విద్యావిధానాలపై టీచర్లు మాట్లాడకూడదా?!

Published: Sat, 06 Aug 2022 11:49:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విద్యావిధానాలపై టీచర్లు మాట్లాడకూడదా?!

ప్రభుత్వం ఉపాధ్యాయ వృత్తికి, ఇతర వృత్తులకు మధ్య వ్యత్యాసాన్ని గ్రహించకపోవడంతో అసలు సమస్య వస్తోంది. విద్య వ్యాపారం కావడంతో, విద్య సృజనాత్మకమైన ప్రక్రియ అనే భావనే తుడిచిపెట్టుకుపోయింది. కార్పొరేటు వారు మార్కుల, ర్యాంకుల కొలతలు సృష్టిస్తే వాటి వెంట ప్రభుత్వం పడింది. ఇప్పుడు విద్య ఒక సృజనాత్మక ప్రక్రియ అని ప్రభుత్వం ఎంత మాత్రం భావించడం లేదు. అందుకే ప్రభుత్వం ఉపాధ్యాయుని కృషిని పని గంటలలో కొలుస్తున్నది.


ఉపాధ్యాయులు(Teachers) ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడకూడదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Education Minister Botsa Satyanarayana) చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం పాఠశాల విద్యను విధ్వంసం చేస్తుంటే ఉపాధ్యాయులు చేతులు ముడుచుకుని కూర్చోవాలా? ప్రభుత్వం 84, 85, 117 జీఓలు తీసుకువచ్చి ప్రాథమిక విద్యను, ప్రాథమికోన్నత విద్యను బాలబాలికలకు దూరం చేస్తుంటే, ఉన్నత పాఠశాలలలో ప్రధానోపాధ్యాయ, పి.ఇ.టి పోస్టులను రద్దు చేస్తుంటే, తరగతి గదిలో విద్యార్థుల గరిష్ట పరిమితిని, ఒక వారంలో ఉపాధ్యాయులు బోధించవలసిన పీరియడ్ల గరిష్ట పరిమితిని పెంచి విద్యా ప్రమాణాలకు గండి కొడుతుంటే, సమాంతర మాధ్యమాలను, తెలుగు–ఉర్దూ మాధ్యమాలను రద్దుచేస్తుంటే, ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఎగనామం పెడుతుంటే ఉపాధ్యాయులు నోరు కట్టుకుని ఉండాలా? పాఠశాలల గురించి, బాలబాలికల గురించి ఉపాధ్యాయులు ఆలోచించడం, మాట్లాడడం నేరమా? ఉపాధ్యాయ వృత్తికి, ఇతర వృత్తులకు మధ్య వ్యత్యాసం ప్రభుత్వ అవగాహనలో లేదా? నిజానికిది చాలా తీవ్రమైన విషయం. ఇది ఉపాధ్యాయుల విషయం మాత్రమే కాదు. పౌర సమాజంలో దీనిపై విస్తృతమైన చర్చ జరగాలి.


ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులని, విద్యావిధానాల గురించి మాట్లాడకూడదని మంత్రి అన్నారు. సరే, ఈ విషయమై కొఠారీ కమిషన్ చెప్పిన మాటలు ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. ‘బోధన ఒక సృజనాత్మకమైన ప్రక్రియ అని, దానిని ఇతర వృత్తులతో సమానంగా చూడకూడదని’ కొఠారీ కమిషన్‌ పేర్కొంది. అంతేకాకుండా పేరా 3.34లో ఇతర ఉద్యోగులతో సమానమైన కాండక్ట్‌ రూల్సు ఉపాధ్యాయులకు నిర్దేశించడం తగదని, ఉపాధ్యాయులు సాధారణ ఉద్యోగులు కారని చెప్పింది. పరతంత్ర కాలంలో విదేశీ పాలకులు ఉపాధ్యాయుల రాజకీయ భావాలను నియంత్రించడం కోసం ఈ కాండక్ట్‌ నిబంధనలు ప్రవేశపెట్టారని అవి ఎంత మాత్రమూ కొనసాగించదగ్గవి కావని కమిషన్‌ స్పష్టం చేసింది. ‘సామాజిక విషయాలలో, ప్రజా జీవితంలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం చాలా అభిలషణీయమైనది... అది దేశ సామాజిక, రాజకీయ జీవితాన్ని ఎంతో సంపద్వంతం చేయగలదని’ చెప్పింది. అంటే కమిషన్‌ విద్యావిధానాల మీదే కాదు సామాజిక, రాజకీయ విషయాలన్నింటి మీద ఉపాధ్యాయులు చొరవ చూపించాలని, వారి పౌరహక్కులు విస్తృతమైనవని పేర్కొంది. అంటే ప్రభుత్వ విధానాలను విశ్లేషించడం, వ్యాఖ్యానం చేయడం వారి హక్కు మాత్రమే కాదు, అది వారి వృత్తిలో భాగమని కొఠారీ కమిషన్‌ భావించింది.


ప్రభుత్వ విధానాల మీద మాట్లాడడమే కాదు, అసలు ఉపాధ్యాయులకు రాజకీయాలలో నేరుగా పాల్గొనే అవకాశం ఉండాలని కమిషన్‌ భావించింది. ‘ఉపాధ్యాయులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం పట్ల గాని లేదా స్థానిక స్థాయి నుంచి అఖిలభారత స్థాయి వరకు ఏ బాధ్యతనైనా చేపట్టడానికిగాని ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని, అందుకొరకు వారికి తాత్కాలికంగా ఉపాధ్యాయ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడానికి (పదవీ విరమణ కాదు) అవకాశం ఉండాలని పేర్కొంది. ఉపాధ్యాయులు విద్యా విధానాల మీద మాత్రమే కాదు, అన్ని ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విషయాల మీద మాట్లాడవచ్చని, అసలు ఉపాధ్యాయ వృత్తికి, దేశ సర్వతోముఖాభివృద్థికి అది అవసరమని కమిషన్‌ భావించింది.


1990లో వచ్చిన ఆచార్య రామ్మూర్తి కమిటీ నివేదిక ఉపాధ్యాయుడు విద్యా వ్యవస్థ రంగస్థలం మధ్య భాగాన ఉండాలని ప్రకటించింది. ఉపాధ్యాయులు విద్యావిధానాల గురించి మాట్లాడకూడదని మంత్రులు అనడం కాని, తాము తమ జీతనాతాల విషయాలు తప్ప ఇతర విషయాలు మాట్లాడకూడదని ఉపాధ్యాయులు అనుకోవడం కాని ఎంత మాత్రం అభిలషనీయం కాదు. విద్యావిధానం మీద మాట్లాడే హక్కును నేడు విడిచిపెట్టుకుంటే, రేపు జీతనాతాల మీద మాట్లాడే హక్కును కూడా ఉపాధ్యాయులు కోల్పోతారు. రాష్ట్రంలో తమ వృత్తి నిబద్ధత ద్వారా, సంఘటిత పోరాటాల ద్వారా తమ హక్కులను కాపాడుకోవలసిన, విద్యారంగాన్ని పరిరక్షించవలసిన చారిత్రక బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది.


ఉపాధ్యాయులు 8 గంటలు పనిచేయాలని మంత్రి అన్నారు. కొఠారీ కమిషన్‌ నివేదిక ఉపాధ్యాయుల పనిగంటల గురించి ప్రస్తావించింది. పేరా 3.33లో ‘ఉపాధ్యాయుల పనిగంటలు కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పని గంటల వలెనే ఉండాలి’ అని చెప్పింది. ప్రస్తుతం అలాగే ఉంది. ప్రభుత్వ కార్యాలయాలలో, అలాగే పాఠశాలలలో దినానికి 7 పని గంటలే. అయితే కొఠారీ కమిషన్‌ ‘ఉపాధ్యాయుల పని గంటలు గణించేటప్పుడు తరగతులకు అకడమిక్‌గా సిద్ధం కావడం, విద్యార్థుల నోట్సులు దిద్దడం, పరీక్షలు పెట్టి విద్యార్థులను మూల్యాంకనం చేయడం, వెనుకబడిన వారికి ట్యుటోరియల్స్‌ నిర్వహించడం, సెమినార్స్‌ నిర్వహించడం, విద్యార్థులకు కౌన్సెలింగు ఇవ్వడం, ఇంకా పాఠ్య ప్రణాళిక, ప్రణాళికేతర కార్యక్రమాలు నిర్వహించడం గమనంలోకి తీసుకోవాలని’ పేర్కొంది. అనేక మంది ఉపాధ్యాయులు ఇందులో చాలా వరకు చేస్తున్నారు కూడా. ఈ పనులు చేయని ఉపాధ్యాయులను అవి చేసేట్లు ఎలా ఉత్సాహపరచాలి అనే విషయం చూడాలి. అంతేకాని, జీఓ 117లో వలే ఉన్నత పాఠశాలలలో మొత్తం పీరియడ్లను బోధనా పీరియడ్లుగా నిర్దేశించడం ఏవిధంగా సబబు అవుతుంది? అదలా ఉంటే, ప్రభుత్వం ఉపాధ్యాయ వృత్తికి, ఇతర వృత్తులకు మధ్య వ్యత్యాసాన్ని గ్రహించకపోవడంతో అసలు సమస్య వస్తోంది. విద్య వ్యాపారం కావడంతో, విద్య సృజనాత్మకమైన ప్రక్రియ అనే భావనే తుడిచిపెట్టుకుపోయింది. విద్య కొలవదగ్గదిగా, తారతమ్యం చూడదగ్గదిగా, ప్యాకేజీ చేసి ప్రచారం చేసుకోదగ్గదిగా మారిపోయింది. కార్పొరేటు వారు మార్కుల, ర్యాంకుల కొలతలు సృష్టిస్తే వాటి వెంట ప్రభుత్వం పడింది. ఇప్పుడు విద్య ఒక సృజనాత్మక ప్రక్రియ అని ప్రభుత్వం ఎంత మాత్రం భావించడం లేదు. అందుకే ప్రభుత్వం ఉపాధ్యాయుని కృషిని పని గంటలలో కొలుస్తున్నది. ఉపాధ్యాయులను ఉత్తేజపరచడానికి బదులు వారిని వేధించడం పెరిగింది. ఉపాధ్యాయులు తమ పని సృజనాత్మకమైనదని, తమ వృత్తి విశిష్టమైనదని మరిచిపోతున్నారు. ఇప్పుడు మన సమాజం ఎదుర్కొంటున్న సంకటం ఇదే.


ఉపాధ్యాయులు తమ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు పంపడం లేదని మంత్రి అంటే రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు తమ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు పంపడం లేదని కొద్దిమంది ఉపాధ్యాయులు ఎదురు ప్రశ్నవేశారు. అది మంత్రిగారికి తగిన సమాధానమే కావచ్చు, కాని ఈ ఎదురు ప్రశ్న వలన రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం? మీరూ పంపలేదు, మేమూ పంపలేదు అనడానికి బదులు మీరు పంపండి, మేమూ పంపుతాం అనవచ్చు. ఇంకా అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రకారం ‘ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిన వారంతా ప్రభుత్వ పాఠశాలలకే తమ బాలబాలికలను పంపాలని చట్టం చేయండి’ అని ఉపాధ్యాయులు ఉద్యమిస్తే విద్యారంగానికి విముక్తి లభిస్తుంది.


ఇదిలా ఉండగా ‘ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తాం, ప్రైవేటు విద్యను నియంత్రిస్తాం’ అని ప్రకటించిన ఈ ప్రభుత్వం ప్రైవేటును ప్రోత్సహిస్తూ, ప్రభుత్వరంగాన్ని విధ్వంసం చేయడమే రాష్ట్రంలో ప్రస్తుత అలజడికి కారణం. దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థలను ఎటువంటి పైలెట్‌ ప్రాజెక్ట్‌ కూడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వ విద్యలో గందరగోళం సృష్టిస్తున్నది. అటు ప్రైవేటు పాఠశాలలపై నియంత్రణ పూర్తిగా శూన్యం. ప్రభుత్వ రంగంలో ఈ సంవత్సరం చేపట్టిన దుందుడుకు చర్యల వల్ల లక్షల సంఖ్యలో బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ బాలల తల్లిదండ్రులు పిల్లల ఫీజులకు అలవికాని వడ్డీలతో అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఈ ‘సంస్కరణల’ జీవోలను వెంటనే రద్దుచేయడం ఉత్తమం. అలాగే, సుమారు 25వేల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీచేయడానికి డి.యస్‌.సి వేసి, ప్రభుత్వ పాఠశాల విద్య అభివృద్థికి ఒక సమగ్రమైన పథక రచనకు విశాలమైన చర్చ నిర్వహించాలి.


-రమేష్‌ పట్నాయక్‌

కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ విద్యాపరిరక్షణ కమిటీ

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.