వేగంగా వచ్చే తుమ్మును ఆపితే ఏం జరుగుతుంది..?

ABN , First Publish Date - 2021-10-08T03:08:34+05:30 IST

తుమ్మును చాలా మంది అపశకునంలా భావిస్తారు. బయటకెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే.. శుభమా అంటూ బయటికెళ్తుంటే ఈ తుమ్ములేంటో అని అసహ్యించుకుంటూ.. కాసేపు కూర్చున్న తర్వాత బయలుదేరతారు. ఏదైనా శుభకార్యం

వేగంగా వచ్చే తుమ్మును ఆపితే ఏం జరుగుతుంది..?

తుమ్మును చాలా మంది అపశకునంలా భావిస్తారు. బయటకెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే.. శుభమా అంటూ బయటికెళ్తుంటే ఈ తుమ్ములేంటో అని అసహ్యించుకుంటూ.. కాసేపు కూర్చున్న తర్వాత బయలుదేరతారు. ఏదైనా శుభకార్యం ప్రారంభమవుతున్నప్పుడు ఎవరైనా తుమ్మితే.. వారి వైపు అంతా కోపంగా చూస్తారు. అప్పుడు చిన్నబోవడం.. తుమ్మిన వ్యక్తి వంతవుతుంది. అందుకే అలాంటి సందర్భాల్లో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ.. కొందరు బలవంతంగా తుమ్మును ఆపే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు...


గొంతు నుంచి ముక్కు వరకు ఉన్న మార్గంలో ఏదైనా అవరోధం కలగటం, ఏవైనా రేణువులు లోపలికి వెళ్తున్నప్పుడు వాటిని ఆపటానికి లేదా త్యజించటం కోసం తుమ్మును ప్రేరేపిస్తుంది. తుమ్ము వచ్చినపుడు ఊపిరితిత్తుల నుంచి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలి బయటకు వస్తుంది. దీంతోనే దుమ్ము తదితరాలు బయటకు పోతాయి. మనం గాలిని పీల్చుకునే సమయంలో పలు రేణువులు సులభంగా ఊపిరితిత్తులలోకి చేరతాయి. వీటిని బయటకు పంపేందుకు శరీరంలో మ్యూకస్‌ తయారవుతుంది. ఈ మ్యూకస్‌ ఊపిరితిత్తులలో పేరుకున్నప్పుడు దగ్గు వస్తుంది. అలా కాకుండా పైకి ఉన్న సమయంలో తుమ్ము వస్తుంది.



ఏ సందర్భమైనా సరే.. తుమ్ము వస్తే మాత్రం ఆపొద్దంటున్నారు వైద్యులు. ఇలా చేస్తే అపశకునం మాట అటుంచి.. శరీరంలోని పలు అవయవాలకు కీడు జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. తుమ్ము వచ్చే సమయంలో అత్యధిక వేగం ఉంటుందట. అంత వేగాన్ని ఒక్కసారిగా ఆపితే.. ఆ బలమైన గాలి ప్రభావం.. ముక్కు, చెవి, గొంతు తదితర అవతర అవయవాలపై పడుతుందని చెబుతున్నారు. దీని కారణంగా కణాలు దెబ్బతినే అవకాశాలు ఉంటుందట. అలాగే మెదడుపై కూడా ప్రభావం చూపుతుందట. ఆయుర్వేదం ప్రకారం... తుమ్ములు, ఆవలింత, మూత్ర విసర్జన తదితర 13 అంశాలను అధారణీయ వేగాలు అంటారు. అంటే ఆపుకోవటానికి ప్రయత్నించకూడని దాని అర్థం.


తుమ్మును బలవంతంగా ఆపితే.. ఒక్కోసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. తుమ్ములోని గాలిని ఆపితే.. గుండె, మెదడు కణజాలాల్లోకి ప్రవేశించడం వల్ల అసలుకే మోసం వస్తుందట. ఒక్కోసారి మెదడులోని రక్త నాళాలు సైతం పగిలిపోయే ప్రమాదం ఉంటుందని యూకేలోని యూనివర్సిటీ హాస్పిటల్స్‌ ఆఫ్‌ లీచెస్టర్‌కు చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే తుమ్ము వచ్చినప్పుడు ఆపకుండా.. ముక్కు, నోటిపై రుమాలు పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Updated Date - 2021-10-08T03:08:34+05:30 IST