షాకింగ్.. ఆ లింక్ క్లిక్ చేయగానే ఆరున్నర లక్షల హుష్

ABN , First Publish Date - 2021-07-18T14:56:53+05:30 IST

అతడు చెప్పినట్లే పశుపతి లింక్‌ క్లిక్‌ చేయగా...

షాకింగ్.. ఆ లింక్ క్లిక్ చేయగానే ఆరున్నర లక్షల హుష్

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : ఓ ఆయుర్వేద ఉత్పత్తులను రిటర్న్‌ చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి సైబర్‌ కేటుగాళ్ల చేతికి చిక్కి రూ.6.5లక్షలకు పైగా మోసపోయాడు. సిటీ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం లోతుకుంటకు చెందిన పశుపతి ఇటీవల ఆన్‌లైన్‌ ద్వారా ఓ సంస్థకు చెందిన పలు ఆయుర్వేద ఉత్పత్తులను కొనుగోలు చేశాడు. అయితే అవి నచ్చకపోవడంతో వాపసు చేయాలని గూగూల్‌లో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం వెతికాడు. ఇంతలో ఒక ఆగంతకుడు ఫోన్‌ చేసి తాను ఆ సంస్థ నుంచి కాల్‌ చేస్తున్నానని, మీ కొనుగోళ్లు వాపసు తీసుకుంటామని తెలిపాడు. డబ్బులు తిరిగి మీ బ్యాంక్‌ ఖాతాకు క్రెడిట్‌ చేస్తామని, మీ మొబైల్‌కు వచ్చే లింక్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని సూచించాడు. 


అతడు చెప్పినట్లే పశుపతి లింక్‌ క్లిక్‌ చేయగా ఎనీడెస్క్‌ యాప్‌ ఓపెన్‌ అయ్యింది. అది డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత మరోసారి కాల్‌ చేసిన ఆగంతకుడు మీరు ఫోన్‌ను ఓపెన్‌లో ఉంచాలని, లాక్‌ చేయవద్దని చెప్పి పశుపతికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు, ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుల నెంబర్లు, సీవీవీ నెంబర్లు తీసుకున్నాడు. కొద్దిసేపట్లో మీ డబ్బు కార్డులకు జమ అవుతుందని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. ఆ తర్వాత రూ.3లక్షలు క్రెడిట్‌ కార్డు నుంచి, రూ.3.59లక్షలు డెబిట్‌ కార్డు నుంచి డెబిట్‌ అయినట్లు మెసేజ్‌లు రావడంతో ఆందోళనకు గురైన పశుపతి తనకు వచ్చిన ఫోన్‌ నెంబర్లకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో బాధితుడు శనివారం సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-07-18T14:56:53+05:30 IST