కుంగుతున్న చెరువు కట్టలు

ABN , First Publish Date - 2021-11-30T06:55:25+05:30 IST

భారీ వర్షాలకు జిల్లాలోని జలాశయాలు, చెరువులు నిండిపోయి ప్రమాదకరంగా మారాయి.

కుంగుతున్న చెరువు కట్టలు
కుంగిన పాకాల పెద్దచెరువు కట్ట

మరమ్మతులు చేయడానికి ముందుకురాని కాంట్రాక్టర్లు


చిత్తూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు జిల్లాలోని జలాశయాలు, చెరువులు నిండిపోయి ప్రమాదకరంగా మారాయి. సుమారు 7,600 చెరువులుండగా.. వీటిలో 3700 పూర్తిస్థాయిలో నిండిపోయాయి. మరో 1,500 చెరువులు దాదాపుగా నిండాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి జలాశయాలు, చెరువుల నిర్వహణను పట్టించుకోలేదు. దీంతో ఇప్పటివరకు 624 చెరువులకు గండ్లు పడ్డాయి. మరికొన్ని చెరువుల కట్టలు కుంగుతున్నాయి. రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువుకు గండి పడడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు జిల్లాలో ప్రమాదకరంగా మారిన చెరువులపై దృష్టి సారిస్తున్నారు. ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, కలెక్టర్‌ హరినారాయణన్‌తోపాటు జాయింట్‌ కలెక్టర్లు, మండల స్థాయి అధికారులంతా జలాశయాలను, చెరువులను తనిఖీలు చేస్తున్నారు. కొందరు స్థానిక సిబ్బందిని జలాశయాల వద్దే కాపలా ఉంచుతున్నారు. ఇదిలా ఉండగా.. చెరువుల గండ్లు పూడ్చేందుకు, కట్టలను పటిష్ఠం చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలిసింది.


బిల్లులు రాకపోవడమే కారణమా?

చెరువులను తాత్కాలికంగా మరమ్మతులు చేయడానికి రూ.10 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.240 కోట్లు అవసరమని జలవనరులశాఖ అధికారులు అంచనా వేశారు. జలవనరుల శాఖలో నిధులు లేకపోవడం.. ఇప్పటికే ప్రభుత్వ పనులు చేసిన కొందరికి బిల్లులు రాకపోవడంతో గండ్లు పడిన చెరువులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జలవనరులను పటిష్ఠం చేయడానికి నీరు-చెట్టు పథకం కింద పనులు జరిగాయి. వీటికి సంబంధించి జిల్లాలోని కాంట్రాక్టర్లకు రూ.190 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. టీడీపీ హయాంలో పనులు చేశారన్న ఏకైక కారణంతో ఆ బిల్లుల్ని వైసీపీ ప్రభుత్వం విడుదల చేయలేదని టీడీపీ ఆరోపించిన విషయం, కాంట్రాక్టర్లు నిరసనలు చేసిన విషయం తెలిసిందే.


కట్టలు కుంగుతున్నా.. పట్టించుకునేవారేరీ..?

పాకాల పెద్దచెరువు కట్ట నెల కిందట నుంచి కుంగిపోతూనే ఉంది. అధికారులు చెరువు మొరవ తెగ్గొట్టి పెద్దఎత్తున నీళ్లు బయటికి వెళ్లేలా చేసి చేతులు దులుపుకున్నారు. కుంగిపోయినచోట ఎలాంటి మరమ్మతులు చేయలేదు. అలాగే మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీ కొండమీద తండా చెరువు కట్ట కుంగింది. గుర్రంకొండ మండలం సమీపంలోని చిన్నరాయలచెరువు కట్టకు రెండుచోట్ల గండ్లు పడ్డాయి. దీంతో చెరువు కింద ఉన్న దౌలత్‌ఖాన్‌పల్లె ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా.. చిన్నగొట్టిగల్లు చెరువు కట్టకు అధికారులు సోమవారం మరమ్మతులు చేశారు.

Updated Date - 2021-11-30T06:55:25+05:30 IST