందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 

రసవత్తరంగా రాజకీయాలు

నల్లాల ఓదెలు కాంగ్రెస్‌లో చేరడంతో చెన్నూరులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఓదెలుకు కేడర్‌ ఉంది. ఎమ్మెల్యే సుమన్‌ ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోవడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది. దీంతో ఓదెలు పార్టీ మారడం ఖాయమని ఐదారు నెలలుగా సంకేతాలు ఉన్నాయి. అయితే ఓదెలు బీజేపీలో చేరతానే ప్రచారమూ జరిగింది. ఓదెలు అనుచర వర్గం సూచనల మేరకే ఆయన పార్టీ మారే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

మనస్తాపంతోనే పార్టీ మారా

2018లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యాను. అవే ఎన్నికల్లో బాల్క సుమన్‌ చేతిలో ఓటమి పాలైన వెంకటేశ్‌నేతకు ఎంపీ టికెట్‌ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నాకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం సముచిత స్థానం కల్పించలేదు. ఇటీవల చేపట్టిన జిల్లా అధ్యక్ష పదవిలోనూ మొండి చేయి చూపారు. నా సమస్యలు, బాధను ప్రతిసారీ స్వయంగా కేటీఆర్‌కు చెప్పుకున్నా పట్టించుకోలేదు. నా సతీమణికి జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చినప్పటికీ ప్రాధాన్యం ఇవ్వలేదు. అధికార పార్టీ కార్యక్రమాల్లో కూడా ప్రోటోకాల్‌ పాటించలేదు. టీఆర్‌ఎస్‌లో ఉద్యమకారులకు గుర్తింపు లేదు. ఇతర పార్టీల్లో నుంచి వలస వచ్చే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురై కాంగ్రెస్‌లో చేరాను. భవిష్యత్‌లో కాంగ్రెస్‌ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. 

రాజీనామా చేస్తా

నల్లాల భాగ్యలక్ష్మి

కాంగ్రెస్‌ చేరినందున జడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేస్తా. టీఆర్‌ఎస్‌లో మేము ఉండటం బాల్క సుమన్‌కు ఇష్టం లేదు. మా ఇంటి చుట్టూ నిఘా పెట్టి వచ్చి పోయే వారితో ఎంక్వైరీ చేయించేవారు. ఒక సందర్భంగా నా భర్తను ఇంట్లో బంధించి బయటకు రాకుండా చేశారు. ఒకే పార్టీలో ఉండి, వేధింపులు భరించలేకనే పార్టీ మారే నిర్ణయం తీసుకున్నాం. 

 

Updated Date - 2022-05-20T04:50:09+05:30 IST