యడియూరప్ప రాజీనామాపై మోదీకి సిద్ధరామయ్య సవాల్

ABN , First Publish Date - 2021-07-26T21:43:48+05:30 IST

ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ప్రజాస్వామ్య లక్షణం. కానీ వరుస రాజీనామాలు జరుగుతున్నాయి. దీనికి కారణమేంటో కర్ణాటక ప్రజలకు సమాధానం చెప్పాలి. యడియూరప్ప రాజీనామాకు గల కారణం ఏంటి? వయసు అయిపోయిందా? అవినీతా?

యడియూరప్ప రాజీనామాపై మోదీకి సిద్ధరామయ్య సవాల్

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయడంపై ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సెటైర్లు గుప్పించారు. అంతే కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓ ఛాలెంజ్ సైతం విసిరారు. ‘నా ఖావుంగా.. నా ఖానే దుంగా’ (తినను.. తిననివ్వను) అని మోదీ చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం వచ్చిందని, దమ్ముంటే యడియూరప్ప అవినీతిపై విచారణ చేపట్టాలని సిద్ధరామయ్య సవాల్ విసిరారు. సోమవారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన వరుస ట్వీట్లతో యడియూరప్ప, బీజేపీ, మోదీలపై విరుచుకుపడ్డారు.


‘‘యడియూరప్ప రాజీనామా ముందుగా ఊహించిందే. ఈ విషయాన్ని చాలా రోజుల క్రితమే నేను చెప్పాను. దీని గురించి ఇప్పుడు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కర్ణాటకలో అవినీతిమయమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయాక, అప్పుడు సంబరాలు చేసుకుందాం’’

‘‘ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ప్రజాస్వామ్య లక్షణం. కానీ వరుస రాజీనామాలు జరుగుతున్నాయి. దీనికి కారణమేంటో కర్ణాటక ప్రజలకు సమాధానం చెప్పాలి. యడియూరప్ప రాజీనామాకు గల కారణం ఏంటి? వయసు అయిపోయిందా? అవినీతా?’’

‘‘యడియూరప్ప అవినీతి గురించి భారతీయ జనతా పార్టీ నేతలే ప్రజాముఖంగా అనేకాసార్లు చెప్పారు. ‘తినను, తిననివ్వను’ ప్రధానమంత్రి పదే పదే చెప్తుంటారు. యడియూరప్ప అవినీతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసే దమ్ము నరేంద్రమోదీకి ఉందా?’’

అని వరుస ట్విట్లు చేశారు. ప్రతి ట్వీట్‌కు ‘‘బీఎస్‌వైరాజీనామా’’ అనే హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.

Updated Date - 2021-07-26T21:43:48+05:30 IST