Shocking : హైదరాబాద్‌లో ఒక్కసారిగా పెరిగిన Corona కేసులు.. ఒక్కరోజులోనే ఇన్నా..

ABN , First Publish Date - 2022-01-06T15:25:51+05:30 IST

మహానగరంలో మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మొన్నటి వరకు 300లోపు..

Shocking : హైదరాబాద్‌లో ఒక్కసారిగా పెరిగిన Corona కేసులు.. ఒక్కరోజులోనే ఇన్నా..

  • 294 టు 979
  • వారం రోజుల్లో ఆరు రెట్లు పెరుగుదల


హైదరాబాద్‌ సిటీ : మహానగరంలో మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మొన్నటి వరకు 300లోపు ఉన్న కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా వెయ్యికి చేరువైంది. రెండు రోజుల్లో కేసుల సంఖ్య మూడు రెట్లు పెరగడం గమనార్హం. బుధవారం వైద్యా రోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 979 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం పాజటివ్‌ కేసుల సంఖ్య 294గా  ఉంది. డిసెంబర్‌ 30 నుంచి జనవరి 3 వరకు 1088 కేసులు నమోదు గత రెండు రోజుల్లోనే 1638 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. కేసుల సంఖ్య రెం డు, మూడు, అంతకంటే ఎక్కువ రెట్లు దాటుతున్న నేపథ్యంలో వైరస్‌ జన సమూహంలోకి చేరిందన్న అనుమానాలు వైద్యాధికారులు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నాలుగైదు వారాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నా రు. రాష్ట్రంలో 1520 కేసులు నమోదుకాగా.. గ్రేటర్‌లోనే 64 శాతం (979) కేసులున్నాయి. రంగారెడ్డి 174, మేడ్చల్‌- మల్కా జ్‌గిరి-132 కేసులతో కలుపుకుంటే ఈ సంఖ్య 1275గా ఉంది. మూడు జిల్లాల్లో కలిపి 85 శాతం కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి.


పరీక్షలకు పరుగులు..

జ్వరం, దగ్గు, జలుబు ఇలా ఏ చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తినా కొవిడ్‌ పరీక్షల కోసం యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలకు పరుగులు తీస్తున్నారు. బుధవారం నగరంలోని 27 పరీక్ష కేంద్రాలను ‘ఆంధ్రజ్యోతి’ బృందం పరిశీలించగా, 2,551 మంది పరీక్షలు చేసుకున్నారు. వారిలో 56 మంది పాజిటివ్‌గా తేలింది. శేరిలింగంపల్లి మండలంలో బుధవారం ఒక్కరోజు 286 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 25 పాజిటివ్‌ కేసులు వచ్చాయని మండల వైద్యాధికారి రామిరెడ్డి తెలిపారు. కాగా, కరోనా కొత్త వేరియంట్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని వైద్యులు పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఏఏపీఐ గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ సమ్మిట్‌లో పాల్గొన్న వైద్యుల అభిప్రాయాలు ఇవి.


జీవనశైలి మార్పుతో కరోనాకు చెక్‌

ఆరోగ్యకరమైన జీవనశైలితో కరోనా ముప్పును ఎదుర్కోవచ్చు. ఎన్ని కేసులు వచ్చాయనేది కాదు, ఎంతమందిపై ప్రభావం చూపిందన్న విషయం గుర్తించాలి. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఒమైక్రాన్‌ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపడం లేదు. మూడో వేవ్‌లో పిల్లలకు కరోనా సోకే ప్రమాదముంది. - డాక్టర్‌ రవి కొల్లి, ఏఏపీఐ ప్రెసిడెంట్‌


వ్యాక్సిన్‌, మాస్క్‌ తప్పనిసరి

కరోనా ఇప్పట్లో అంతం కాదు. వ్యాక్సిన్‌ తీసుకోవడంతో పాటు మాస్కును తప్పనిసరిగా ధరించాలి. కరోనా బారినుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి స్వచ్ఛందంగా నిబంధనలు పాటించాలి. - డాక్టర్‌ సతీష్‌ కె


స్పల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరొద్దు

లక్షణాలు బయటపడని కారణంగానే కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది. పాజిటివ్‌ అని తెలిస్తే హోం ఐసోలేషన్‌లో ఉండి వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. స్పల్ప లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరొద్దు. వయసు మళ్లినవారు, ఆరోగ్యసమస్యలున్న వారు బూస్టర్‌డోసులు తీసుకోవాలి. - డాక్టర్‌ సుజీత్‌ పున్నం


Updated Date - 2022-01-06T15:25:51+05:30 IST