Leader of Opposition Siddaramaiah: నియోజకవర్గం ఎంపికపై సిద్దూ సందిగ్ధం

ABN , First Publish Date - 2022-08-09T18:43:01+05:30 IST

రాష్ట్ర కాంగ్రెస్‏లో కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Siddaramaiah)కు రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు

Leader of Opposition Siddaramaiah: నియోజకవర్గం ఎంపికపై సిద్దూ సందిగ్ధం

                                  - కొత్త స్థానం కోసం పరిశీలన


బెంగళూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కాంగ్రెస్‏లో కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత సిద్దరామయ్య(Siddaramaiah)కు రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు నియోజకవర్గమే కరువైంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఆయనకే మెండుగా ఉన్నాయి. కానీ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే విషయంలో సందిగ్ధంలో పడ్డారు. మైసూరు(Mysore) జిల్లాలో జన్మించిన సిద్దరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి వరుణ నియోజకవర్గానికి వెళ్లి తిరిగి 2013లో సొంత నియోజకవర్గమైన చాముండేశ్వరి నుంచి గెలుపొందారు. ఇదే కాలంలోనే ముఖ్యమంత్రిగా వ్యవహరించా రు. 2018 ఎన్నికల్లో చాముండేశ్వరితోపాటు బాగల్కోటె జిల్లా బాదామి ని యోజకవర్గంలోనూ పోటీ చేశారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో జేడీఎస్‌ అభ్యర్థి జీటీ దేవేగౌడ చేతిలో ఓటమి చెందారు. బాదామి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన రాజకీయం సజావుగా కొనసాగింది. 1983 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో పలు కారణాలతో వరుణ నియోజకవర్గానికి వెళ్లారు. 2013లో తిరిగి చాముండేశ్వరికే వచ్చారు. 2018లో వరుణ నుంచి కుమారుడు యతీంద్ర పోటీ చేసి గెలుపొందగా, చాముండేశ్వరిలో సిద్దూ ఓటమి చెందారు. బాదామి నుంచి మరోసారి పోటీ చేసే ఆలోచనను ఆయన విరమించుకున్నారు. దీంతో కొత్త నియోజకవర్గం ఎక్కడ ఎంపిక చేసుకోవాలనేది గందరగోళంగా మారుతోంది. సిద్దరామయ్య కోసం పార్టీకి చెందిన పలువురు సీనియర్లు సైతం నియోజకవర్గాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సొంత సామాజికవర్గంలో కురుబలు అత్యధికంగాను, వరుసగా కాంగ్రెస్‏కు విజయం సాధ్యమవుతున్న నియోజకవర్గాలపైనే ఆయన దృష్టి సారిస్తున్నారు. బెంగళూరు నగరంలో చామరాజపేట నుంచి పోటీ చేయాలని ఆయనకు అత్యంత ఆప్తుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ కోరుతున్నారు. ఇదే విషయాన్ని జమీర్‌ అహ్మద్‌ పలు సందర్భాలలో ప్రస్తావించారు. అక్కడ పోటీకి సుముఖత చూపారు. తరచూ నియోజకవర్గంలో పర్యటించారు. కానీ అక్కడ ఈద్గా మైదానం విషయం వివాదమైంది. ప్రభుత్వ స్థలమైనా వక్ఫ్‌బోర్డు చెందినదిగా ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేపై స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రభావం సిద్దరామయ్యపైనా తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కోలారు జిల్లాకు రావాలని స్థానిక నేతలు కోరుతున్నారు. అక్కడి సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కేహెచ్‌ మునియప్ప వ్యతిరేకిస్తున్నారు. ఏడుసార్లు ఎంపీగా కొనసాగి కేంద్ర కేబినెట్‌లో వివిధశాఖల మంత్రిగా వ్యవహరించిన మునియప్పకు వ్యతిరేక వర్గం పోరు తీవ్రమైంది. సిద్దరామయ్య అదే జిల్లాకు వెళ్తే ప్రత్యర్థ పార్టీలతోపాటు మునియప్ప నుంచి కూడా వ్యతిరేకత వస్తుందనే భయం వెంటాడుతోంది. ముఖ్యమంత్రి పదవికోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ తీవ్రస్థాయిలో పోటీలో ఉన్నారు. వీరిలో డీకే శివకుమార్‌(DK Sivakumar) కనకపుర నుంచి పోటీ చేస్తారు. ఆయన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కానీ సిద్దరామయ్య పరిస్థితి అలా లేదు. సిద్దరామయ్య(Siddaramaiah) విజయానికి ఆయన అభిమానులు, పార్టీ వర్గాలు పనిచేసినా పార్టీలోని వ్యతిరేక కూటమి కూడా తీవ్రంగానే ప్రతిఘటిస్తోంది. బీజేపీకంటే జేడీఎస్‌ నేతలు సిద్దరామయ్య ఓటమికి ఎంతటికైనా వెనుకాడకూడదనే లక్ష్యంతో ఉన్నారు. ఇలా రెండుసార్లు ఉపముఖ్యమంత్రిగా, ఓసారి ముఖ్యమంత్రిగా కొనసాగిన సిద్దరామయ్య నియోజకవర్గం ఎంపిక చేసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2022-08-09T18:43:01+05:30 IST