కూలీల కొరత

ABN , First Publish Date - 2021-07-30T06:41:45+05:30 IST

జిల్లాలో కూలీల కొరత వేధిస్తోంది. రుతుపవనాలకు తోడు అల్పపీడన ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవడం.. మండుటెండల్లోనే కాళేశ్వరం జలాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చెరువులను నింపడం, శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు, అన్నపూర్ణ అనంతగిరి ప్రాజెక్ట్‌ల ద్వారా భూగర్భజలాలు పెరిగాయి. భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లాయి. చెరువులు మత్తడి దూకడంతో గతంలో ఎన్నడూ లేనంతగా వరి సాగు పెంచుకున్నా రు.

కూలీల కొరత
ఎల్లారెడ్డిపేట మండలంలో నాట్లు వేస్తున్న బెంగాల్‌కు చెందిన కూలీలు

- డబుల్‌ కూలి ఇస్తామన్నా దొరకని వైనం

- ఇతర రాష్ట్రాల వారే ఆధారం 

- గతేడాది రూ. 400 ఇప్పుడు రూ. 800

- ఆటో ఛార్జీలు అదనం 

- జిల్లాలో జోరందుకున్న వరినాట్లు 

-  1.68 లక్షల ఎకరాల్లో సాగు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలో కూలీల కొరత వేధిస్తోంది. రుతుపవనాలకు తోడు అల్పపీడన ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవడం.. మండుటెండల్లోనే కాళేశ్వరం జలాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చెరువులను నింపడం, శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు, అన్నపూర్ణ అనంతగిరి ప్రాజెక్ట్‌ల ద్వారా భూగర్భజలాలు పెరిగాయి. భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లాయి. చెరువులు మత్తడి దూకడంతో గతంలో ఎన్నడూ లేనంతగా వరి సాగు పెంచుకున్నా రు. వరినాట్లు ఒకవైపు ఊపందుకున్నా కూలీల కొరత ఇబ్బందిగా మారింది. గత సంవత్సరం కంటే రెండింతలు కూలి పెంచినా నాట్లు వేయడానికి కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత సంవత్సరం వరినాట్లకు కూలీకి రూ. 400 నుంచి రూ. 500లు చెల్లిస్తే ప్రస్తుతం రూ. 700 నుంచి రూ. 800 వరకు చెల్లించాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ఆటో ఛార్జీలు అదనంగా ఇస్తున్నారు. దీనికితోడు డీజిల్‌ ధరలు పెరగడంతో ట్రాక్టర్‌ కిరాయిలు కూడా భారీగా పెంచారు. ఎకరానికి రూ. 500 అదనంగా వసూలు చేస్తున్నారు. భూగర్భజలాలు పెరగడం, సమృద్ధిగా నీరు ఉండడంతో రైతులు వరిసాగును జిల్లాలో పెంచుకున్నారు. జిల్లాలో వానాకాలం సాగు 2.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని అంచనా వేయగా అందులో వరి 1.68 లక్షల ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 78 వేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఆగస్టు రెండో వారం వరకు నాట్లు పూర్తి కావాల్సి ఉండడంతో రైతులు కూలీల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల రైతు కుటుంబాలే నాట్లు వేసుకుంటున్నారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, చందుర్తి, బోయినపల్లి, ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, వీర్నపల్లి, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడ, వేములవాడ రూరల్‌, మండలాల్లో వరినాట్లు జోరుగా సాగుతున్న డబుల్‌ కూలీతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

- జిల్లాలో ఇతర రాష్ట్రాల కూలీలు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరినాట్లకు కూలీల కొరత తీవ్రంగా ఉంది. పొరుగు జిల్లాలైన సిద్ధిపేట, కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల నుంచి ఆటోల ద్వారా కూలీలను రప్పించినా నాట్లకు ఇబ్బందులే ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలపైనే రైతులు ఆధారపడుతున్నారు. జిల్లాలో బెంగాల్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కూలీలు జిల్లాలో వరి నాట్లు వేస్తున్నారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటలో కలకత్తా ప్రాంతానికి చెందిన కూలీలు పనిచేస్తుండగా బోయినపల్లిలో ఆంధ్రా కూలీలు, ఇల్లంతకుంటలో బిహార్‌ కూలీలు, వీర్నపల్లిలో ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ కూలీలు పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఒక జట్టుగా ఎకరానికి రూ. 5,500ల నుంచి రూ. ఆరు వేల వరకు కూలి తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 78 వేల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. మరో లక్ష ఎకరాల వరకు వరినాట్లు పడాల్సి ఉండడంతో వలస కూలీలపైనే రైతులు ఆధారపడుతున్నారు. 

- వర్షం.. నష్టం.. 

కూలీల కొరతతో సతమతమవుతున్న రైతులకు ఇటీవల కురిసిన భారీ వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి. వానాకాలం ప్రారంభదశలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 559 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. గంభీరావుపేటలో 120 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 130 ఎకరాలు, చందుర్తిలో 130 ఎకరాలు, ఇల్లంతకుంటలో 45 ఎకరాలు, తంగళ్లపల్లిలో 60 ఎకరాలు, ముస్తాబాద్‌లో 30 ఎకరాలు, రుద్రంగిలో 30 ఎకరాలు, కోనరావుపేటలో 14 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రాబోయే రోజుల్లో ఎలాంటి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2021-07-30T06:41:45+05:30 IST