కుంగుతున్న మున్సిపల్‌ భవనం

ABN , First Publish Date - 2021-03-07T03:43:24+05:30 IST

మందమర్రి మున్సిపల్‌ కార్యాలయ భవనం కుంగుతోంది.

కుంగుతున్న మున్సిపల్‌ భవనం
మున్సిపల్‌ కార్యాలయంలో కుంగిన సిబ్బంది కూర్చుండే గది

- రాలిపడుతున్న పైపెచ్చులు - భయం భయంగా ఉద్యోగుల విధులు

మందమర్రిటౌన్‌, మార్చి 6:  మందమర్రి మున్సిపల్‌ కార్యాలయ భవనం కుంగుతోంది. కార్యాలయంలోని ఆయా గదుల పైకప్పు పెచ్చులు ఊడి కిందపడుతున్నాయి. మూడు రోజుల క్రితం నేల కృంగడంతో గదుల్లోని బీరువాలు కిందపడి కంప్యూటర్‌, ఇతర సామగ్రి దెబ్బతిన్నాయి. గోడలకు పగుళ్లు తేలి పైపెచ్చులు ఊడిపడుతున్నాయి. దీంతో ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు.  సుమారు 8 గుంటల స్థలంలో 2003లో భవనాన్ని నిర్మించారు.  నూతన భవన నిర్మాణం చేపట్టాలని పలువురు కోరుతున్నారు.   మందమర్రి మున్సిపాలిటీకి పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేకాధికారిగా మంచిర్యాల ఆర్డీవో వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులు కార్యాలయంలో విధులు నిర్వహించమని ఇప్పటికే కమిషనర్‌కు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది.  

నూతన భవన నిర్మాణం చేపట్టాలి

 - మందమర్రి మున్సిపల్‌ కమీషనర్‌ రాజు 

మున్సిపల్‌ కార్యాలయం భవన నిర్మాణం చేపట్టిన ప్రదేశంలో భూమి కృంగిపోతుండడంతో గదుల్లో పగుళ్లు తేలి పైపెచ్చులు రాలిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు పని చేస్తుండగానే పెచ్చులు ఊడిన సందర్భాలున్నాయి. మూడు రోజుల క్రితం బీరువాలు కింద పడడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని పై అధికారులకు విన్నవిస్తాం. నూతన భవనం నిర్మాణం చేపట్టడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. 

Updated Date - 2021-03-07T03:43:24+05:30 IST