కన్న కూతుళ్లనే అమ్మేశాడు.. షాకింగ్ నిజాలు చెబుతున్న తాలిబాన్ ఉగ్రవాది భార్య..!

ABN , First Publish Date - 2021-08-20T21:24:14+05:30 IST

తాలిబాన్లకు దయాదాక్షిణ్యాలు ఉండవు. మారిపోయామంటూ వాళ్లు చెప్పే మాటల్ని అస్సలు నమ్మలేము. వాళ్లు ఇప్పుడే కాదు ఎప్పటికీ మారరు.

కన్న కూతుళ్లనే అమ్మేశాడు.. షాకింగ్ నిజాలు చెబుతున్న తాలిబాన్ ఉగ్రవాది భార్య..!

‘తాలిబాన్లకు దయాదాక్షిణ్యాలు ఉండవు. మారిపోయామంటూ వాళ్లు చెప్పే మాటల్ని అస్సలు నమ్మలేము. వాళ్లు ఇప్పుడే కాదు ఎప్పటికీ మారరు. ఓ తాలీబాన్‌ ఉగ్రవాదిని పెళ్లి చేసుకున్న నేను ప్రతి క్షణం నరకం అనుభవించాను. నా కళ్ల ముందే నా ఇద్దరు కూతుళ్లను నా భర్త అమ్మేశాడు. వద్దని వేడుకుంటున్నా వినిపించుకోలేదు. తమ స్వలాభం కోసం ఎంతటి దారుణానికైనా తాలిబాన్లు తెగిస్తారు’.. ఇవి భారత రాజధాని న్యూఢిల్లీలోని భోగల్ నగరంలో నివసిస్తున్న ఫరీభా అనే ఓ మహిళ మాటలు. అఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఆమె అతి చిన్న వయసులోనే ఓ తాలిబాన్‌కు భార్యగా మారాల్సి వచ్చింది. ఆ తర్వాత తన పిల్లల ప్రాణాలను రక్షించుకునేందుకు ధైర్యం చేసి తెగించి దేశం దాటింది. భారత్‌కు వచ్చి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ బతుకీడుస్తోంది. భోగల్ నగరంలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న ఫరీబా తాను అనుభవించిన నరకాన్ని కళ్లకు కట్టినట్టు చెబుతోంది. 


‘నేను పుట్టి పెరిగింది అఫ్ఘనిస్తాన్ దేశంలోనే. పేదరికం కారణంగా మా అమ్మానాన్నలు నాకు 14 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. నా కంటే వయసులో 20 ఏళ్లు పెద్దయిన ఓ తాలిబాన్‌కు భార్యగా కాబోతున్నానని నాకు ఆ వయసులో తెలియదు. అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత నేను బిక్కుబిక్కుమంటూ గడిపాను. స్వేచ్ఛ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈ లోపే నలుగురు ఆడ పిల్లలకు నేను తల్లినయ్యాను. బయటకు వెళ్లనిచ్చేవాళ్లు కాదు. అడుగడుగునా ఆంక్షలు. అయినప్పటికీ ఎలాగోలా తట్టుకుని పిల్లలకోసం భరించాను. కానీ నా పెద్ద కూతురిని నా భర్త నా కళ్ల ముందే అమ్మేశాడు. ఆ డబ్బులతో జల్సాలు చేశాడు. కూతురిని అమ్మడం తప్పని, అలాంటి నీచానికి పాల్పడ వద్దని కాళ్లావేళ్లా పడినా వినకుండా రెండో కూతురిని కూడా అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో నా రెండో కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నా అని చెప్పి వెళ్లిన నా భర్త.. మళ్లీ నా కూతురిని నాకు చూపించలేదు. 


నా కూతురు బతికి ఉందో, ఎవరికైనా అమ్మేశాడో కూడా చెప్పలేదు. నేను పడిన మానసిక క్షోభను నా తల్లిదండ్రులకు చెప్పాను. వాళ్లు మిగిలిన ఇద్దరు కూతుళ్ల కోసమైనా ఆలోచించమని చెప్పారు. ఈ దేశం నుంచి వెళ్లి వేరే ఎక్కడయినా సురక్షితంగా బతకమని సూచించారు. అలా నా తల్లితో కలిసి నేను భారత్‌కు వచ్చాను. నేను గతంలో కూడా భారత్‌కు ఓసారి వచ్చాను. ఈ దేశం గురించి నాకు కాస్తో కూస్తో అవగాహన ఉంది. ఇక్కడ స్త్రీలకు స్వేచ్ఛ ఉంది. కానీ నా దేశంలో మమ్మల్ని మనుషుల్లా కూడా చూడరు. అందుకే నాలుగేళ్ల క్రితం భారత్‌కు వలస వచ్చాను. నేను భారత్‌కు వచ్చేశాక.. నా తండ్రికి, ఇతర కుటుంబ సభ్యులను బెదిరించడం మొదలు పెట్టారట. ఎక్కడ ఉన్నారో చెప్పమనీ, లేకుంటే చంపేస్తామని హెచ్చరించారట. అయినా వాళ్లు తమకు తెలియదనే చెబుతూ వచ్చారు. ఇప్పుడు కూడా నాకు ఎన్నో వందల ఫోన్లు వచ్చాయి. మేం కూడా భారత్‌కు వస్తామనీ, సాయం చేయమని కోరుతున్నారు. ఇప్పటికే నాలాగా ఎంతో మంది అఫ్ఘాన్ ప్రజలు పొట్ట చేత్తో పట్టుకుని ప్రాణాలను రక్షించుకునేందుకు భారత్‌కు వచ్చారు. వాళ్లను భారత ప్రభుత్వం శరణార్థులుగా గుర్తించాలని కోరుతున్నాను’ అని ఫరీభా వేడుకుంటోంది. తన పిల్లలను ఇక్కడే పెంచి పెద్ద చేస్తాననీ, బాగా చదివిస్తానని ఆమె చెప్పుకొస్తోంది.

Updated Date - 2021-08-20T21:24:14+05:30 IST