3 నెలల కోసం ఏడాది ఫీజు కట్టాలా..?

ABN , First Publish Date - 2021-03-01T08:35:10+05:30 IST

ఫీజుల పేరిట విద్యార్థులను వేధిస్తే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలను హెచ్చరించారు.

3 నెలల కోసం ఏడాది ఫీజు కట్టాలా..?

  • సీఎం మౌనం వెనుక లాలూచీ ఏంటి..?..
  • కార్పొరేట్‌ కాలేజీల్లో టీఆర్‌ఎస్‌ నేతలకు వాటాలు: సంజయ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజోతి): ఫీజుల పేరిట విద్యార్థులను వేధిస్తే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలను హెచ్చరించారు. 3 నెలల కోసం ఏడాది ఫీజు కట్టాల్సిందే అని ఒకవైపు విద్యార్థులను, మరోవైపు జీతాలు ఇవ్వకుండా సిబ్బందిని వేధిస్తున్నా ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం వెనుక లాలూచీ ఏంటని నిలదీశారు. చాలా మంది టీఆర్‌ఎస్‌ నేతలకు కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో వాటాలున్నాయని అన్నారు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేవైఎం కార్యకర్తల సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. ఫీజుల వేధింపులు ఆగకపోతే యువ మోర్చా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని సంజయ్‌ హెచ్చరించారు. కార్పొరేట్‌ కాలేజీల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు వసూళ్లకు పాల్పడుతూ వాళ్ల అరాచకాలకు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. సిబ్బందితో మీటింగ్‌ పెట్టుకుని వాళ్లను ఆదుకోవాలని విద్యాసంస్థలకు చెప్పినప్పటికీ స్పందించలేదని చెప్పారు. 


బాన్సువాడ బుడ్డోడితో సంజయ్‌ లంచ్‌

బాన్సువాడలో రెండు రోజుల కిందట జరిగిన బీజేపీ బహిరంగ సభలో పార్టీ ముఖ్యనేతల ప్రసంగాలకు అనుగుణంగా తన హావభావాలతో కేసీఆర్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తొమ్మిదేళ్ల బుడ్డోడు నర్సింహతో బండి సంజయ్‌ సెల్ఫీ దిగారు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆ బుడ్డోడితో కలిసి లంచ్‌ చేశారు. 2023లో బీజేపీ అధికారంలోకి రాగానే మొదటి డబుల్‌బెడ్‌ రూం ఇల్లు అతడికే ఇస్తామని ప్రకటించారు. అప్పటి వరకు కిరాయి ఇల్లు సమకూర్చాలని నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడికి సూచించారు. పసి పిల్లోడి నుంచి పండు ముసలి వరకు కేసీఆర్‌పై కోపంగా ఉన్నారనడానికి నర్సింహ ఉదాహరణ అని సంజయ్‌ చెప్పారు. తాము 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామంటూ కేటీఆర్‌ చేసిన ప్రకటనపై ఆర్ట్స్‌ కాలేజీ వద్ద చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు సవాల్‌ చేశారు. సోమవారం ఉదయం కేటీఆర్‌ చర్చకు రాకపోతే, ఆయన తప్పుడు ప్రకటన చేసినట్లుగా అంగీకరించినట్లేనని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా గొర్రెల పంపిణీ జరిగితే, మటన్‌ ధర ఎందుకు పెరుగుతుందో సమాధానం చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రశ్నించారు. 65 లక్షల గొర్రెలు మాయమైనట్లు తెలుస్తోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదివారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు. 


వామన్‌రావు దంపతుల హత్య వెనుక టీఆర్‌ఎస్‌ పెద్దలు 

హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య వెనుక టీఆర్‌ఎ్‌సకు చెందిన బడా నేతలు, కొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుంటే హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ కోరాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన పార్టీ లీగల్‌సెల్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ దారుణ ఘటనను ఒకరిద్దరికి మాత్రం పరిమితం చేసే కుట్ర జరుగుతోందని.. మొత్తం వ్యవస్థపైనే విచారణ జరపాలని కోరారు. వామన్‌రావు తల్లిదండ్రులను గవర్నర్‌ వద్దకు తీసుకువెళ్లి వివరాలు నివేదించాలని, సంతకాల సేకరణ చేపట్టాలని సూచించారు.

Updated Date - 2021-03-01T08:35:10+05:30 IST