నయా షూటింగ్‌ స్పాట్‌లు

ABN , First Publish Date - 2022-10-03T14:22:05+05:30 IST

హైదరాబాద్‌లో షూటింగ్‌లు అనగానే ఇప్పటివరకు స్టూడియోలే గుర్తుకొచ్చేవి. ఇప్పుడా పరిస్థితి మారింది. కొత్త ప్రాంతాలు షూటింగ్‌ స్పాట్‌లుగా మారుతున్నాయి. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా

నయా షూటింగ్‌ స్పాట్‌లు

ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుల్లో చిత్రీకరణ

మెజార్టీ తెలుగు సినిమాల్లో కేబుల్‌ వంతెన

సైబర్‌ టవర్స్‌, బయో డైవర్సిటీ ఇతర ఫ్లై ఓవర్లు కూడా

జీహెచ్‌ఎంసీకి పెరిగిన ఆదాయం 


హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌లో షూటింగ్‌లు అనగానే ఇప్పటివరకు  స్టూడియోలే గుర్తుకొచ్చేవి. ఇప్పుడా పరిస్థితి మారింది. కొత్త ప్రాంతాలు షూటింగ్‌ స్పాట్‌లుగా మారుతున్నాయి. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా మెజార్టీ టాలీవుడ్‌ చిత్రాల్లో నగర అందాలు కనువిందు చేస్తున్నాయి. తద్వారా జీహెచ్‌ఎంసీకీ ఆదాయం పెరిగింది. కేబుల్‌ వంతెన, సైబర్‌ టవర్స్‌, బయో డైవర్సిటీ వంతెనలు, అయ్యప్ప సొసైటీ అండ్‌పాస్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌ తదితర ప్రాంతాల్లో నిర్మించిన లింక్‌ రోడ్లలో తరచూ షూటింగ్‌లు జరుగుతున్నాయి. కొంత కాలంగా విడుదలవుతోన్న చాలా తెలుగు చిత్రాల్లో కేబుల్‌ వంతెన కనిపించడం సాధారణమై పోయింది. ఐటీ కారిడార్‌కు ప్రవేశ మార్గంగా ఉన్న ఈ వంతెనపై సన్నివేశాలతోపాటు, పాటలూ చిత్రీకరిస్తున్నారు. గచ్చిబౌలి కేర్‌ ఆస్పత్రి నుంచి మణికొండ వైపు రెండు కొండల మధ్య నిర్మించిన లింక్‌ రోడ్డులో ఫైట్‌ సీన్ల చిత్రీకరణకు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. బయో డైవర్సిటీ, సైబర్‌ టవర్స్‌ వంతెనలపైనా పలు సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. సినిమాలే కాకుండా టెలివిజన్‌ సీరియళ్లు, వెబ్‌ సిరీ్‌సలూ, వ్లాగ్‌ల షూటింగ్‌లు రోడ్లపై చేస్తున్నారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా అందుబాటులోకి వచ్చిన పలు ప్రాజెక్టులు షూటింగ్‌ స్పాట్‌లుగా మారుతున్నాయి. 


ఆన్‌లైన్‌లో అనుమతి.. రోజుకు రూ.30 వేలు

  గతంలో జీహెచ్‌ఎంసీని సంప్రదించి అనుమతి తీసుకునే విధానం ఉండగా.. 2019 నుంచి ఆన్‌లైన్‌ పద్ధతిలో అనుమతుల జారీ మొదలైంది. తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టీఎ్‌సఎ్‌ఫడీసీఎల్‌) వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అనుమతి పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.  నిర్ణీత మొత్తం ఆన్‌లైన్‌లో/కమిషనర్‌ జీహెచ్‌ఎంసీ పేరిట డీడీ తీసి అధికారులకు సమర్పించడం ద్వారా అనుమతి పొందవచ్చు. ప్రాంతాలతో సంబంధం లేకుండా గంటల వారీగా అద్దె నిర్ణయించారు. ఒక రోజు షూటింగ్‌కు (ఎనిమిది గంటలకు మించకుండా) కనీస రుసుము రూ.30 వేలు చెల్లించాలి. ఆ తరువాత ఒక్కో గంటకు రూ.4 వేలు అదనం. రిఫండబుల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుంది.  పోలీస్‌ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఉంటేనే చిత్రీకరణకు అనుమతి ఇస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి.  


ఆదాయం రెట్టింపు...

 చిత్రీకరణ అనుమతుల ద్వారా గతంలో యేటా రూ.15లక్షల నుంచి రూ.20 లక్షల ఆదాయం మాత్రమే వచ్చేదని ఎస్టేట్‌ విభాగం వర్గాలు పేర్కొన్నాయి. కొంతకాలంగా ఈ మొత్తం పెరిగింది. 2021-22లో కేవలం పార్కుల్లో షూటింగ్‌ ద్వారా రూ.24.19 లక్షలు సమకూరగా.. వంతెనలు మునిసిపల్‌ మార్కెట్లలో షూటింగ్‌ అనుమతుల ఆదాయం మరో రూ.20 లక్షలకుపైగా ఉంటుందని ఓ అధికారి చెప్పారు. ఈ యేడాది చిత్రీకరణ ద్వారా వచ్చే ఆదాయం రూ.50-60 లక్షల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-10-03T14:22:05+05:30 IST