భర్తపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. ఆమెతో పరిచయం పెంచుకుని.. చివరకు..

ABN , First Publish Date - 2020-07-03T15:59:03+05:30 IST

సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ ఎస్‌ఐగా పనిచేస్తున్న..

భర్తపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. ఆమెతో పరిచయం పెంచుకుని.. చివరకు..

ఎస్‌ఐ నుంచి ప్రాణహాని ఉంది..

పెళ్లిచేసుకుని, బిడ్డను కని.. ఆ తర్వాత మోసం చేశాడు..

పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు


నరసరావుపేట(గుంటూరు): సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ ఎస్‌ఐగా పనిచేస్తున్న జగదీష్‌ నుంచి తనకు, తన బిడ్డకు ప్రాణహాని ఉందని మండలంలోని రావిపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ స్థానిక రూరల్‌ పోలీసుస్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 2013లో తనకు, తన భర్తకు మనస్పర్థలు రావటంతో స్థానిక రూరల్‌ పోలీస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా అక్కడి ఎస్‌ఐ జగదీష్‌ తనకు న్యాయం చేస్తానంటూ నమ్మబలికి తన ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడని తెలిపింది. ఇంటికి పిలిపించుకొని తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడని తెలిపింది.


నరసరావుపేట పట్టణంలో ఇల్లు అద్దెకు తీసుకొని తనను వివాహం చేసుకున్నాడని, ఓ బిడ్డకు జన్మనిచ్చామని తెలిపింది. కొంత కాలంగా తనను నిర్లక్ష్యం చేస్తూ తనతో గొడవ పడుతున్నాడని, తనతో పెళ్ళి చేసుకొనే నాటికే జగదీష్‌కు వివాహం అయిందని, ఆ విషయం ఆలస్యంగా తెలిసిందని తెలిపింది. రూ.25 లక్షలు తీసుకొని తనను వదిలేసి వెళ్లిపోవాలని, లేని పక్షంలో తనను, తన బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపింది. స్థానిక రూరల్‌ పోలీసు స్టేషన్‌లో తనకు, తన బిడ్డకు న్యాయం జరిగేలా చూడాలి పోలీసులు ఆమె కోరింది. 


తన మాజీ భార్యకు, ఎస్‌ఐ జగదీష్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆ మహిళ మొదటి భర్త సుబ్బారావు విలేకర్లకు తెలిపారు. తామిద్దరం 2017లో విడాకులు తీసుకున్నామని, ఆమె వద్ద ఉన్న బాబు తనకు పుట్టిన అబ్బాయని తెలిపాడు. కేవలం డబ్బు కోసమే ఎస్‌ఐ జగదీష్‌ను బ్లాక్‌మెయిల్‌ చేయటానికి అసత్యపు ఆరోపణలు చేస్తుందని ఆరోపించాడు.   


మహిళను ప్రేమ పేరుతో మోసం చేసిన ముప్పాళ్ళ ఎస్‌ఐ జగదీష్‌పై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-07-03T15:59:03+05:30 IST