కూలీల కొరత

Jun 17 2021 @ 00:37AM
జిల్లాలో కొనాసాగుతున్న ఉపాధి హామీ పనులు

- జిల్లాలో ప్రారంభమైన వర్షాకాలం సీజన్‌ పనులు

- సమృద్ధిగా కురుస్తున్న వర్షాలు 

- జోరందుకున్న పంటల సాగు 

- అయినా.. ఇంకా కొనసాగుతున్న ఉపాధి పనులు

- వ్యవసాయ పనులకు కూలీల కొరత 

- కూలి భారం పడడంతో పెదవి విరుస్తున్న రైతులు

బోధన్‌, జూన్‌ 16: జిల్లాలో వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పనులు కొనసాగుతుండడం తప్పనిసరి. గ్రామాలలో 45 శాతం మందిపైనే కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని నిబంధనలు విధించడంతో వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడేలా చేసింది. ఓ వైపు వ్యవసాయ పనులు.. మరోవైపు ఉపాధి కూలీల పనులు రెండు వైపులా జోరుగా కొనసాగుతుండడంతో వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడి కూలీలకు డిమాండ్‌ ఏర్పడింది. 

జిల్లాలో ఊపందుకున్న వ్యవసాయ పనులు

ఈ ఏడాది వర్షకాలం సకాలంలో ప్రారంభం కావడం.. వర్షాలు సీజన్‌ ప్రారంభంలోనే కురుస్తుండడంతో వ్యవసాయ పనులు జిల్లాలో జోరుగా ఊపందుకున్నాయి. దీనిలో భాగంగా బోధన్‌ డివిజన్‌ పరిధిలో గల వర్ని, మోస్రా, చందూరు, కోటగిరి, రుద్రూరు, ఎడపల్లి, రెంజల్‌, బోధన్‌ మండలాలలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వరి నాట్లు ఒకవైపు మొదలుకాగా.. మరోవైపు మెట్టపంటలు వేసుకునే రైతులు విత్తనాలను విత్తుకుంటున్నారు. సోయాబీన్‌, కంది, పెసర, మినుము ఇతర ఆరుతడి పంటలు వేసుకునే రైతులు విత్తనాలను విత్తుకునే పనిలో నిమగ్నమయ్యారు. వానాకాలం ప్రారంభంలోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడం వ్యవసాయ పనులను వేగవంతం చేస్తున్నాయి. మరోవైపు వేసవిలో ప్రారంభమైన ఉపాధి హామీ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ కూలీలకు పనులు లేని సమయంలో, పనులు కల్పించాల్సిన ఉపాధి హామీ పనులు వర్షాలు కురిసి వ్యవసాయ పనులు మొదలైన ఇంకా కొనసాగుతుండడం రైతులకు ఇబ్బందికరంగా మారాయి. వ్యవసాయ పనులకు కూలీలు దొరుకక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే కూలీలకు తీవ్ర డిమాండ్‌ నెలకొంది. వరినాట్లు వేసే మహిళా కూలీలకు రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు చెల్లిస్తుండగా, మగ కూలీలకు రూ.600 నుంచి రూ.700 వరకు చెల్లిస్తున్నారు. 

కొనసాగుతున్న ఉపాధి పనులు

ఉపాధి హామీ పనులు ఇంకా కొనసాగుతుండడంతో ఈ పరిస్థితులు వ్యవ సాయ పనులకు ఆటంకంగా మారాయి. దీంతో పాటు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వ్యవసాయ పనులకు కూలీలు దొరుకకుండా ఇబ్బందులు కలిగి స్తున్నాయని రైతులు వాపోతున్నారు. మరోవైపు ఉపాధి హామీ అధికారులు ఉన్నత స్థాయిలో ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని, ప్రతీ పంచాయతీలో 40 శాతం మేరకు కూలీలకు పనులు చూపాలని టార్గెట్‌లు విధిస్తుండడం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బందికి పనులు కల్పించడంలో టార్గెట్‌లు విధిస్తూ ఒత్తిళ్లు పెంచుతుండడంతో ఉపాధి హామీ పనులను కొనసాగిస్తుండడం తప్పనిసరిగా మారింది. వర్షాలు కురిసి వ్యవసాయ పనులు జోరందుకున్న, వరినాట్లు కొనసాగుతున్న.. ఉపాధి హామీ పనులు కొనసాగించడం పట్ల రైతులు పెదవి విరుస్తున్నారు. కూలీలు దొరుకక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల వేళా ఉపాధి పనులు ఏమిటని? ఉన్నత అధికారులు కిందిస్థాయిలో ఉపాధి పనులు కల్పించాలని టార్గెట్‌లు విధించడం ఏమిటని? ప్రశ్నలు ఉత్పన్నమవుతు న్నాయి. రైతులకు కూలీల ఇబ్బందులు లేకుండా కూలి భారం పడకుండా అధికార యంత్రాంగం ఆలోచించాలని రైతులు కోరుతున్నారు. 

ఉపాధి పనులను నిలిపివేయాలి

: శ్రీధర్‌, సర్పంచ్‌, వడ్డెపల్లి, దిశా కమిటీ సభ్యుడు

పనిలేనప్పుడు పని కల్పించే ఉద్దేశంతో రూపొందించిన పథకం జాతీయ గ్రామీణ పథకం. కానీ నేడు కూలీలకు వారినాట్లు మెట్ట పంటల పనులు సంవృద్ధిగా ఉన్న ప్రస్తుత తరుణంలో 45 శాతం కూలీలు క్రమం తప్పకుండా ఉపాధి పనులకు రావాలని గ్రామ పంచాయతీలపై అధికారులు ఒత్తిడి తేవడం సరైనది కాదు. ఇప్పుడు ఉన్న పనిదినాలు అయిపోతే.. పనిలేని సమయంలో కూలీలకు పని దొరకదు. అందుకే ప్రస్తుతం పనులు నిలిపివేయాలని కోరుతున్నాం.

Follow Us on: