Shocking : Petrol బంకుల్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయ్.. వాహనదారులూ బీ అలెర్ట్..!

ABN , First Publish Date - 2021-10-15T13:42:03+05:30 IST

రాజు ప్రైవేట్‌ ఉద్యోగి. బైక్‌పై ఉద్యోగానికి వెళ్లేందుకు రోజూ లీటర్‌ పెట్రోల్‌..

Shocking : Petrol బంకుల్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయ్.. వాహనదారులూ బీ అలెర్ట్..!

  • చిప్‌ అమర్చి చీటింగ్‌
  • బంక్‌ యాజమాన్యాల దందా
  • కస్టమర్ల జేబులకు చిల్లు

హైదరాబాద్‌ సిటీ : రాజు ప్రైవేట్‌ ఉద్యోగి. బైక్‌పై ఉద్యోగానికి వెళ్లేందుకు రోజూ లీటర్‌ పెట్రోల్‌ ఒకే బంక్‌లో పోయిస్తాడు. ఇటీవల ఉన్నట్లుండి మైలేజ్‌ తగ్గింది. పెట్రోలు రేట్లు పెరిగాయి అనుకుని మరో రూ.10 పెట్రోల్‌ ఎక్కువగా పోయించేవాడు. అయినా, మునుపటి మైలేజీ రాలేదు. బైక్‌లో ప్రాబ్లం ఉందేమోనని మెకానిక్‌కు చూపించాడు. అతను ఏదో సమస్య చెప్పి, డబ్బులు లాగాడు తప్ప.. మైలేజీలో మాత్రం మార్పు రాలేదు. అనుమానం వచ్చి బాగా తెలిసిన మెకానిక్‌ వద్దకు వెళ్తే.. సమస్య బండిలో లేదని, బంక్‌లో ఉందని చెప్పాడు.


ఒక్కో చిప్‌ రూ. 80వేలు..

పెట్రోల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యులు పెట్రోల్‌ బంక్‌వైపు చూడాలంటేనే భయపడుతున్నారు. ఇదే సమయంలో కొందరు బంక్‌ యజమానులు వాహనదారులను అడ్డంగా దోచుకుంటున్నారు. బంక్‌లలో అత్యాధునిక సాంకేతిక వినియోగించి, రీడింగ్‌తో మోసం చేస్తున్నారు. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్‌ చిప్‌ను ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్ర ముంబై, గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ నుంచి ఒక్కో చిప్‌ రూ.80 వేల నుంచి రూ. లక్షకు కొనుగోలు చేసి తీసుకువచ్చి, బంక్‌లలో అమరుస్తున్నారు. పెట్రోల్‌ పోసేటప్పుడు వాహనదారులకు కనిపించేలా రీడింగ్‌ బోర్డు ఉంటుంది. అయితే, బయటకు కనిపించే రీడింగ్‌ బోర్డు కాకుండా లోపల మరో రీడింగ్‌ బోర్డు కూడా ఉంటుంది. ఆ విషయం కస్టమర్‌లకు తెలియదు.


అన్ని చిప్స్‌కు ఒకే బటన్‌తో మానిటరింగ్‌..

ఓ పెట్రోల్‌ బంక్‌లో సాధారణంగా మూడు నుంచి ఆరు వరకు పెట్రోల్‌, డీజిల్‌ పోసే మిషన్లు ఉంటాయి. అన్ని మిషన్లకు చిప్‌లు అమర్చి.. వాటిని ఆపరేట్‌ చేసేందుకు మేనేజర్‌ రూంలో ఒక మానిటరింగ్‌ బటన్‌ ఏర్పాటు చేస్తారు. పోలీసులు, లీగల్‌ మెట్రాలజీ అధికారులు తనిఖీలకు వస్తున్నారని తెలిస్తే.. వెంటనే మానిటరింగ్‌ బటన్‌ను ఆఫ్‌ చేస్తారు. మిగిలిన సమయాల్లో బటన్‌ ఆన్‌ చేయగానే లోపలి బోర్డులో 50 ఎంఎల్‌ రీడింగ్‌ నమోదవుతుంది. బయటిది మాత్రం అంతా సవ్వంగానే జరుగుతున్నట్లు రీడింగ్‌ నమోదవుతుంది. ఇలా కళ్లముందే కనికట్టు  కట్టి వినియోగదారులను మోసాలకు తెగిస్తున్నారు. 


అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ను లోపలి బోర్డులో ఉన్న రీడింగ్‌ చిప్‌ స్థానంలో బిగిస్తారు. దాంతో ప్రతి లీటర్‌ పెట్రోల్‌కు 50 ఎంఎల్‌ రీడింగ్‌ తక్కువగా నమోదవుతుంది. కానీ, బయట డిస్‌ప్లే బోర్డులో మాత్రం అడిగినంత పెట్రోల్‌ పోసినట్లు చూపిస్తుంది. ఇలా ఒక్కో లీటర్‌కు 50 ఎంఎల్‌ చొప్పున వేల లీటర్లు పెట్రోల్‌ ఆదాచేసుకుంటున్న యజమానులు రోజుకు లక్షల్లో అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇలా ఒక్కో బంక్‌లో ఎన్ని పంపులు ఉంటే అన్ని పంపులకు ఒక్కో చిప్‌ను అమర్చి దోచుకుంటున్నారు. గతేడాది సెప్టెంబర్‌లోనే సైబరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగి ఏపీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి పెట్రోల్‌ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించి ఏపీ, తెలంగాణలో 33 బంక్‌లు, ఈ ఏడాది 34 బంక్‌లు సీజ్‌ చేశారు.

Updated Date - 2021-10-15T13:42:03+05:30 IST