సిద్దిపేట పురపోరుకు 575 నామినేషన్లు

ABN , First Publish Date - 2021-04-19T06:07:06+05:30 IST

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన ఆదివారం అభ్యర్థులు భారీగా నామినేషన్లను దాఖలు చేశారు. 43 వార్డులకు 575 నామినేషన్లను వచ్చాయి. ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థిత్వాలను ఖరారు చేయకపోవడంతో ఆశావహుల నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల్లో టిక్కెట్‌ ఎవరికి దక్కుతుందోనన్న టెన్షన్‌ మొదలైంది.

సిద్దిపేట పురపోరుకు 575 నామినేషన్లు
సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయలో నామినేషన్ల దాఖలు కోసం వేచిచూస్తున్న అభ్యర్థులు

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ఘట్టం
చివరి రోజు బారులు తీరిన అభ్యర్థులు
టీఆర్‌ఎస్‌ నుంచే అత్యధికంగా 210 నామినేషన్లు
నేడు పరిశీలన..22 వరకు ఉపసంహరణ
ఇంకా తేలని బీఫాంల పంపకం
ప్రధాన పార్టీల ఆశావహుల్లో ఉత్కంఠ
సిద్దిపేట పట్టణంలో ఎన్నికల జోష్‌



ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్‌ 18 ; సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన ఆదివారం అభ్యర్థులు భారీగా నామినేషన్లను దాఖలు చేశారు. 43 వార్డులకు 575 నామినేషన్లను వచ్చాయి. ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థిత్వాలను ఖరారు చేయకపోవడంతో ఆశావహుల నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల్లో టిక్కెట్‌ ఎవరికి దక్కుతుందోనన్న టెన్షన్‌ మొదలైంది.  


నామినేషన్ల స్వీకరణ 16వ తేదీన ప్రారంభం కాగా ఆదివారంతో ముగిసింది. ఆఖరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు 15,  రెండో రోజు 169 రాగా చివరి రోజు 391 నామినేషన్లు దాఖలయ్యాయి. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయంలోనే వార్డుల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో నామినేషన్లను స్వీకరించారు. కాగా ఆదివారం సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ సమయంలోగా కార్యాలయ ఆవరణలో వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించారు. వారంతా నామినేషన్లు దాఖలు చేసే వరకు మరో గంట సమయం పట్టింది. ఇక ఉదయం నుంచి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు కావడంతో కార్యాలయ  ఆవరణంతా సందడిగా మారింది. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవే 210 నామినేషన్లు ఉన్నాయి. ఈనెల 22న సాయంత్రం 3 గంటల వరకే ఉపసంహరణ అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు సిద్దిపేట మున్సిపల్‌ బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు.

ఎటుచూసినా ఎన్నికల సందడే..

రాష్ట్రంలో మినీ మున్సిపల్‌ పోరుగా భావిస్తున్న ఈ ఎన్నికలు తెరమీదకు రావడంతో ఒక్కసారిగా సందడి మొదలైంది. సిద్దిపేటలో 34 వార్డుల నుంచి 43 వార్డులకు పెరగడంతో పోటీచేసే వారి సంఖ్య పెరిగింది. 1,00,653 ఓట్లు ఉన్న పట్టణంలో ఎక్కడ విన్నా, చూసినా ఇదే సందడి కనిపిస్తున్నది. ఆశావహులు, అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. ముందుగా టిక్కెట్ల పంపకం గురించే తీవ్ర చర్చ జరుగుతున్నది. పార్టీలకు అతీతంగా తమ అభ్యర్థులెవరోనని ఆరా తీస్తున్నారు. మొత్తంగా సిద్దిపేటలో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. 

టిక్కెట్‌ టెన్షన్‌

ఈనెల 21వ తేదీ వరకు బీఫాంలను సమర్పించే అవకాశం ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో 575 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో అధికారికంగా టిక్కెట్లు ఖరారైన వారి సంఖ్య 50కి మించదు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటివరకు 18 మంది పేర్లను ప్రకటించగా, బీజేపీ 21 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఎంఐఎం పార్టీసైతం నాలుగు వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇప్పటిదాకా ఒక్కరి పేరును ప్రకటించలేదు. కానీ ఈ పార్టీ తరఫున 56 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నేడు దాదాపు అన్ని వార్డులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ తరఫున 210 నామినేషన్లు సమర్పించారు. ఇందులో 43 మందిని మినహాయిస్తే మిగతా వారందరినీ విత్‌డ్రా చేయించే యోచనలో ఉన్నారు. ఒక్కో వార్డులో ముగ్గురు నుంచి పది మంది దాకా టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్లు వేశారు. ఇందులో ఒక్కరికే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిత్వం దక్కనుంది. మిగతా వారిని రాజీ కుదిర్చేపనిలో ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటివరకు 18 మంది పేర్లను ప్రకటించగా.. మిగతా 25 వార్డుల్లో ఆశావహులు, వారి అనుచరులు నరాలు బిగపట్టే ఉత్కంఠను అనుభవిస్తున్నారు. బీజేపీ సైతం ఇంకా 22 వార్డుల్లో తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది.


గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ 12వ వార్డుకు 15 నామినేషన్లు 

గజ్వేల్‌, ఏప్రిల్‌ 18: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు జరుగుతున్న ఉప ఎన్నికకు ఐవోసీలోని ఏ బ్లాక్‌లో నామినేషన్లను స్వీకరణను నిర్వహించారు. చివరి రోజు వరకు మొత్తం 10 మంది అభ్యర్థులు 15 నామినేషన్లను దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి అత్తెల్లి శ్రీనివాస్‌, గుడ్డోజు పరమేశ్వరాచారి, కోనాపురం దినేశ్‌, బొగ్గుల సురేశ్‌, కాంగ్రెస్‌ నుంచి మహ్మద్‌ సమీయొద్దీన్‌, నాయిని సత్యలక్ష్మి, నాయిని యాదగిరి, ఇప్ప ప్రభాకర్‌, బీజేపీ నుంచి ఉప్పల మధుసూదన్‌, తుమ్మ భవిత, స్వతంత్రులుగా బొగ్గుల సురేశ్‌, తుమ్మ భవిత నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను మునిసిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట కమిషనర్‌ వెంకటగోపాల్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి  కరీమొద్దీన్‌న్నారు. 

Updated Date - 2021-04-19T06:07:06+05:30 IST