పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా నంబర్‌వన్‌

ABN , First Publish Date - 2022-07-01T05:33:47+05:30 IST

పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభను కనబరిచారు. ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. గడిచిన ఐదేళ్ల నుంచి ఊరిస్తున్న అగ్రస్థానాన్ని సాధించింది. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లోనూ తొలిసారిగా జిల్లాకు 6వ స్థానం దక్కిన ఆనందాన్ని మరువకముందే ఎస్సెస్సీ ఫలితాల్లో ఏకంగా నంబర్‌వన్‌గా నిలవడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా నంబర్‌వన్‌
వందశాతం ఉత్తీర్ణత సాధించిన సిద్దిపేట ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంబరాలు

97.85 శాతంతో సత్తాచాటిన జిల్లా విద్యార్థులు

14,869 మందిలో 319 మంది ఫెయిల్‌

వంద శాతం ఉత్తీర్ణతతో పోటీపడిన సర్కారు స్కూళ్లు

విద్యార్థులకు మంత్రి హరీశ్‌ శుభాకాంక్షలు


పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభను కనబరిచారు. ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. గడిచిన ఐదేళ్ల నుంచి ఊరిస్తున్న అగ్రస్థానాన్ని సాధించింది. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లోనూ తొలిసారిగా జిల్లాకు 6వ స్థానం దక్కిన ఆనందాన్ని మరువకముందే  ఎస్సెస్సీ ఫలితాల్లో ఏకంగా నంబర్‌వన్‌గా నిలవడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూన్‌ 30 : జిల్లాలో 227 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 14 మోడల్‌ స్కూళ్లు, 22 కస్తూర్బా పాఠశాలలు, 16 ఎస్సీ గురుకులాలు, 9 బీసీ గురుకులాలు, 6 మైనార్టీ గురుకులాలు, ఒక ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులం ఉన్నాయి. అదే విధంగా 113 ప్రైవేట్‌ పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలలకు చెందిన 14,869 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 319 మంది ఫెయిల్‌ అయ్యారు.


సర్కారు విద్యాసంస్థల సత్తా

జిల్లాలోని సర్కారు ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా విద్యాలయాలు వంద శాతం ఫలితాల కోసం పోటీపడ్డాయి. 2018-19వ సంవత్సరంలో సర్కారు స్కూళ్లలో 99 శాతం ఫలితాలు సాధించాయి. ఈసారి 96 శాతం స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక 207 మందికి 10జీపీ పాయింట్లు వచ్చాయి. 9 పాయింట్లు  పొందిన విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంది. ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు దీటుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించడం విశేషం. కస్తూర్బాలు, గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు 99శాతం రిజల్ట్‌ దక్కించుకున్నాయి. జిల్లాలోని 14 మోడల్‌ స్కూళ్లలో 11 స్కూళ్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. అదే విధంగా 22 కస్తూర్బా పాఠశాలల్లో 18 పాఠశాలల్లో వంద శాతం విద్యార్థులు మంచి మార్కులతో పాసయ్యారు. 


మంత్రి హరీశ్‌ స్పెషల్‌ ఫోకస్‌

అన్నింట్లో అగ్రస్థానంగా ఉన్న సిద్దిపేట జిల్లాను పదో తరగతి ఫలితాల్లో నూ నంబర్‌ వన్‌గా నిలపాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గత నాలుగేళ్లుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2016-17వ సంవత్సరంలో 9 స్థానంలో ఉన్న జిల్లా మరింత మెరుగైన స్థానం పొందేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయనే స్వయంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేసి మార్గనిర్దేశనం చేశారు. పనితీరు బాగాలేని వారిని మందలించారు. ప్రతీ స్కూల్‌ వందశాతం సాధించేలా టార్గెట్లు విధించారు. ఫలితంగా కరోనాకు ముందు వరుసగా 3, 2 స్థానాల్లో జిల్లా దూసుకెళ్లింది. నాడు ఉత్తమ ఫలితాలు సాధించిన స్కూళ్లకు బహుమతులు అందజేశారు. అదే పట్టుదలను కొనసాగించడంతో ఈసారి అగ్రస్థానానికి చేరింది. పదో తరగతి చదివే ప్రతీ విద్యార్థికి మంత్రి హరీశ్‌రావు స్వయంగా ఉత్తరాలు రాసి ప్రొత్సహించారు. తాజా ఫలితాలతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.


పదో తరగతి ఫలితాలు ఇలా..

బాలురు బాలికలు మొత్తం

పరీక్షకు హాజరు 7589 7280 14869

పాసైనవారు 7365 7185 14550

ఫెయిలైనవారు 224 95 319



తొమ్మిది నుంచి ఒకటో స్థానానికి

సంవత్సరం శాతం ర్యాంకు

2016-17 90.63 9

2017-18 93.31 3

2018-19 99.33 2

2019-20 100       కరోనా 

2020-21 100       కరోనా

2021-22 97.85


Updated Date - 2022-07-01T05:33:47+05:30 IST