పక్కదారి తంత్రం

ABN , First Publish Date - 2021-11-16T05:52:38+05:30 IST

సమస్యలను పరిష్కరించి ప్రజలను మెప్పించడం కంటే.. వాటిని పక్కదారి పట్టించడం మేలు అన్నట్లుగా రాష్ట్రంలో పాలన సాగుతోంది.

పక్కదారి తంత్రం

  1. సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
  2. చిన్న గీత పక్కనే పెద్ద గీతతో గందరగోళం
  3. ప్రజలను మభ్యపెడుతున్న అధికార పార్టీ నేతలు
  4. బాబాయ్‌ హత్య కేసు వివాదంతో రాజధానుల చర్చ
  5. ఏడాదిన్నర గడిచినా ముందుకు సాగని హైకోర్టు అంశం
  6. అప్పుడు అమరావతికి జై.. ఇప్పుడు మూడు రాజధానులకు సై


కర్నూలు, ఆంధ్రజ్యోతి: సమస్యలను పరిష్కరించి ప్రజలను మెప్పించడం కంటే.. వాటిని పక్కదారి పట్టించడం మేలు అన్నట్లుగా రాష్ట్రంలో పాలన సాగుతోంది. ఎప్పటికపుడు చిన్న సమస్య పక్కన పెద్ద సమస్యని సృష్టిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తోంది. ఇసుక సమస్యపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో మద్యం ధరలను పెంచారు. వాటిపై విమర్శలు పెరిగే లోపే మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చారు. అదేమిటని ప్రశ్నించేలోపు కర్నూలుకు హైకోర్టు ఇస్తున్నామని ప్రకటించారు. రెండున్నరేళ్లుగా హైకోర్టు కోసం ఒక్క ఇటుక కూడా వేయలేదు. తాజాగా ప్రజలను సీమ సెంటిమెంట్‌ పేరిట వైసీపీ ప్రభుత్వం కట్టిపడేస్తోంది. ఈలోగా సంచలన సాక్ష్యాలతో బాబాయ్‌ హత్య కేసులో సూత్రధారుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వైసీపీ అధినాయకత్వం నుంచి జిల్లా ప్రజాప్రతినిధులకు మరో పెద్ద గీత గీయాలని ఆదేశం అందింది. అదే మూడు రాజధానులపై చర్చ పేరిట రచ్చ. రెండున్నరేళ్ల అధికారంలో అభివృద్ధి చేసింది లేకపోగా, ప్రజల్లో ఉద్వేగాలు రెచ్చగొట్టి ఆనందిస్తోంది. 


ఏడాదిన్నరగా..


2019, డిసెంబరు 17న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల అంశాన్ని సూచన ప్రాయంగా సీఎం జగన్‌ ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ జనవరి 21న శాసన సభలో బిల్లు పాస్‌ చేశారు. అప్పటికే వందల రూ.కోట్లతో నిర్మాణంలో ఉన్న అమరావతిని ఎందుకు తరలిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా రాయలసీమ నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అంతలో రాజధానుల తరలింపు అంశం హైకోర్టుకు చేరింది. ఏడాదిన్నరగా జరుగుతున్న ఆ అంశంపై ఆరంభంలోనే అభ్యంతరాలు తారస్థాయికి చేరాయి. న్యాయ రాజధాని వస్తే రాయలసీమ అభివృద్ధి జరుగుతుందని, ఉద్యోగాలు వస్తాయని, లోకల్‌ నాయకులతో అధిష్ఠానం ప్రచారాలు చేయించడంతో పరిస్థితి కొంత చల్లబడింది. అయితే అమరావతి నుంచి విశాఖపట్నానికి రాజధానిని తరలిస్తే ముఖ్యంగా నష్టపోయేది రాయలసీమ వాసులేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి దూరంగా విసిరేసినట్లుగా తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉండే కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి సుమారు వెయ్యి కి.మీ. పైనే ప్రయాణం చేసి వెళ్లాలంటే సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు. ఒక్క రోజులో పూర్తి కావాల్సిన పనులు 3-4 రోజుల దాకా కొనసాగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ న్యాయ రాజధాని కోసం అందరూ నోళ్లు నొక్కుకున్నారు. కట్‌ చేస్తే ప్రకటన జారీ చేసి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ హైకోర్టు కోసం కర్నూలులో స్థల సేకరణే పూర్తి కాలేదు. పునాదికి ఒక్క ఇటుక కూడా పడలేదు. కనీసం శంకుస్థాపన జరగలేదు. అదేమని అడిగితే ప్రధాన మంత్రి మోదీ అంగీకరిస్తేనే హైకోర్టు సాధ్యమని జిల్లా ప్రజాప్రతినిధులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అదే నిజమైతే న్యాయ రాజధాని అంటూ ప్రచారాలు చేసే ముందు మోదీ అంగీకరిస్తారో లేదో స్పష్టత తీసుకోవాల్సిన బాధ్యత కూడా నాయకులపై లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 


హత్య కేసు డైవర్షన్‌ కోసం


వైఎస్సార్‌ కుటుంబంలో వివేకానంద పాత్ర చాలా కీలకమైనది. సౌమ్యుడైన ఆయనను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఈ ఉదంతాన్ని అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ టీడీపీ ప్రభుత్వంపై తోసేశారు. తాజాగా వివేకానంద డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లో పెద్ద పేర్లు బయటకొచ్చాయి. అందుకు సంబంధించిన వివరాలను ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో పూర్తి వివరాలతో ప్రచురిస్తోంది. దీంతో అధికార పార్టీ నాయకులకు చెమటలు పట్టడం మొదలైంది. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ అధినాయకత్వం వెంటనే చర్యలు చేపట్టింది. జిల్లా నాయకులు ‘అధికార వికేంద్రీకరణ - మూడు రాజధానుల ఏర్పాటు’ పేరుతో రెండు రోజులు నగరంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్లో సదస్సులు నిర్వహించారు. పోనీ అందులో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారా అంటే కేవలం అధికార పార్టీ నాయకులు మాత్రమే హాజరయ్యారు. రాయలసీమకు అదీ కర్నూలు జిల్లాకు అన్యాయం జరిగిపోతున్నట్లు ప్రసంగాలు చేశారు. గతంలో అమరావతికి జై కొట్టిన చాలా మంది నాయకులు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడం కొసమెరుపు. 2019కి ముందు ఎస్వీ మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, బుట్టా రేణుక తదితరులు టీడీపీ జెండా మోశారు. ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం నుంచి ఆదేశాలు రాగానే ఉరుకులు పరుగులపై మూడు రాజధానులకు జై కొట్టేస్తున్నారు. అది కూడా వివేకానంద హత్య సాక్ష్యాధారాలు బయటికొచ్చిన మరుక్షణమే మూడు రాజధానులు ఎందుకు గుర్తుకొచ్చాయన్నది ఆ నాయకులకే తెలియాలి. 


చిన్న గీత పక్కన..


రెండున్నరేళ్ల పాలనలో ఎప్పటికప్పుడు తప్పుల్ని కప్పి పుచ్చుకోవడం మినహా ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఒక సమస్యకు మరో సమస్యను ముడేసి జనాల్లో గందరగోళం సృష్టించడంలో ఈ ప్రభుత్వం దిట్ట అని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవల భారీగా పెంచేసిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల కోసమే అని కబుర్లు చెప్పుకొచ్చారు. రెండున్నరేళ్ల కాలంలో జిల్లా రోడ్లపై ప్రయాణాల కంటే ప్రమాదాలే ఎక్కువగా జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం ఆ ప్రకటన ఎలా చేసిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యాధారాలతో సహా వివేకా హత్యపై బయటపడ్డ సాక్ష్యాలపై స్పందించాలని, ఆ తర్వాతే ఇతర అంశాలపై చర్చలు, సమావేశాలకు ప్రజాప్రతినిధులు హాజరుకావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-11-16T05:52:38+05:30 IST