Heart Wrenching: ఒక వైపు కోట్ల నోట్ల గుట్టలు.. మరో వైపు బైక్‌పై తల్లి శవంతో కొడుకుల పాట్లు..

ABN , First Publish Date - 2022-08-01T18:36:30+05:30 IST

రాజకీయ నేతల ఇళ్లలో, వారి బినామీల భవంతుల్లో కోట్లకు కోట్లు డబ్బు కట్టలు బయటపడుతున్న ఇదే దేశంలో తల్లి శవాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు కూడా..

Heart Wrenching: ఒక వైపు కోట్ల నోట్ల గుట్టలు.. మరో వైపు బైక్‌పై తల్లి శవంతో కొడుకుల పాట్లు..

భోపాల్: రాజకీయ నేతల ఇళ్లలో, వారి బినామీల భవంతుల్లో కోట్లకు కోట్లు డబ్బు కట్టలు బయటపడుతున్న ఇదే దేశంలో తల్లి శవాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు కూడా కొడుకు దగ్గర డబ్బు లేని హృదయ విదారక ఘటన ఇది. కష్ట కాలంలో ఆదుకునే దిక్కు లేక, అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సిన వ్యవస్థలు పట్టించుకోక జన్మనిచ్చిన అమ్మకు అంత్యక్రియలు చేసేందుకు ఓ కన్న కొడుకు పడిన అవస్థ ఇది. ఈ దయనీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెలుగుచూసింది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఎన్నో జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కోట్లకు కోట్ల డబ్బు కట్టలు రాజకీయ నేతల ఇళ్లలో మూలుగుతున్న ఈ దేశంలో కన్న తల్లిని కాటికి సాగనంపేందుకు కూడా కొడుకు ఇన్ని పాట్లు పడాల్సిన పరిస్థితి రావడం నిజంగా సిగ్గుచేటు.



ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అనుప్పుర్‌లోని గొదరు గ్రామానికి చెందిన జైమంత్రి యాదవ్ అనే మహిళకు ఛాతి నొప్పి రావడంతో ఆమెను తన కొడుకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిందిగా జిల్లా ఆసుపత్రి వైద్యులు సూచించారు. ఆమెను అక్కడికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ ఆ మెడికల్ కాలేజ్‌లోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లడానికి జైమంత్రి యాదవ్ కొడుకు సుందర్ యాదవ్ అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఆ హాస్పిటల్ నుంచి సొంతూరికి 80 కిలోమీటర్ల దూరం ఉంది. మెడికల్ హాస్పిటల్ అంబులెన్స్ ఏర్పాటు చేయలేదు. ప్రైవేట్ వాహనం మాట్లాడుకుని తల్లి మృతదేహాన్ని తీసుకెళదామంటే 5 వేల రూపాయలకు పైగానే అడుగుతున్నారు. అంత డబ్బు సుందర్ యాదవ్ వద్ద లేదు. కన్న తల్లి ఇక లేదన్న విషయం కొడుకును కుంగదీస్తే.. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా ఇన్ని పాట్లు పడాల్సి రావడం సుందర్ యాదవ్‌ను మరింత బాధించింది.



ఇక.. ఈ వ్యవస్థలను చీత్కరించుకుని కన్న తల్లి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తమ్ముడికి ఫోన్ చేసి బైక్ తీసుకుని ఆసుపత్రికి రమ్మన్నాడు. 100 రూపాయలు పెట్టి ఒక చెక్క స్లాబ్‌ను కొన్నాడు. తన తల్లి మృతదేహాన్ని దానిపై ఉంచి బైక్ తమ్ముడు డ్రైవ్ చేస్తుండగా తల్లి మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకుని 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి సొంతూరికి చేరాడు. ఒక మనిషి చనిపోతే కాటికి సాగనంపేందుకు కూడా శవాల వ్యాన్‌ను ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితులను ఈ ఘటన నిలదీసింది. ఒక పేదవాడు నాణ్యమైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఆరోగ్యం మెరుగుపడటం అటుంచి శవంగా తిరిగి రావడం ఖాయమనే భావనకు బలం చేకూర్చేలా ఈ ఘటన జరగడం శోచనీయం. తన తల్లిని కనీసం పట్టించుకోలేదని, ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్య ధోరణే కారణమని సుందర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై సామాన్య ప్రజల్లో నమ్మకాన్ని సన్నగిల్లేలా చేశాయి.

Updated Date - 2022-08-01T18:36:30+05:30 IST