GHMC నిర్వహిస్తున్న సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి..!

ABN , First Publish Date - 2021-10-19T14:26:29+05:30 IST

జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న భవనాల సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి...

GHMC నిర్వహిస్తున్న సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి..!

  • కేటగిరీ.. కిరికిరి
  • ఆస్తి పన్ను చెల్లింపులో 30 శాతానికిపైగా వ్యత్యాసం
  • ఇప్పటికీ పన్ను పరిధిలోకి రాని భవనాలు వేలల్లో
  • వాణిజ్య కేటగిరీ వినియోగం.. నివాస కేటగిరీలో పన్ను
  • నిర్మాణ విస్తీర్ణంలోనూ తేడాలు
  • సర్వేలో గుర్తింపు
  • నోటీసులిస్తున్న జీహెచ్‌ఎంసీ
  • పెనాల్టీతో సహా వసూలుకు రంగం సిద్ధం

హైదరాబాద్‌ సిటీ : వాణిజ్య కారిడార్లలో జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న భవనాల సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. 30 నుంచి 32 శాతం నిర్మాణాలకు సంబంధించి ఆస్తి పన్ను చెల్లింపులో వ్యత్యాసం, మదింపు కానివి ఉన్నట్టు క్షేత్రస్థాయి సర్వేలో అధికారులు గుర్తించారు. అనుమతి తీసుకున్న కేటగిరీ, వినియోగిస్తున్న కేటగిరీ.. పన్ను చెల్లిస్తున్న కేటగిరీకి సంబంధం లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సంస్థ ఖజానాకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతోంది. పురపాలక శాఖ రెండు నెలల క్రితం ప్రకటించిన వాణిజ్య కారిడార్లలో జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగం సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఆస్తి పన్ను మదింపులో వ్యత్యాసం, పన్ను పరిధిలోకి రాని నిర్మాణాలను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 55 వేల భవనాల్లో సర్వే జరిగినట్టు ఓ అధికారి తెలిపారు.


పన్ను పరిధిలోకి రాని భవనాలు..

సర్వే కోసం సర్కిళ్ల వారీగా ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లు, ఇతర సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఓ సర్కిల్‌ బిల్‌ కలెక్టర్‌, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సమక్షంలో మరో సర్కిల్‌లో సర్వే జరుగుతోంది. కొందరు ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్ల అవినీతి వల్లే మదింపులో వ్యత్యాసం, కొన్ని భవనాలు పన్ను పరిధిలోకి ఇప్పటికీ రాలేదన్న ఆరోపణలున్నాయి. కొందరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు వాణిజ్య కేటగిరీ నిర్మాణానికి నివాస కేటగిరీలో, వాస్తవ విస్తీర్ణం కంటే తక్కువ పరిధికి పన్ను మదింపు చేస్తున్నారు. కొందరు ఆస్తిపన్ను మదింపు చేసుకోకున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా అక్రమాలకు చెక్‌ పెట్టేలా ఓ సర్కిల్‌ ఉద్యోగులను మరో సర్కిల్‌కు కేటాయించామని ఓ అధికారి చెప్పారు.


32 శాతం వరకు ఉన్న భవనాల్లో 10 నుంచి 12 శాతం వరకు పన్ను పరిధిలోకి రానివి ఉన్నట్టు గుర్తించారని సమాచారం. మరో 20 శాతం భవనాలకు సంబంధించి ఆస్తిపన్ను మదింపులో వ్యత్యాసం ఉందని భావిస్తున్నారు. ఆయా నిర్మాణదారులకు నోటీసులిస్తున్నామని, జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ ప్రకారం పెనాల్టీతో సహా పూర్తి పన్ను వసూలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణంలో పది శాతం కంటే ఎక్కువ మేర ఉల్లంఘన ఉంటే 25 శాతం, పది శాతం కంటే ఎక్కువ ఉల్లంఘిస్తే 50 శాతం, అనుమతి లేనట్టయితే 100 శాతం ఆస్తిపన్ను పెనాల్టీగా వేస్తారు. దీంతో రూ.120 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.


సర్వేలో పరిశీలిస్తున్నవి..

గ్రేటర్‌లోని 118 రోడ్లను వాణిజ్య మార్గాలుగా గుర్తిస్తు రెండు నెలల క్రితం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు నివాస జోన్‌లో ఉన్న ఆ రహదారులను ఇతర వినియోగానికి అనుగుణంగా మార్చారు. ఇందులో మెజార్టీ ప్రస్తుతం కాంప్రహెన్సీవ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ) పరిధిలో ఉన్నవే. మెరుగైన నిర్మాణం, నిర్వహణలో భాగంగా నగరంలోని 709 కి.మీల రోడ్లను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించారు. ఆయా మార్గాలను సీఆర్‌ఎంపీ రహదారులుగా గుర్తించేలా బోర్డులూ ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించేందుకు సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతో సీఆర్‌ఎంపీ రోడ్లలో సర్వే చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు నెలన్నరగా సాగుతోన్న సర్వేలో భాగంగా ఆయా మార్గాల్లోని భవనాలను పరిశీలిస్తున్నారు. ఏ కేటగిరీ అనుమతి ఉంది..? దేని కోసం వినియోగిస్తున్నారు..? పన్ను మదింపు జరిగిందా..? భవన వినియోగ కేటగిరీలో పన్ను చెల్లిస్తున్నారా..? నిర్మాణ విస్తీర్ణం..? ఎంత మేర విస్తీర్ణానికి పన్ను మదింపు జరిగింది..? తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. సర్వేలో భాగంగా భవనాల ఫొటోలూ తీసుకుంటున్నారు.

Updated Date - 2021-10-19T14:26:29+05:30 IST