సిగ్గు పడాలి!

ABN , First Publish Date - 2020-03-15T06:10:48+05:30 IST

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు అంతరాత్మ ఉండదా? మీరు జీతాలు, ఇతరత్రా సౌకర్యాలు పొందుతున్నది ప్రజల సొమ్ముతోనే కదా? ముఖ్యమంత్రులు తమ జేబులో నుంచి ఇవ్వడం లేదు కదా? ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్న రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది...

సిగ్గు పడాలి!

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు అంతరాత్మ ఉండదా? మీరు జీతాలు, ఇతరత్రా సౌకర్యాలు పొందుతున్నది ప్రజల సొమ్ముతోనే కదా? ముఖ్యమంత్రులు తమ జేబులో నుంచి ఇవ్వడం లేదు కదా? ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్న రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది అధికారుల ప్రవర్తన ఉన్న కారణంగానే హైకోర్టుకు పనిభారం పెరిగింది. ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్‌లో బాధితులకు ఉపశమనం కలిగించే ఏకైక వ్యవస్థగాఉన్నత న్యాయస్థానం నిలబడింది. ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలపై గతంలో ఎన్నడూ లేని విధంగా లెక్కకు మించి ఫిర్యాదులు దాఖలు అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో హైకోర్టు కూడా ఆదుకోకపోతే దిక్కేమిటి? అని సామాన్య ప్రజలు భావిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో లీలామాత్రంగా ఊహించాం గానీ.. మొత్తం వైసీపీ నాయకులంతా రౌడీలుగా ప్రవర్తిస్తారని అనుకోలేదు అని బీజేపీకి చెందిన ఒక ముఖ్యుడు కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నది ట్రైలర్‌ మాత్రమేననీ, అసలు సినిమా ముందు ఉంటుందనీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడో చెప్పారు. అసలు సినిమా ఎంత భయానకంగా ఉండబోతుందో ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరిస్తున్న విధానాన్ని మున్ముందు సాధారణ ఎన్నికలలో కూడా అనుసరించాలని కోరుకోరా? అందుకే కాబోలు 30 సంవత్సరాలపాటు అధికారం మాదే అని వైసీపీ నాయకులు విర్రవీగుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో రోజుకో వ్యవస్థ న్యాయస్థానం ముందు చేతులు కట్టుకుని నిలబడుతోంది. కార్యనిర్వాహక వ్యవస్థతోపాటు స్వతంత్రంగా పనిచేయవలసిన ఎన్నికల కమిషన్‌కి కూడా ఈ దుస్థితి ఎందుకు? స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలు పెచ్చరిల్లుతున్నప్పటికీ సంబంధిత వ్యవస్థలు చర్యలు తీసుకోకపోవడంతో కక్షిదారులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన దుస్థితి. మొన్న రాష్ట్ర డీజీపీ, నిన్న ఎన్నికల కమిషన్‌ హైకోర్టు ధర్మాసనం ముందు దోషిగా నిలబడే స్థితి దాపురించింది. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ అధికార పార్టీతో చేతులు కలపడం వల్లనే గతంలో ఎన్నడూ లేని విధంగా స్పందించవలసిన పరిస్థితి న్యాయస్థానానికి ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు అధికార పార్టీ ఉన్నతికి పాటుపడదాం అని ట్వీట్‌ చేయడం విడ్డూరంగా అనిపించడం లేదా? పరిస్థితులు అరాచకంగా మారినప్పుడు బిహార్‌లా ఉందేమిటి? అని అంటూ ఉంటారు. ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు బిహార్‌ను మరిపిస్తున్నాయి. నిజానికి బిహార్‌ వంటి వెనుకబడిన రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచక పాలన సాగుతోంది.


చట్టాలకు, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అఖిల భారత సర్వీసు ఉన్నతాధికారులు కూడా ఈ పాపంలో పాలుపంచుకోవడం విషాదం! ప్రభుత్వ చర్యలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రతీ రోజూ తప్పుబడుతున్నప్పటికీ దులుపుకెళ్లిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దీవెన ఉంటే చాలు.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అన్నట్టుగా అధికార వ్యవస్థ.. ముఖ్యంగా పోలీసులు విర్రవీగుతున్నారు. ‘‘ఇది రాష్ట్రమేనా? ఇక్కడ చట్టం అమలవుతోందా?’’ అని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ప్రశ్నించడం దేనికి సంకేతం? ‘‘కోడ్‌ అమలులోకి వస్తేనే మీకు అధికారాలు సంక్రమిస్తాయని అన్నారు. ఇప్పుడు కోడ్‌ అమలులో ఉంది కదా? ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళతాం’’ అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించాక కూడా ప్రతిపక్షాలకు ఉపశమనం లభించని దుస్థితి! నాలుగు రోజుల క్రితం మాచర్ల వెళ్లిన తెలుగుదేశం నాయకులు బొండా ఉమామహేశ్వరావు, బుద్దా వెంకన్నలపై ఏ మాత్రం వెరపు లేకుండా దాడికి తెగబడిన తురకా కిశోర్‌ అనే వ్యక్తిని మాచర్ల మునిసిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించడం అధికార పార్టీ బరితెగింపునకు నిదర్శనం కాదా? ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చిన ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన పనేనా ఇది? ఇళ్ల స్థలాల పేరిట అసైన్డ్‌ భూములలో పంటలను కూడా ధ్వంసం చేసి మరీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇందుకు పోలీసులు సహకరించడంపై న్యాయస్థానం కూడా మండిపడింది. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు కొన్ని ప్రశ్నలు వేసింది.


హైకోర్టు ధర్మాసనం ముందు నిలబడి సెక్షన్‌ 151 అంటే అర్థం ఏమిటో చదవాల్సి రావడం డీజీపీకే కాదు.. మొత్తం పోలీసు వ్యవస్థకే అవమానం కాదా? డీజీపీ పదవి ఇచ్చారన్న కృతజ్ఞత గౌతమ్‌ సవాంగ్‌కు ఉంటే ఉండవచ్చు గాక! రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఆయనపై లేదా? తనపై న్యాయస్థానంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవడం సవాంగ్‌కు గౌరవమా? తెలుగుదేశం నాయకులపై దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కింద కేసు పెట్టామని చెప్పి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారు? ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం అన్యాయం కాదా? ప్రతిపక్షాల వారిని నామినేషన్లు ఉపసంహరించుకునేలా పోలీసులు బెదిరించడం, కొన్ని ప్రాంతాలలో చిత్రహింసలకు గురిచేయడం ఏమిటి? ప్రత్యర్థుల ఇళ్లల్లో అక్రమంగా మద్యం సీసాలు పెట్టినవారిని వదిలేసి.. అమాయకులపై కేసులు పెట్టడం నాగరిక వ్యవస్థలో పోలీసులు చేయవలసిన పనేనా? నియంతల పాలనలో ఇలాంటి అకృత్యాలు, అఘాయిత్యాలు జరిగాయని విన్నాం. ప్రజాస్వామ్య యుగంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో కొలువులు వెలగబెడుతూ ఇలాంటి వాటిని ఎలా ప్రోత్సహిస్తారు? ఈ ప్రశ్నలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వద్ద సమాధానం ఉందా? రాజకీయ పార్టీలు అదుపు తప్పి ప్రవర్తించినప్పుడు శాంతిభద్రతలను కాపాడటం, పౌరులకు రక్షణ కల్పించడం పోలీసుల విధి కాదా? రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ పోలీసులను ఆశ్రయించిన జగన్‌ అండ్‌ కోకు పోలీసులు దాసోహం కావడం సబబేనా? రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారి అరాచకం పెచ్చరిల్లితే ఏమి జరుగుతుందో తెలియదా? హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. రూల్‌ ఆఫ్‌ లాను అమలుచేయవలసిన బాధ్యత పోలీసులది కాదా? ఇవ్వాళ వైసీపీ అధికారంలో ఉండవచ్చు.. రేపు మరో పార్టీ అధికారంలోకి రావచ్చు. అప్పుడు వారు కూడా ప్రతీకారానికై తెగబడితే పరిస్థితి ఏమిటి? ఇవే పరిస్థితులు కొనసాగితే అధికార పార్టీ పేరు చెప్పి వీధికో రౌడీ తయారు కాడా? ఒకప్పుడు హైదరాబాద్‌లో ప్రాంతానికో రౌడీ చెలరేగిపోయేవారు.


ఎన్‌టీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి రౌడీల ఆట కట్టించారు. విజయవాడలో కూడా ఒకప్పుడు ఇలాంటి రౌడీయిజమే సాగింది. రౌడీలు రాజ్యమేలితే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉంటుందా? డీజీపీ సవాంగ్‌ మరో మూడేళ్లపాటు ఆ పదవిలో ఉండవచ్చు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌లో స్థిరపడిపోతారు కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో కాదు. నేను ఇక్కడ ఉండబోవడం లేదు కదా? ఆంధ్రప్రదేశ్‌ ఏమైతే నాకేంటి? నా పదవి నాకు ముఖ్యం అని ఆయన భావిస్తున్నారేమో తెలియదు! ఇప్పుడు ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ విషయానికి వద్దాం. స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఆయనకు లభించింది. మరో ఏడాదిలో ఆయన పదవీ విరమణ చేస్తారు. కనుక ఈ ఎన్నికల తర్వాత ఆయన చేసే పని కూడా ఏమీ ఉండదు. స్థానిక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందినవారు అరాచకంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను న్యూస్‌ చానెళ్లు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్నా రమేశ్‌కుమార్‌ కళ్లు మూసుకుని కూర్చుంటున్నారు. తాడిపత్రిలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా స్థానిక ఎమ్మెల్యే దుస్తులు పంపిణీ చేసినా క్రిమినల్‌ కేసు పెట్టకుండా ఆయనను ఒక రోజు ప్రచారానికి దూరంగా పెడుతున్నామని ప్రకటించడానికి ఎన్నికల కమిషన్‌ సిగ్గుపడటం లేదా? పంచాయతీ భవనాలకు వేయించిన వైసీపీ రంగులను పది రోజుల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించినా.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి? ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థులను కౌన్సెలింగ్‌ పేరిట ఒంగోలుకు తీసుకెళ్లిన పోలీసులు చితకబాది పంపడంపై చర్యలు తీసుకున్నారా? పోలీసుల సాక్షిగా దుడ్డుకర్రతో దాడి చేసిన వైసీపీ నేతకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి వదిలివేయడం ఏమిటని పోలీసులను సంజాయిషీ ఎందుకు కోరలేకపోతున్నారు? ఎన్నికలు అంటే ఇలా జరిపించాలని దేశ ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఒక భరోసా కల్పించిన ఒకప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ టి.ఎన్‌.శేషన్‌ను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నాం. ఇవ్వాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ వ్యవహార శైలి చూసినవారికి ఎన్నికల వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందా? పదవీ కాలం ముగిసిన తర్వాత రమేశ్‌ కుమార్‌ కూడా హైదరాబాద్‌లోనే స్థిరపడతారు.


ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు అంతరాత్మ ఉండదా? మీరు జీతాలు, ఇతరత్రా సౌకర్యాలు పొందుతున్నది ప్రజల సొమ్ముతోనే కదా? ముఖ్యమంత్రులు తమ జేబులో నుంచి ఇవ్వడం లేదు కదా? ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్న రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది అధికారుల ప్రవర్తన ఉన్న కారణంగానే హైకోర్టుకు పనిభారం పెరిగింది. ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్‌లో బాధితులకు ఉపశమనం కలిగించే ఏకైక వ్యవస్థగా ఉన్నత న్యాయస్థానం నిలబడింది. ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలపై గతంలో ఎన్నడూ లేని విధంగా లెక్కకు మించి ఫిర్యాదులు దాఖలు అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో హైకోర్టు కూడా ఆదుకోకపోతే దిక్కేమిటి? అని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. మామూలుగా అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్న ఉన్నత న్యాయస్థానం ఇప్పుడు ఎన్నికల కమిషనర్‌కు తన అధికారాలను గుర్తుచేయాల్సిన దుస్థితి. ఈ పరిస్థితి ఏర్పడినందుకు రమేశ్‌ కుమార్‌కు సిగ్గు అనిపించడం లేదా? ఉన్నత స్థాయికి చేరుకున్న అధికారులు చరిత్రలో నిలిచిపోవాలి గానీ, చరిత్రహీనులుగా మిగిలిపోకూడదు. తమకు పోటీ వస్తారనుకునే వారు టెండర్లు దాఖలు చేయకుండా గతంలో కొందరు కాంట్రాక్టర్లు అడ్డుకునేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అధికార పార్టీవారు అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని బాహాటంగా చెరబడుతున్న వారిపై అధికారాలు ఉండి కూడా చర్యలు తీసుకోని వ్యవస్థలు ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే! ఈ పోకడలకు అడ్డుకట్ట పడకపోతే ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలే రోజు ఎంతో దూరంలో లేనట్టే. పట్టపగలు నడిరోడ్డుపై హత్యలు చేసినా అడ్డుకునే దిక్కు ఉండదు. ఇవ్వాళ బాధితపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉండవచ్చు. రేపు ఆ స్థానంలో సామాన్య ప్రజలు ఉంటారు. ఇవ్వాళ రాజకీయ ప్రత్యర్థులను నామినేషన్లు వేయనివ్వడం లేదు. రేపు ఓటర్లను కూడా పోలింగ్‌ కేంద్రాలకు రానిస్తారన్న గ్యారంటీ ఏముంది? ఆంధ్రప్రదేశ్‌లో బిహార్‌ను చూస్తున్నాం అన్న వ్యాఖ్యలు రాష్ట్రానికి గర్వకారణమా? రాష్ట్ర ప్రజానీకం భయకంపితులై ఉన్నారు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్లు కూడా నోరు విప్పడానికి జంకుతున్నారు. భావితరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత అందరిదీ!


ఈ అరాచకం ఎందాకా?

బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న అధికారులు, వ్యవస్థల వ్యవహార శైలి ఇలా అఘోరిస్తే, అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు అడ్డు ఉంటుందా? జగన్మోహన్‌రెడ్డి మరో పాతిక, ముప్పై ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటారని వైసీపీ నాయకులు తరచుగా ప్రకటిస్తుంటారు. 30 సంవత్సరాలు ఏమి ఖర్మ.. జీవితాంతం జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే ప్రజల మన్ననలు పొంది ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే, ఉన్నత సంప్రదాయాలను నెలకొల్పితే చరిత్రలో నిలిచిపోతారు. అంతేగానీ, అధికార వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని.. ప్రతిపక్షాలకు చెందినవారిని చితకబాదుతూ కేసులలో ఇరికిస్తూ పురాణాలలో చెప్పిన రాక్షస పాలన సాగించడం వల్ల ఎంతకాలం అధికారంలో ఉంటే మాత్రం ప్రయోజనం ఏమి ఉంటుంది? వ్యవస్థలో మార్పు తీసుకురావడానికై జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వ్యవస్థలో లొసుగులను కడిగేయడం మంచిదే! అయితే జగన్‌ అండ్‌ కో చెబుతున్న మార్పు ఎటువంటిది అన్నదే ప్రశ్న! ఎన్నికలలో మద్యం, డబ్బు పంపిణీ జరగకూడదన్న సత్సంకల్పంతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని హోం మంత్రి సుచరిత చెప్పుకొచ్చారు. ఈ మాటలు అన్నప్పుడు ఆమెకు కూడా నవ్వు వచ్చింది. ప్రత్యర్థుల ఇళ్లల్లో అక్రమంగా మద్యం బాటిళ్లు పెట్టించి ఎదురు కేసులు పెట్టడమే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ లక్ష్యమా? ఈ ఎన్నికలలో ఇలాంటి దృశ్యాలే ఆవిష్కృతం అవుతాయని నేను పోయిన వారమే చెప్పాను. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగని వారిని కేసులలో ఇరికిస్తారని రుజువు అవుతోంది.


రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు సగం మొత్తాన్ని జీతభత్యాల కింద పొందుతున్న వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లో కనీసం పిడికెడు మందికి కూడా ఆత్మసాక్షి లేదా? అధికార పార్టీ మెప్పు కోసం అడ్డమైన పనులు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా? స్థానిక సంస్థలలో 90 శాతం గెలుచుకోవాలని ముఖ్యమంత్రి తన మంత్రులను ఆదేశించారు. 90 శాతం ఏమి ఖర్మ.. వంద శాతం కూడా గెలుచుకోవచ్చు. ప్రజల అభిమానం సంపాదించుకోవాలే గానీ, అడ్డదారిలో జిల్లా పరిషత్‌లు, మునిసిపాలిటీలు గెలుచుకుని ఏమి ప్రయోజనం? దౌర్జన్యకారులకే పదవులు కట్టబెట్టడం దేనికి సంకేతం? మీరు రెచ్చిపోండి.. ప్రత్యర్థులను చితకబాదండి.. పార్టీ నాయకత్వం మీకు అండగా ఉంటుంది.. పదవులు కట్టబెట్టి మిమ్మల్ని సత్కరిస్తాం అని ప్రకటించడం కాదా? రాజకీయ పార్టీలకు కనీస వెరపు ఉండాలి. వైసీపీ నాయకులలో ఈ వెరపు ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అందరిదీ ఒకే ధోరణి. ‘రాజ్యం వీరభోజ్యం’ అన్నట్టుగా ‘అధికారం వీరభోజ్యం’ అని భావిస్తూ కట్టుబాట్లను దాటి మరీ ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి. స్వాతంత్య్ర సమరయోధులు, అభ్యుదయ భావాలున్నవారు, జాతీయ స్థాయి కమ్యూనిస్టు నాయకులతో పరిఢవిల్లిన ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోవడం ఏమిటి? జగన్మోహన్‌రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారని మన రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరు. ఊహించి ఉంటే కట్టుబాట్లు పెట్టి ఉండేవారు.


ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న వారంతా మా పార్టీకే ఓటు వేస్తారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించుకున్నారు. సంతోషమే! మరి అంత నమ్మకం ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గంలో ప్రతిపక్షాలు నామినేషన్లు వేయకుండా మంత్రి అనుచరులు అడ్డుపడటం ఎందుకు? గతంలో చంద్రబాబు చేసినట్టుగా తాను ఫిరాయింపులను ప్రోత్సహించను అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శాసనసభ సాక్షిగా ప్రకటించినప్పుడు అందరూ శభాష్‌ అన్నారు. ఆచరణలో జరుగుతున్నది చూస్తుంటే ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ అని ఒక సినీ కవి అన్నట్టుగా జగన్మోహన్‌రెడ్డి మాటలకు కూడా అర్థాలు వేరులే అని చెప్పుకోవలసిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులపై సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి తనవైపు మళ్లించుకోవడాన్ని ఏమనాలి? గ్రామస్థాయి కార్యకర్తల నుంచి తలలు పండిన నాయకులను సైతం భయపెట్టి మందలో కలుపుకోవడం నీతివంతమైన రాజకీయం అని సర్దిచెప్పుకోవాలా? ఏ వ్యవస్థనూ లెక్కచేయకుండా, తాను అనుకున్న విధంగా పాలన సాగించడాన్ని నాగరిక ప్రభుత్వం అనాలా? ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిత్యం తప్పుబడుతున్నా దులుపుకొనిపోవడం మంచి ముఖ్యమంత్రినని అనిపించుకుంటానన్న జగన్మోహన్‌రెడ్డికే చెల్లుతుంది. రాజ్యసభలో అవసరాల కోసం జగన్‌కు తెరచాటు నుంచి సహకారం అందిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా ఇప్పుడు తత్వం బోధపడినట్టుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జట్టుగా పోటీ చేస్తున్న జనసేన–బీజేపీ అభ్యర్థులను కూడా అధికార పార్టీ కార్యకర్తలు పలుచోట్ల చితకబాదడాన్ని చూస్తున్నాం. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధుల గురించి తరచుగా సూక్తులు చెబుతూ వచ్చిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు కూడా గొంతు సవరించుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని ఆయనతోపాటు మరో ఇద్దరు ఎంపీలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్రం చూస్తూ ఊరుకోదనీ, కఠిన చర్యలు తీసుకుంటుందనీ జీవీఎల్‌ నరసింహారావు ప్రకటించారు. జగన్‌ ప్రభుత్వ సెగ తమకు కూడా తగలడంతో ఆయన ఇలా స్పందించి ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధి ఇప్పుడు ఆయనకు గుర్తుకురాలేదేమో? ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో లీలామాత్రంగా ఊహించాం గానీ.. మొత్తం వైసీపీ నాయకులంతా రౌడీలుగా ప్రవర్తిస్తారని అనుకోలేదు అని బీజేపీకి చెందిన ఒక ముఖ్యుడు కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు.


రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్నది ట్రైలర్‌ మాత్రమేననీ, అసలు సినిమా ముందు ఉంటుందనీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడో చెప్పారు. అసలు సినిమా ఎంత భయానకంగా ఉండబోతుందో ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరిస్తున్న విధానాన్ని మున్ముందు సాధారణ ఎన్నికలలో కూడా అనుసరించాలని కోరుకోరా? అందుకే కాబోలు 30 సంవత్సరాలపాటు అధికారం మాదే అని వైసీపీ నాయకులు విర్రవీగుతున్నారు. ‘కాకిలా కలకాలం ఉండే బదులు హంసలా ఆరు నెలలు బతికినా చాలు’ అని పెద్దలు అంటూ ఉంటారు. జనరంజక పాలన ఎంత కాలమైనా ప్రజలు స్వాగతిస్తారు. మద్దతిస్తారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎంతో కాలం పాలించలేరు. ఎంతో మంది నియంతలను చరిత్రలో చూశాం. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత స్థానిక సంస్థలన్నింటినీ అధికార పార్టీ తన ఖాతాలో వేసుకున్నా ప్రజల మద్దతుతోనే విజయం సాధించామని గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా? ‘‘దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం అవినీతి రాజకీయ నాయకులు కాదు.. వారిని ఎన్నుకున్న ప్రజలు సరిగా లేకపోవడమే’’ అని అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన లబ్ధప్రతిష్ఠ నేత జాన్‌ ఎఫ్‌.కెన్నడీ అన్న మాటలు ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితిని చూసినవారికి గుర్తుకు వస్తే తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపైనే ఉంది. రాజకీయాలలో నిప్పులా బతుకుతూ ఆదర్శప్రాయంగా ఉంటున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ నిందించగలిగారంటే ఏమనుకోవాలో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి!



ఆర్కే


యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scan చేయండి

Updated Date - 2020-03-15T06:10:48+05:30 IST