గురువులపై కత్తి

ABN , First Publish Date - 2022-07-23T05:29:50+05:30 IST

ఉపాధ్యాయులపై వైసీపీ సర్కారు కత్తి కట్టింది. సీపీఎస్‌ రద్దుతో పాటు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గత కొద్దినెలలుగా ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా పూటకో జీవోతో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. తాజాగా విద్యార్థుల హాజరు నమోదు ప్రక్రియ చేపట్టలేదంటూ 139 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యేనని

గురువులపై కత్తి

పార్వతీపురం-ఆంధ్రజ్యోతి, జూలై 21: ఉపాధ్యాయులపై వైసీపీ సర్కారు కత్తి కట్టింది.  సీపీఎస్‌ రద్దుతో పాటు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గత కొద్దినెలలుగా ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా పూటకో జీవోతో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. తాజాగా విద్యార్థుల హాజరు నమోదు ప్రక్రియ చేపట్టలేదంటూ 139 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యేనని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ప్రతిరోజూ 10.30 గంటల్లోగా యాప్‌లో నమోదుచేయాలి. విధిగా పంపించాలన్న ఆదేశాలున్నాయి. అయితే శుక్రవారం నుంచి 2 నుంచి పదో తరగతి విద్యార్థులకు సామర్ధ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. వాటి నిర్వహణలో ఉపాధ్యాయులు తలమునకలై ఉన్నారు. దీంతో యాప్‌లో విద్యార్థుల హాజరు నమోదు ప్రక్రియ ఆలస్యమైంది. దీనిని తప్పిదంగా భావించిన విద్యాశాఖ సంబంధిత ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కొన్ని పాఠశాలల్లో సామర్థ్య పరీక్షలతో నమోదు ఆలస్యంకాగా.. ఏజెన్సీలోని సిగ్నల్‌ అందక మరికొన్ని పాఠశాలల్లో ఆలస్యమైంది. కానీ ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నోటీసులు జారీచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నారు. 


ఇతరత్రా పనులతో సతమతం

- ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ మొదటి పీరియడ్‌లోనే హాజరు ప్రక్రియ పూర్తి చేసి మధ్యాహ్న భోజనానికి సంబంధించి వివరాలను ఫైనలైజ్‌ చేసుకుంటుంటారు. అంతేకాకుండా మరుగుదొడ్ల ఫొటోలు తీయడం, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వివరాలను యాప్‌లలో నమోదు చేయడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. వీటితోనే వారు సతమతమవుతున్నారు. శుక్రవారం బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహణ ఉండడంతో యాప్‌లో అటెండెన్స్‌ వేయలేకపోయారు. 


- ఇప్పటికే ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫొటోలు తీసి వాటిని అప్‌లోడ్‌ చేసేందుకు సొంతమొబైల్స్‌నే వినియోగించాలి. కొన్నిచోట్ల నెట్‌వర్క్‌ సమస్య వల్ల అప్‌లోడ్‌ చేసేందుకు వీలుకుదరట్లేదు. ఫోన్‌ మరమ్మతులకు గురవ్వడం.. కెమెరా పనిచేయకపోవడం వంటి సమస్యలతో మరింత ఇబ్బందిగా ఉంటోంది. నిత్యం బోధనేతర సమస్యలతో సతమతమువుతున్నట్లు టీచర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తమను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాపూ కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తే సహించేదిలేదని స్పష్టం చేస్తున్నారు. 



నమోదు తప్పనిసరి

ఆన్‌లైన్‌లో విద్యార్థుల హాజరును పక్కాగా నమోదుచేయాలి. ఉదయం 10.30 గంటల్లోగా ప్రక్రియ పూర్తిచేయాలి. దీనిపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. జిల్లాలో సరిగ్గా వివరాలు నమోదుచేయని 139 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిఒక్కరూ విధులు నిర్వర్తించాలి. లేకుంటే చర్యలు తప్పవు.

-బ్రహ్మాజీరావు, ఇన్‌చార్జి డీఈవో, పార్వతీపురం మన్యం జిల్లా


ఇది సమంజసం కాదు

ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష కట్టింది. విద్యార్థుల హాజరు రోజూ చేస్తున్న పనే. అయితే పలానా సమయంలోపు చేయాలనడం సమంజసం కాదు. ఒక్కోసారి నెట్‌వర్క్‌ లేకపోవడం వల్ల, సర్వర్‌లోపం వల్ల హాజరు నమోదుకావడం లేదు. ఉపాధ్యాయులకు నోటీసులు ఇవ్వడం సమంజసం కాదు. దీనిపై పోరాడుతాం. 

- మురళీమోహనరావు, యూటీఎఫ్‌ నాయకుడు


దారుణం

ఉపాధ్యాయులకు నోటీసులు జారీచేయడం దారుణం.  ఉపాధ్యాయులపై కక్షసాధింపు ధోరణి మానుకోవాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు లేకుండా చేస్తామని ఉన్నతాధికారులు పలుమార్లు చెప్పారు. కానీ అమలు చేయడంలేదు. ఎలాంటి డివైజ్‌లు ఇవ్వకుండా అప్‌లోడ్‌ చేయమంటే ఎలా? ఇటువంటి చర్యలు మానుకోవాలి. 

కె.విజయ్‌కుమార్‌, ఉపాధ్యాయసంఘ నాయకుడు

Updated Date - 2022-07-23T05:29:50+05:30 IST