Shocking.. సైబర్ నేరగాళ్లు ఇలా కూడా మోసం చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త..!

ABN , First Publish Date - 2021-09-04T11:59:03+05:30 IST

రోజుకో కొత్త ఎత్తుగడతో జనాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా ..

Shocking.. సైబర్ నేరగాళ్లు ఇలా కూడా మోసం చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త..!

  • సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ
  • మీరు చేసిన ఆన్‌లైన్‌ షాపింగ్‌లో 
  • రూ.5 తక్కువైందంటూ సెల్‌ఫోన్‌కు లింకు
  • ఐదనుకుని క్లిక్‌ చేస్తే.. రూ.83,500 దోచేశారు!
  • గంటలోపే రూ.52వేలను రికవరీ చేసిన సైబర్‌ పోలీసులు


చిత్తూరు జిల్లా/తిరుపతి : సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో జనాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా తిరుపతివాసిని మోసం చేసి, ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.83,500 దోచేశారు. శుక్రవారం మీడియాకు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన మునిరామయ్య ఈనెల ఒకటో తేదీన తిరుమలకు వెళ్లారు. అక్కడినుంచే ఆన్‌లైన్‌లో రూ.2వేలతో ఓ వస్తువును కొనుగోలు చేశారు. రెండో తేదీన ఆయనకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. మీరు కొనుగోలు చేసిన వస్తువు పార్శిల్‌ చేయడానికి ఐదు రూపాయలు తక్కువవుతోందని నమ్మించాడు.


ఆ డబ్బు ఎలా పంపించాలని మునిరామయ్య అడిగారు. అందుకతను.. ‘మీ సెల్‌ఫోన్‌కు ఓ లింక్‌ పంపిస్తాను. దాన్ని క్లిక్‌ చేసి, పంపండి’ అన్నాడు. అతను చెప్పినట్లే సెల్‌ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసి రూ.5 పంపించాడు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. కొద్దిసేపటికే మునిరామయ్య బ్యాంకు ఖాతా నుంచి రూ.83,500 తొమ్మిది దఫాలుగా డెబిట్‌ అయ్యింది. మోసపోయానని తెలుసుకుని ఆలస్యం చేయకుండా తిరుమల టూటౌన్‌ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తిరుపతి సైబర్‌ వింగ్‌ పోలీసులు తక్షణం స్పందించారు. సైబర్‌ టూల్స్‌ ద్వారా వివరాలు రాబట్టి.. మోసం జరిగిన గంటలోపే రూ.52 వేలను తిరిగి రాబట్టారు. మిగిలిన రూ.31,500లకు సంబంధించి దర్యాప్తు సాగుతోంది.


గుడ్డిగా నమ్మొద్దు..

ఆన్‌లైన్‌ వ్యవహారాలకు సంబంధించి దేనినీ, ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని తిరుపతి పోలీస్‌ సైబర్‌ వింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్రహ్మణ్యంరెడ్డి సూచించారు. కేవైసీ అప్‌డేట్‌, లోన్‌ మంజూరైందని, ప్రైజ్‌మనీ వచ్చిందని మొబైల్‌కు వచ్చే లింక్‌లను క్లిక్‌ చేయొద్దని చెప్పారు. బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, పిన్‌ నెంబర్లు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఇతరులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ చెప్పొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా సైబర్‌ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సంబంధిత ప్రాంతానికి చెందిన పోలీసు స్టేషన్‌లోగాని, 80999 99977 నెంబరుకు వాట్సప్‌ చేయొచ్చన్నారు. అలాగే తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఇ-మెయిల్‌కు ఫిర్యాదు చేసే సౌకర్యం ఉందన్నారు.

Updated Date - 2021-09-04T11:59:03+05:30 IST