దుకాణం బంద్‌

ABN , First Publish Date - 2021-07-28T05:59:19+05:30 IST

జీవీఎంసీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో మూడేళ్లు దాటిన వారందరినీ ఖాళీ చేయించి, ఆ షాపులకు వేలం వేయాలని అధికారులు భావిస్తున్నారు.

దుకాణం బంద్‌
తాళాలు వేయడంతో వెలవెలబోతున్న టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌

మూడేళ్లు దాటిన షాపులకు జీవీఎంసీ తాళాలు

మళ్లీ వేలం వేయాలని నిర్ణయం

అర్థంతరంగా మూసేస్తే ఎలాగని వ్యాపారుల ఆందోళన

బినామీలు ఉన్నారని అధికారుల వాదన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


జీవీఎంసీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో మూడేళ్లు దాటిన వారందరినీ ఖాళీ చేయించి, ఆ షాపులకు వేలం వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు మూడేళ్లు గడువు పూర్తయిన దుకాణాలన్నింటికీ తాళాలు వేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపానున్న ఒక్క టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లోనే గత గురువారం 48 షాపులను మూసేశారు. ఆ రోజు నుంచి వాటిని తెరుచుకునే అవకాశం ఇవ్వడం లేదు. ఇదొక్కటే కాకుండా సీతమ్మధార, డైమండ్‌ పార్క్‌, బీచ్‌ రోడ్డు, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లోను ఇలాగే చేశారు.


నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే..?


షాపులు ఖాళీ అయినప్పుడు జీవీఎంసీ అధికారులు వేలం నిర్వహించి ఎవరు ఎక్కువ అద్దె ఇస్తామంటే వారికి షాపులు ఇస్తున్నారు. ఇది మూడేళ్ల కాలపరిమితి. ఆ తరువాత కొనసాగాలంటే...అద్దెలో 33 శాతం పెంచి ఇవ్వాలి. ఇలా 25 ఏళ్ల వరకు ఉండవచ్చు. 


ఏమి జరిగిందంటే..?


ఇటీవల కరోనా కారణంగా చాలామంది షాపులు తెరవలేదు. అయినప్పటికీ పాత అద్దెను చెల్లిస్తున్నారు. మూడేళ్ల కాలపరిమితి దాటిపోయినవారు 33 శాతం పెంపుతో అద్దె చెల్లించాల్సి వుండగా...అలా చేయడం లేదు. చాలా షాపులకు మూడేళ్ల కాలపరిమితి దాటిపోయింది. ప్రైవేటు భవనాల యజమానులు  ప్రస్తుతం కరోనా కాలానికి అద్దె సగం తీసుకోవడమో, లేక కొంత గడువు ఇవ్వడమో చేస్తున్నారు. అయితే జీవీఎంసీ అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా గత నెల రోజుల నుంచి మూడేళ్లు దాటిపోయిందని చెప్పి అనేక షాపులను స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో తమ ఉపాధి పోయిందని, ఇలాగైతే ఎలాగని దుకాణదారులు లబోదిబోమంటున్నారు. టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లో ఒక్కో షాపులో కోటి రూపాయల సరకు ఉంటుందని, ఇలా అర్థంతరంగా మూసేస్తే...తాము ఏమైపోవాలని వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


ఎవరూ స్పందించడం లేదు


ఈ అంశంపై జోనల్‌ కమిషనర్‌ను కలిస్తే..జీవీఎంసీ కమిషనర్‌ను కలవమని చెబుతున్నారు. అక్కడికి వెళితే..అపాయింట్‌మెంట్‌ లభించడం లేదు. తమ కష్టాలు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఎలాగంటూ వ్యాపారులు నిరసిస్తున్నారు.


మాఫియా తయారైందనే అనుమానంతోనే


జీవీఎంసీ షాపులను అద్దెకు తీసుకొని వాటిని మరొకరికి సబ్‌ లీజుకు ఇస్తూ కొందరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. ఎవరి పేరునైతే షాపు ఇచ్చామో...వారు అందులో ఉండడం లేదని, వేరే వారు ఉంటున్నారని, తమకు చెల్లించే అద్దె కంటే నాలుగైదు రెట్లు అద్దె ఎక్కువ వారు వసూలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇలాంటి బినామీలను ఏరివేయడానికే గడువు ముగిసిన వాటికి తాళాలు వేస్తున్నామని చెబుతున్నారు. వీటన్నింటికీ తిరిగి వేలం నిర్వహిస్తామని, అప్పుడు అవసరమైన వారు హాజరై పాడుకోవచ్చునని సూచిస్తున్నారు.  


బినామీలపై సర్వే జరుగుతోంది


జీవీఎంసీ షాపులు ఎవరు అద్దెకు తీసుకున్నారు?, ఏ వ్యాపారం చేస్తామని చెప్పారు?, ఇప్పుడు అందులో ఎవరు ఉన్నారు?, ఏ వ్యాపారం చేస్తున్నారు?, అద్దె ఎంత చెల్లిస్తున్నారు?...అనే విషయాలపై సర్వే చేస్తున్నట్టు జీవీఎంసీ ఉన్నతాధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’ తెలిపారు. ఇవన్నీ పూర్తయ్యాక, బినామీలున్న షాపులను స్వాధీనం చేసుకొని వేలం వేస్తామని చెప్పారు. 

Updated Date - 2021-07-28T05:59:19+05:30 IST