మూసీ ఒడ్డున మృతదేహం కేసులో నిర్ఘాంతపోయే నిజాలు

ABN , First Publish Date - 2022-05-24T15:43:11+05:30 IST

మూసీ ఒడ్డున మృతదేహం కేసులో నిర్ఘాంతపోయే నిజాలు

మూసీ ఒడ్డున మృతదేహం కేసులో నిర్ఘాంతపోయే నిజాలు

  • కుక్కల దాడి వల్లే బాలుడి మృతి


హైదరాబాద్ సిటీ/అఫ్జల్‌గంజ్‌ : మూసీ ఒడ్డున లభ్యమైన బాలుడు కుక్కల దాడిలోనే మృతి చెందినట్లు కుల్సుంపురా పోలీసులు నిర్ధారించారు. చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు వీధి కుక్కలు దాడి చేసి కరవడంతోనే చని పోయినట్లు పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ కుమార్‌ కథనం ప్రకారం.. జియాగూడ అలావా ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అలీ కుమారుడు సయ్యద్‌ సోఫియాన్‌ (13) నాలుగో తరగతి చదువుతున్నాడు. అతడు తరచూ మూసీ నది ఒడ్డున ఆడుకోవడంతో పాటు చేపలు పట్టడానికి వెళ్లేవాడు.


ఈ నెల 19న ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లిన సోఫియాన్‌ మూసీనది ఒడ్డు న శవమై కనిపించాడు. మృతదేహాన్ని దాదాపు 20 వీధి కుక్కలు పీక్కు తినడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కుక్కలను చెదరగొట్టి మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాలుడి వెనుక భాగం, ఎడమ చేతిని తీవ్రంగా కరవడంతో తీవ్ర రక్తస్రావమై బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లి చనిపోయినట్లు తెలిసింది. మృతదేహంపై దాదాపు 50పైగా కుక్క గాట్లు ఉండడంతో మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్‌ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో కుక్కలు దాడి చేయడంతోనే బాలుడు చనిపోయినట్లు రుజువైంది. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-24T15:43:11+05:30 IST