అక్కడ బాల్య వివాహాల్లో కొత్త కోణం.. కనీసం మూడు పూటలా తిండయినా దొరుకుతుందని..

Sep 27 2021 @ 02:45AM

సుందర్‌బన్స్‌లో బాలికల బతుకులు చిందరవందర


విపత్తులు.. పేదరికం.. పెరిగిన బాల్య వివాహాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: ‘‘ఎంఫాన్‌ తుఫాను మమ్మల్ని నిండా నీట ముంచేసింది. కరోనా మహమ్మారి చేతిలో పైసా లేకుండా చేసింది. చిన్న గుడారమే ఎడుగురు పిల్లలకు.. నాకూ గూడు. రోజుకు ఒకరికి కూడా తిండి దొరికేది కాదు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో 15ఏళ్ల నా కూతురికి సంబంధం వచ్చింది. అది దేవుడిచ్చిన వరంగా అనిపించింది. ఎందుకంటే.. మూడు పూటలా తిండి దొరుకుతుందని’’.. ఇది సుందర్‌బన్స్‌లో నివసించే రశ్మీదేవి ఆవేదన. గత ఏడాది మే నెలలో అక్కడి దుస్థితిని తలుచుకొని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అయితే..  తప్పు చేశాననే విషయం ఆమెకు పదహారు నెలల తర్వాత తెలిసింది. ఆమె అల్లుడు ఇప్పుడు వరకట్న వేధింపుల కేసులో జైలులో ఉన్నాడు. ఇలాంటి కుటుంబాల గాథలెన్నో ఆ ప్రాంతంలో కనిపిస్తాయని గోరన్‌బో్‌స గ్రామ్‌ బికాస్‌ కేంద్రం అనే స్వచ్ఛంద సేవా సంస్థ పేర్కొంది. ఆ సంస్థ నివేదిక ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24పరగణాల జిల్లా పరిధిలోని సుందర్‌బన్స్‌ డెల్టా పర్యావరణపరంగా సున్నితమైనది కావడంతో.. ఏదో ఒక ప్రకృతి విపత్తుతో పోరాటం తప్పదు. దీనికితోడు కరోనా అక్కడి వారిని మరింత పేదరికంలోకి నెట్టింది.


ఈ పరిస్థితులు బాలికలపై దుష్ఫ్రభావాలను చూపుతున్నాయి. బాల్య వివాహాల సంఖ్య పెరిగిపోయింది. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకూ 159 మంది బాలికలకు పెళ్లి చేశారు. వాటిలో ఈ ఏడాదిలోని ఎనిమిది నెలల్లో జరిగినవే 64 ఉన్నాయి. దుర్భర పరిస్థితుల్లో కాస్త మెరుగైన జీవితం దొరుకుతుందని ఒకవైపు.. భారం దిగుతుందనే భావనతో మరోవైపు.. సుందర్‌బన్స్‌లోని తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహం చేసేస్తారని.. గోరన్‌బో్‌స పేర్కొంది.  2019లో.. మహమ్మారికి ముందు 68 బాల్య వివాహాలు నమోదయ్యాయని తెలిపింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.