వారెవా.. అనికా

ABN , First Publish Date - 2022-05-19T10:16:10+05:30 IST

తమిళనాడు షట్లర్‌ జెర్లిన్‌ అనికా అరుదైన ఘనతను సాధించింది. బ్రెజిల్‌లో జరిగిన బధిరుల ఒలింపిక్స్‌లో గతంలో భారత్‌నుంచి ఏ ప్లేయరూ సాధించని విధంగా..

వారెవా..  అనికా

బధిరుల ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలు

న్యూఢిల్లీ: తమిళనాడు షట్లర్‌ జెర్లిన్‌ అనికా అరుదైన ఘనతను సాధించింది. బ్రెజిల్‌లో జరిగిన బధిరుల ఒలింపిక్స్‌లో గతంలో భారత్‌నుంచి ఏ ప్లేయరూ సాధించని విధంగా.. ఏకంగా మూడు స్వర్ణాలను కొల్లగొట్టింది. మహిళల సింగిల్స్‌తోపాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో అనికా బంగారు పతకాలను సాధించగా.. డబుల్స్‌ ఫైనల్లో మాత్రం పరాజయాన్ని చవిచూసింది. సింగిల్స్‌ తుది పోరులో న్యూడోల్ట్‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గిన అనికా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అభినవ్‌ శర్మతో కలసి మలేసియా జంటను ఓడించింది. ఇక మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో జపాన్‌పై 3-1తో నెగ్గడంలో జెర్లిన్‌ కీలకపాత్ర పోషించింది. 


తండ్రి ప్రోత్సాహంతోనే...

మధురైకి చెందిన అనికా.. ఎనిమిదేళ్ల వయసు నుంచి బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందుతోంది. జెర్లిన్‌కు వినపడదు, మాట్లాడలేదు. ఆమె తండ్రి జయ రచగన్‌ తన మిత్రులతో కలసి ఆడేందుకు వెళ్తూ అనికాను కూడా వెంట తీసుకెళ్లేవాడు. అక్కడ ఆటలపట్ల ఆమె ఆసక్తిని గమనించి బ్యాడ్మింటన్‌ ఆడమని ప్రోత్సహించాడు. కానీ, రచగన్‌ చిరు వ్యాపారి కావడంతో ఆమెకు సరైన సౌకర్యాలు కల్పించడం కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా, బధిరుల ఒలింపిక్స్‌ గురించి ఎవరో చెప్పడంతో తెలుసుకున్న రచగన్‌.. ఆ దిశగా ప్రోత్సహించడంతో ఆమె జీవితం మారిపోయింది. 2017లో టర్కీలో జరిగిన బధిరుల ఒలింపిక్స్‌లో రెండు రజతాలు, కాంస్యంతో మెరిసింది. ఆమె ప్రతిభను గుర్తించిన హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సహాయం చేయడానికి ముందు వచ్చింది. దీంతో అనికా అంచెలంచెలుగా ఎదిగి.. నేడు దేశం గర్వించదగ్గ స్థాయికి చేరింది. 

Updated Date - 2022-05-19T10:16:10+05:30 IST