ట్రంప్ మద్దతుదారుల ర్యాలీలో కాల్పులు !

ABN , First Publish Date - 2020-11-07T21:06:22+05:30 IST

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మద్దతుదారులు శుక్రవారం సాయంత్రం ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడెర్డేల్‌లో నిర్వహించిన ర్యాలీలో కాల్పులు కలకలం సృష్టించాయి.

ట్రంప్ మద్దతుదారుల ర్యాలీలో కాల్పులు !

ఫోర్ట్ లౌడెర్డేల్(ఫ్లోరిడా): రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మద్దతుదారులు శుక్రవారం సాయంత్రం ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడెర్డేల్‌లో నిర్వహించిన ర్యాలీలో కాల్పులు కలకలం సృష్టించాయి. కారులో వచ్చిన ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. నార్త్ ఫెడరల్ హైవే సమీపంలోని కోరల్ రిడ్జ్ మాల్‌కు ర్యాలీ చేరుకోగానే కదులుతున్న కారులోంచి దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ర్యాలీని లక్ష్యంగా చేసుకునే దుండగుడు కాల్పులు జరిపినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులు జరిపిన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అదే ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 


యావత్ ప్రపంచం తదుపరి అగ్రరాజ్యాధిపతి ఎవరు అనే విషయమై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష పీఠానికి అడుగు దూరంలో ఉన్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం బైడెన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు వస్తే... ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ మ్యాజిక్ ఫిగర్ 270కు 6 ఎలక్టోరల్ ఓట్ల దూరం ఉన్నారు. ఇంకా ఐదు రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉంది. వీటిలో మూడింట బైడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో బైడెన్ విజయం సాధించిన అధ్యక్ష పీఠం అధిష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది. 

Updated Date - 2020-11-07T21:06:22+05:30 IST