సాగుకు కూలీల కొరత

ABN , First Publish Date - 2020-07-06T11:12:23+05:30 IST

వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో కూలీల కొరత ఏర్పడుతోంది. దీంతో వానాకాల పంటల సాగు కష్టంగా మారుతోంది.

సాగుకు కూలీల కొరత

సాగుపై కూలీ భారం

జిల్లాలో మొదలైన వానాకాలం పంటల సాగు

గ్రామాల్లో కూలీలు దొరక్క ఇబ్బందులు

పల్లెలకు పరుగులు తీస్తున్న పట్టణ కూలీలు


కామారెడ్డి, జూలై 5: వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో కూలీల కొరత ఏర్పడుతోంది. దీంతో వానాకాల పంటల సాగు కష్టంగా మారుతోంది. అసలే అంతంత మాత్రంగా సాగు నీటి వనరులున్న జిల్లా లో ఎక్కువగా వర్షాధార పంటలైన పత్తి, సోయా, కంది, మినుములు, పెసర పంటలనే సాగు చేస్తుంటారు. ఇప్పటికే విత్తనాలు వేయడం పూర్తి చేసిన రైతుల పంటల్లో కలుపుతీసి పనుల్లో పడిపోయారు. దీంతో ఏ గ్రామంలో చూసినా అందరూ పొలం బాటనే పడుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పంట పొలం లోనే బిజీబిజీగా గడుపుతున్నారు. ఒక్కసారిగా అన్ని రకాల పంట పను లు ప్రారంభించకపోవడంతో కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం సీజన్‌లో సాగు చేస్తున్నారని అంచనా వేస్తు న్నారు. గత రెండు, మూడు రోజులుగా కరుస్తున్న చెదురు, ముదురు వర్షాలకు కలుపు తీసే పనులతో పాటు ఎరువులు వేయడం, మందులు పిచికారి చేయడం లాంటి పనులు అంతటా ఒకేసారి ఊపందుకున్నా యి.


ఈ సంవత్సరం జిల్లాలో పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా  పెరిగింది. కానీ కూలీల కొరత కారణంగా సకాలంలో కలుపు తీయకుంటే పంటలకు చీడపీడలు ఆశించే పంట ఎదుగుదల ఆగిపోతుందనే భయం రైతుల్లో కనిపిస్తోంది. కొందరు పెద్ద రైతులు అధిక డబ్బులకు చెల్లించి పనులు పూర్తి చేయిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందికరం గా మారుతోంది. అలాగే కొద్ది రోజులుగా సరిపడా వర్షాలు కురువక పోవడంతో ఒకానొక దశలో ఈ వ్యవసాయం ఎందుకు రా దేవుడా అం టూ తలలు పట్టుకున్నారు. కళ్లముందే పంటలు నేలపాలు కావడంతో పాటు కలుపు తీసేందుకు కూలీలు దొరకడం లేదు. ఇకనైనా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తే వ్యవసాయం కొంత మేరకైనా లాభసాటిగా మారే అవకాశం కనిపిస్తోంది.


పట్టణ కూలీలపైనే భారం

గ్రామాల్లో అంతటా ఒకేసారి ఖరీఫ్‌ పనులు ఊపందుకోవడంతో కూలీలకు భలే డిమాండ్‌ ఏర్పడింది. విత్తనాలు వేయడం, కలుపు తీయ డం, ఎరువులు వేయడానికి అదనుదాటి పోతుండడంతో అధిక కూలి చెల్లించి సాగు పనులు చేసుకోవాల్సి వస్తోంది. అయినా స్థానికంగా కూలీలు దొరక్కపోవడంతో పట్టణ ప్రాంతాలు, ఇతర మండలాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వస్తోంది. నిత్యం వందల సంఖ్యలో కూలీలు సమీప గ్రామాలకు పనులకు వెళ్తున్నారు.


పెరిగిపోతున్న ఖర్చు

సాధారణంగా గ్రామాల్లో సీజన్‌ను  బట్టి కూలీల చెల్లింపులుంటాయి. సుమారుగా రూ.150 నుంచి రూ.200 వరకు ఒకరోజు కూలీ ఉంటుంది. కానీ ప్రస్తుతం కూలీల కొరతతో ఒక రోజు కూలీకి రూ.300 నుంచి 500 వరకు చెల్లించాల్సి వస్తోంది. అలాగే అదనంగా కూలీలకు రానుపోను రవాణా చార్జీలను రైతులే చెల్లిస్తున్నారు. దాదాపు 20 నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు పనులు చేసేందుకు పట్టణ కూలీలు వెళ్తున్నారు. రోజంతా విత్తనాలు వేయడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం లాంటి పనులు చేస్తున్నారు.

Updated Date - 2020-07-06T11:12:23+05:30 IST